top of page

మళ్లీ రగులుతున్న నేపాల్

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 2 min read

ప్రపంచంలో ఏకైక హిందూ దేశంగా గుర్తింపు పొందిన హిమాలయ దేశం నేపాల్ మనకు పొరుగు రాజ్యమే. పురాతన అఖండ భారతదేశంలో అంతర్భాగంగా ఉండి.. ఆ తర్వాత స్వతంత్ర దేశంగా అవతరించిన నేపాల్‌తో ఇప్పటికీ మనకు సుదృఢమైన సుహృద్భావ సంబంధాలు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ఓపీ శర్మ ఓలి ప్రభుత్వం భారత్ పట్ల కొంత విరోధ వైఖరి ప్రదర్శించినా గతంలో రాచరికం ఉన్నప్పుడు గానీ.. రాచరికం పోయి ప్రజాప్రభుత్వాలు వచ్చిన తర్వాత గానీ ప్రభుత్వాల పరంగా, సామాజికంగా ఇరుదేశాల ప్రజల మధ్య నిరంతర సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. కానీ నేపాల్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం రెండు దేశాల.. ముఖ్యంగా సరిహద్దుల్లోని నేపాల్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగహ్రం రేపుతోంది. భారత్ నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చిన రూ.వంద విలువకు మించిన వస్తువులపై భారీ కస్టమ్స్ సుంకాలు విధిస్తూ బాలేంద్ర షా నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఇరుదేశాల నడుమ ఉన్న సత్సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా నేపాల్ ప్రజలపై ఆర్థికభారం పెంచుతుంది. సాధారణంగా దేశాలను విడదీసే అంతర్జాతీయ సరిహద్దుల్లో నిఘా, తనిఖీలు అత్యంత కఠినంగా ఉంటాయి. అనుమతి లేనిదే చీమయినా సరిహద్దులు దాటి రాలేనంత కఠినమైన పహారా ఉంటుంది. కానీ భారత్`నేపాల్ సరిహద్దుల్లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించదు. చెక్‌పోస్టులు, తనిఖీలు ఉన్నా.. ఆ దేశ ప్రజలు మన దేశంలోకి.. మన దేశ ప్రజలు ఆ దేశంలోకి చాలా సునాయసంగా రాకపోకలు సాగిస్తుంటారు. అక్కడి యువత పెద్దసంఖ్యలో మన దేశంలో చదువుకుంటుంటారు. ఉద్యోగాలు చేస్తుంటారు. ఇలా మన దేశానికి రాకపోకలు సాగించే నేపాలీలు ఇక్కడి వస్తువులు కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. అయితే కొత్తగా కొలువుదీరిన బాలెన్‌షా ప్రభుత్వం దీన్ని కట్టడి చేసింది. భారత్ నుంచి కొనుగోలు చేసే 100 నేపాలీ రూపాయల కంటే ఎక్కువ విలువైన వస్తువులపై ఐదు నుంచి 80 శాతం వరకు కస్టమ్స్ సుంకాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రభుత్వంపై అసంతృప్తి రగిల్చి దేశవ్యాప్త ఉద్యమానికి దారితీసింది. కస్టమ్స్ సుంకం విధింపు వల్ల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు, వ్యాపారులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు, ఇది ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెట్టింది. భారత-నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లోని నేపాలీలు అవసరమైన నిత్యవసర వస్తువులు, మందులు, ఎలక్ట్రానిక్స్, బట్టలు వంటి వాటికి సమీపంలోని భారతీయ మార్కెట్లపై ఆధారపడుతుంటారు. ఇంతకుముందు ఇలా కొనుగోలు చేసి తీసుకెళ్లే సరుకులపై ఎటువంటి సుంకాలు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు భారీగా పన్ను వడ్డించడం ఆర్థికంగా నేపాలీలను ఇబ్బందిపెడుతుంది. ముఖ్యంగా భారత్‌లో వస్తువులు కొని నేపాల్ గ్రామాల్లో అమ్ముకునే చిరు వ్యాపారులు, వివాహాలు వంటి పెద్ద కార్యక్రమాలకు సరుకులు కొనుగోలు చేసేవారికి దిగుమతి సుంకం తలకు మించిన భారంగా మారింది. దాంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ డార్జిలింగ్ నుంచి ధార్చులా వరకు సరిహద్దు మార్కెట్లలో నిరసనలు మిన్నంటుతున్నాయి. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం స్వల్ప వ్యవధిలోనే ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ మళ్లీ అనిశ్చితికి బాటలు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. గతంలో అధికారంలో ఉన్న కేపీ శర్మ ఓలి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడం, సోషల్ మీడియాపై నిషేధం విధించడం వంటి చర్యలతో జెన్ జెడ్‌గా పిలిచే యువతరాన్ని ఉద్యమబాట పట్టించింది. ఫలితంగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం ప్రభుత్వాన్ని కూలదొసి, ఎన్నికలకు దారి తీసింది. నాటి ఎన్నికల్లో యువతరం ప్రతినిధిగా పేరొందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ నేత, ఖఠ్మాండు మేయర్ బాలేంద్ర షా(బాలెన్‌షా) ప్రధానిగా కొత్త ప్రభుత్వం గద్దెనెక్కింది. బలేంద్ర షా ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలల్లోనే నేపాల్ రాజకీయాలు అస్థిరంగా మారడం ప్రారంభమైంది. అవినీతిరహిత పాలన అందిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బలేన్ షా ప్రభుత్వం గత పాలకులు చేసిన అవే పొరపాట్లనే చేస్తున్నదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దశాబ్దాల రాజకీయ నేతల అవినీతి ఆస్తులను వెలికితీసేందుకు ప్రభుత్వం విచారణ ప్రారంభించినప్పటికీ ప్రజలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తితోనే ఉన్నారు. పాతుకుపోయిన అవినీతిని ఎలా అరికట్టాలో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. మరోవైపు కొత్త ప్రభుత్వంలోనూ అవినీతి కంపు పోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వయంగా ఇద్దరు మంత్రులు ఆరోపణల్లో కూరుకుపోవడం పరిస్థితిని స్పష్టం చేస్తున్నది. మనీలాండరింగ్ ఆరోపణలతో దేశ ీVAంమంత్రి సుదన్ గురుంగ్ ఈ నెల 22న పదవికి రాజీనామా చేశారు. కాగా తన భార్యను హెల్త్ ఇన్సూరెన్స్ బోర్డులో అనుచితంగా చోటు కల్పించినందుకు కార్మిక మంత్రి దీపక్ సాVŸt²ను పదవి నుంచి తొలగించాల్సి వచ్చింది. వీటన్నింటికీ మించి ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం అగ్గి రాజేస్తున్నది. గతంలో జెన్ జీ ఉద్యమం అండతోనే అధికారం అందుకున్న బాలెన్‌షా ప్రభుత్వం ఇప్పుడే అదే జెన్ జీపై ఉక్కుపాదం మోపే నిర్ణయాలు తీసుకుంటున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే యÖనివర్సిటీలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాలను, వాటి కార్యకలాపాలను పూర్తిగా నిషేధించింది. దీంతో విద్యార్థులు, యువతరం మళ్లీ రోడ్డెక్కుతున్నారు. ప్రజల అసంతృప్తి పార్లమెంటును తాకుతుందన్న భయంతో ఏప్రిల్ 30న జరగాల్సిన సమావేశాలను తగిన కారణాలు లేకుండా వాయిదా వేయడం బాలెన్‌షా పలాయనవాదానికి నిదర్శనమన్న విమర్శలు రేగుతున్నాయి. ఈ పరిణామాలన్నీ కలిసి నేపాల్‌ను మళ్లీ ఏడాది క్రితంనాటి ఉద్యమాల బాటలోకి తీసుకెళ్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అదే నిజమైతే దేశవ్యాప్తంగా మరో తిరుగుబాటు ఖాయం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page