top of page

అంకె ఘనం.. విలువ హీనం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 1 day ago
  • 2 min read
  • పది మిలియన్ రియాల్స్ కరెన్సీ నోటు

  • తాజాగా విడుదల చేసిన ఇరాన్ ప్రభుత్వం

  • ఆర్థిక వ్యవస్థ దుస్థితికి దర్పణం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ఈ నోటు చూశారా? అందులో పైనున్న అంకె.. అందులో ఉన్న సున్నాలు చూస్తే అమ్మో.. ఇన్ని సున్నాలా? అనిపించడం లేదూ! ఇంతకీ ఆ అంకె ఎంతో చెప్పగలరా? అని అడిగితే చాలామంది నోరెళ్లబెట్టడం ఖాయం. ఇంకొంతమంది చిన్నప్పుడు ఒకట్లు, పదులు, వందలు, వేలే అని గుణించినట్లు కాసేపు గుణించి ఫైనల్ అంకె చెప్పవచ్చు. ఇంతకూ ఆ అంకె విలువ ఎంతంటే.. కోటి. ఇరాన్ ప్రభుత్వం ముద్రించి ఈ మధ్యే విడుదల చేసిన ఈ నోటు విలువ ఇరాన్ కరెన్సీ అయిన రియాల్స్ లెక్కలో చెప్పాలంటే అక్షరాల పది మిలియన్ల రియాల్స్ అన్నమాట! ఇంత పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోటును బహుశా ఇంతవరకు ఏ ప్రపంచ దేశం కూడా జారీ చేసి ఉండకపోవచ్చు. ఈ కరెన్సీ నోటు విలువ ఇరాన్ వరకు ఊహించనంత పెద్దదిగా ఉండొచ్చు.. కానీ అంతర్జాతీయ ద్రవ్య చెలామణీలోకి వస్తే మాత్రం అది చాలా మొత్తమేనంటే మరింత ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే పది మిలియన్ల ఇరాన్ రియల్స్‌ను మన భారతీయ రూపాయల్లోకి మారిస్తే దాని విలువ రూ.650 మాత్రమే వస్తుంది. అదే అమెరికన్ కరెన్సీతో మార్పిడి చేస్తే వచ్చేది కేవలం ఏడు డాలర్లు మాత్రమే. ఇరాన్ కరెన్సీ విలువ ఇంత తక్కువగా ఉండటానికి కారణం ఆ దేశంలో ఏళ్లతరబడి కొనసాగుతున్న సంక్షుభిత పరిస్థితులే. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా ఆంక్షలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వెనువిరిచేశాయి. ఫలితంగా ధరలు ఏమాత్రం అందుబాటులో లేకుండాపోయాయి. ద్రవ్యోల్బణం అదపుతప్పి ఎగసిపడుతోంది. మన దగ్గర ఒక నానుడి ఉంది. ఒకనాడు ఒకనోటుతో వెళ్లి సంచెడు సరుకులు తెచ్చుకునేవారం.. కానీ ఇప్పుడు బ్యాగు నిండా నోట్లు తీసుకెళ్లినా అన్ని సరుకులు తెచ్చుకులేని పరిస్థితి ఉందంటున్నారు. ఇప్పుడు సరిగ్గా ఇరాన్‌లో అదే దుస్థితి ఉంది. సంచుల నిండా నగదు తీసుకెళ్లాల్సిన గుప్పెడు సరుకులు కొనలేకపోతున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికే ఇరాన్ ప్రభుత్వం తక్కువ నోట్లతో ఎక్కువ లావాదేవీలు జరపడానికి వీలుగా 10 మిలియన్ రియాల్స్ నోటును ప్రవేశపెట్టిందని భావిస్తున్నారు. కాగా ప్రస్తుత యుద్ధకాలంలో ఇరాన్ ప్రజలు డిజిటల్ పేమెంట్స్ కంటే చేతిలో నగదు ఉంచుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలు ఎప్పుడు ఆగిపోతాయోనన్న భయంలో ఏటీఎంల వద్ద గంటల తరబడి పడిగాపులు పడి మరీ డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నారు. దాంతో నగదుకు డిమాండ్ పెరిగింది. అధిక విలువ కలిగిన నోటు విడుదలకు అది కూడా ఒక కారణమని విశ్లేషిస్తున్నారు. కాగా నోటు మీద 10 మిలియన్ల రియాల్స్ అక్షరాలు గొప్పగా కనిపిస్తున్నా ఆ నోటుతో వచ్చే వస్తువులు మాత్రం చాలా తక్కువే. ఒకప్పుడు వందల్లో ఉండే వస్తువుల ధరలు ఇప్పుడు వేలు, లక్షలకు చేరుకున్నాయి. అంతర్జాతీయ ఆంక్షలు, ఆర్థిక నిర్వహణలో లోపాలు వెరసి ఇరాన్ కరెన్సీని ప్రపంచంలోనే అత్యంత బలహీనంగా మార్చేశాయి. లావాదేవీల సౌలభ్యం కోసం పెద్ద నోట్లు తేవడం తాత్కాలిక ఉపశమనమే కానీ.. ధరల పెరుగుదలను అరికట్టలేకపోతే ఇరాన్ భవిష్యత్తు పెద్ద సున్నాగా మిగిలిపోతుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page