top of page

అం‘తరాల’ వెక్కిరింతలెందుకు?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 10 hours ago
  • 3 min read

మా కాలమే ఎంతో హాయిగా ఉండేది. అంతా కలుపుగోలుగా ఉండేవాళ్లం, ఏ సౌకర్యాలు లేకపోయినా పరస్పరం సహకరించుకునేవాళ్లం.. ఇప్పుడెన్ని సౌకర్యాలు వచ్చినా ఎవరికివారే యమునాతీరే.. ఒంటరి బతుకులే’.. పెద్దవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు తరచూ వారి నుంచి వినిపించే మాటలివే. పాత తరం బతుకుల ముందు ఇప్పటి జీవితాలు ఎందుకూ పనికిరావన్నట్లు వ్యాఖ్యనిస్తుంటారు. ‘ఆ రోజులే వేరు.. మళ్లీ ఆ కాలానికి వెళ్లిపోవాలని ఉందంటూ’ ఈమధ్య సోషల్ మాడియాలో కూడా చాలా పోస్టులు కనిపిస్తున్నాయి. మరికొందరు ఇంకా ముందుకెళ్లి జనరేషన్ జెడ్ (జెన్ జీ)గా పేర్కొనే ఈ తరం యువత గురించి చాలా అపోహలు, అతిశయోక్తులు ప్రచారం చేస్తుంటారు. కానీ ఈ రెండూ కరెక్ట్ కాదు. ఎవరికివారు తామే మంచివారం అన్నట్లు చెప్పుకోవడం మానవనైజం. అదేవిధంగా ఏ తరానికి ఆ తరం.. మాదే మంచి తరం అని చెప్పుకోవడం సహజం. అదే నిజమని అనుకున్నాం. ఆ క్రమం తమ తర్వాత తరాలను చిన్నచూపు చూడటం సమంజసం కాదు. కాలంతోపాటు తరాలు మారడం సహజ పరిణామక్రమం. ఈ తరాల మార్పును గుర్తించడం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచే మొదలైంది. ఆ యుద్ధం తర్వాత అనేక దేశాల్లో జనాభా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ పరిణామాన్ని ‘బేబీ బూమ్ ’ అని పిలిచారు. ఆ మేరకు 1946` 64 మధ్య జన్మించిన తరాన్ని బేబీ బూమర్స్ అని వ్యవహరిస్తారు. కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణతో జీవించడం, ప్రభుత్వ ఉద్యోగాలు లేదా స్థిరమైన వృత్తుల్లో చేరడం, కుటుంబ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడం, సంప్రదాయాలు, కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇవ్వడం ఆ తరం ప్రధాన లక్షణాలు. ఆ తర్వాత వచ్చిన తరం సంప్రదాయ జీవన విధానం నుంచి ఆధునికత వైపు జరిగిన మార్పును ప్రత్యక్షంగా చూసిన తరం. 1965`80 మధ్య జన్మించిన వీరిని జనరేషన్ ఎక్స్ (జెన్ ఎక్స్) అని పిలిచారు. టెలివిజన్, రేడియో వంటి మాధ్యమాల ప్రభావంలో పెరిగిన ఈ తరం సంప్రదాయ విలువలు, ఆధునిక భావాల మధ్య వారధిలా నిలిచింది. స్వతంత్ర ఆలోచన ధోరణి, ఉద్యోగ భద్రతతో పాటు వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇవ్వడం, కుటుంబ బాధ్యతలను సమతుల్యంగా నిర్వహించడం ఈ తరం ముఖ్య లక్షణాలుగా చెప్పవచ్చు. అనంతరం వచ్చిన తరాన్ని జనరేషన్ వై (జెన్ వై) లేదా మిల్లేనియల్స్ అని పిలిచారు. 2000 సమయంలో యువతగా ఉండి 1981`96 మధ్య జన్మించిన వారికి ఈ పేరు వచ్చింది. టెలికాం, ఇంటర్నెట్ విప్లవాన్ని ప్రత్యక్షంగా చూసిన తరం ఇది. సంప్రదాయ గోడలను ఛేదించుకుని డిజిటల్ ప్రపంచంలోకి అడుగులు వేసిన మొదటితరం కూడా ఇదే. చదువు, కెరీర్‌లో తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నది ఈ తరమే. ఇక 1997`2012 మధ్య జన్మించిన వారిని జనరేషన్ జెడ్ (జెన్ జీ) అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ తరం విద్యార్థులుగా, ఉద్యోగార్థులుగా, యువ వృత్తి నిపుణులుగా సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నది. చిన్నప్పటి నుంచే స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా, డిజిటల్ సాంకేతికతల మధ్య పెరిగిన ఈ తరం దాదాపు డిజిటల్ ప్రపంచంలోనే ఉంటున్నది. జనరేషన్ ఏదైనా ఆకలితో ఉన్నవాడికి ముందు కడపు నిండాలి. అది ఎలాంటి ఆహారం అన్న పట్టింపు ఉండదు. ఒకసారి కడుపు నిండిన తర్వాత అప్పుడు టేస్ట్, ఛాయిస్ వంటివన్నీ గుర్తుకొస్తాయి. ఆ తర్వాత కట్టుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయా, చెప్పులు లేదా షూలు ఉన్నాయా అని ఆలోచిస్తాడు. తర్వాత ఉండటానికి ఇల్లు, ఆ తర్వాత గౌరవం కోరుకుంటాడు. ఏ తరంలోనైనా ఇవి కామన్. వీటి చుట్టూనే ఆధునిక సౌకర్యాలు, ఆవిష్కరణలు పరిభ్రమిస్తుంటాయి. కాలం మారడంతో పాటు సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పుడు మనిషి అలవాట్లు కూడా మారుతుంటాయి. ఆ తరంలో ఏవి అందుబాటులో ఉంటే వాటినే వినియోగించి జీవించడానికి మనిషి ఇష్టపడతాడు. అంతేతప్ప పాత వాటినే పట్టుకుని వేలాడాలనడంలో అర్థం లేదు. చదువు పూర్తయ్యాక ఎవరికైనా మొదట కావాల్సింది ఉద్యోగమే. జీతం ఎంతైనా పర్వాలేదు అని చెబుతారు. ఉద్యోగం వచ్చిన కొంతకాలానికి జీతం గురించి ఆలోచిస్తారు. ఈ విధంగా ఏ జనరేషన్‌లోనైనా మనిషి ప్రాథమిక ప్రవర్తనలో పెద్ద మార్పుండదు. మారేది పరిస్థితులు, అవకాశాలు, సాధనాలు మాత్రమే. అవసరాలు, కోరికలు, గుర్తింపు కోసం చేసే ప్రయాణం మాత్రం దాదాపు ఒకటే. ప్రయాణించే విధానంలో మార్పు ఉండవచ్చు, ప్రయాణ సాధనాలు మారవచ్చు కానీ గమ్యం మాత్రం ఒక్కటే. జీవితం అంటే అనుభవాలను సంపాదించుకోవడం. ప్రతి తరం తమ కాలం, పరిస్థితులు, అవకాశాలకు అనుగుణంగా తమదైన అనుభవాలను ఏర్పరచుకుంటుంది. అందువల్ల మా కాలంలో ఆర్కుట్ వాడేవాళ్లం.. ఇప్పుడు దాన్ని వదిలేసి స్నాప్‌చాట్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారని అర్థం లేని వాదన. ఇప్పుడు ఆర్కూట్ స్థానంలో లేటెస్ట్ వెర్షన్లు వచ్చేశాయి. అలాగే ఆ కాలంలో ఇన్‌స్టాగ్రామ్ వాడదాం అనుకున్నా, అప్పుడు అది లేదు కదా. అందువల్ల ఇలాంటి కంపారిజన్లు నిర్హేతుకం. ఊళ్లలో లంకంత ఇళ్లు ఉన్న వారి పిల్లలు కూడా చదువులు అయ్యాక హైదరాబాద్ వచ్చి, తమ ఇంటి బాత్‌రూమ్ అంత కూడా ఉండని ఇరుకైన హాస్టల్, పీజీ గదుల్లో షేరింగ్‌లో ఉంటూ కోచింగ్‌లు తీసుకుంటూ ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తున్న విషయం నిజం కాదా! మన కాలాన్ని ఈ కాలంతో పోల్చడం కంటే కాలం ఎలా మారిందో అర్థం చేసుకోవడం ముఖ్యం. ప్రతి తరానికి తమదైన వాతావరణం, పరిస్థితులు, పరిమితులు, అవకాశాలు, సదుపాయాలు ఉంటాయి. ఒక తరం ఎదుర్కొన్న సవాళ్లు మరో తరంలో ఉండకపోవచ్చు. అలాగే ఈ తరం ఎదుర్కొంటున్న సవాళ్లు అప్పటి తరానికి తెలియకపోవచ్చు. అందుకే పోల్చడం కంటే అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం మంచిది. ఎప్పటికి ఏది అవసరమే దాన్ని అనుసరించడమే జీవనమార్గం. మానవజాతికి అనుసరణీయం అనేది అనేక సందర్భాల్లో రుజువైన వాస్తవం. తరాల అంతరాలు వెతకడం అసమంజసం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page