top of page

షర్మిలకు అందుకే హ్యాండిచ్చారు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 7 hours ago
  • 3 min read

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. పార్టీలు, నాయకులు ఇచ్చే హామీలు, చెప్పే మాటలదీ అదే పరిస్థితి. అప్పటికి ఏది పనికొస్తుందనుకుంటే అదే చేస్తారు.. చెప్తారు. భవిష్యత్తు గురించి చేసే బాసలు మాత్రం దైవాధీనం. ప్రస్తుత రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ముంగిట ఇదే మరోసారి రుజువవుతోంది. కాంగ్రెస్ అధిష్టానం బాధితురాలిగా ఈసారి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల నిలిచారు. రాజ్యసభకు పంపిస్తామని పార్టీ ఆమెకు ఇచ్చిన హామీ పెండింగులో ఉంది. దాన్ని నెరవేర్చే అవకాశం కూడా ముంగిట్లోకి వచ్చింది. ఎందుకైనా మంచిదని వారం క్రితం షర్మిల స్వయం ఢిల్లీకి వెళ్లి ‘నా సంగతేంటి.. నాకు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చారు కదా’ అని గుర్తు చేస్తూ ఇప్పుడు తనకు అవకాశం ఇవ్వాలని అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ పర్యటనలో ఉన్నప్పుడు ఖర్గే సైతం షర్మిలకు అవకాశం ఇవ్వాల్సి ఉందని చెప్పుకొచ్చారు. అందుకు తగినట్లే కర్ణాటక నుంచి షర్మిలకు రాజ్యసభ ఛాన్స్ ఇస్తున్నారని విస్తృత ప్రచారం జరిగింది. కానీ చివరికొచ్చేసరికి కర్ణాటకే కాదు ఏ రాష్ట్ర అభ్యర్థుల జాబితాల్లోనూ ఆమె పేరు కనిపించలేదు. కానీ అన్నీ అనుకున్నట్లు జరిగితే అది రాజకీయం ఎందుకవుతుంది? కర్ణాటక నుంచి నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా అసెంబ్లీలో పార్టీల బలాబలాల ప్రకారం కాంగ్రెస్‌కు మÖడు, బీజేపీకి ఒక సీటు దక్కే అవకాశం ఉంది. ఆ మేరకు ఆ రాష్ట్ర కోటాలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మరొకరికి అవకాశం లభిస్తుందని విస్తృత ప్రచారం జరిగింది. కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఆ రాష్ట్ర కొత్త సీఎం డీకే శివకుమార్‌తో మంచి సంబంధాలు, వైఎసఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన సందర్భంగా పార్టీ ఇచ్చిన హామీ, అన్నింటికీ మించి ఏపీలో కాంగ్రెస్‌ను బతికించిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె.. అన్న భుజకీర్తులు ఉన్నప్పటికీ అవేవీ ఆమెకు టికెట్ ఇప్పించలేకపోయాయి. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ పునాదులు మళ్లీ పటిష్టమయ్యాయి. తెలంగాణ, కర్ణాటకల్లో పార్టీ సొంతంగా అధికారంలో ఉండగా కేరళ యÖడీఎఫ్ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా, తమిళనాడు టీవీకే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అంటే ఒక్క ఏపీలోనే పార్టీ అధికారంలో లేకపోవడమే కాకుండా పార్టీపరంగా పటిష్టంగానూ లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించడం, సంస్థాగతంగా బలపడటానికి పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిలను రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని పార్టీ ఆమె అనుకూల వర్గాలు భావించాయి. ఆ మేరకు కచ్చితంగా సీటు వస్తుందన్న ధీమా ఆమెలో కనిపించింది. కానీ అనూహ్యంగా అభ్యర్థుల జాబితాల్లో ఆమె పేరు కనిపించలేదు. అయితే దీనికి పార్టీపరంగా కొన్ని కారణాలు ప్రస్తావనకు వస్తున్నాయి. వైఎసఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రంగప్రవేశం చేసిన కొత్తలో షర్మిల దూకుడుగానే పని చేశారు. కానీ రానురాను ఆ దూకుడు తగ్గిపోయింది. సీనియర్లకు కలుపుకొని వెళ్లడంలో విఫలమయ్యారన్న విమర్శలు, అసంతృప్తి పెరిగాయి. మరోవైపు అధికారంలోని లేని పార్టీలు సహజంగా ప్రభుత్వాల పైనా, అధికార పార్టీలపైనా పోరాటం చేయాలి. అప్పుడే వాటికి మైలేజీ వస్తుంది. ఈ సహజ రాజకీయ సూత్రానికి విరుద్ధంగా షర్మిల వ్యవహరించారు. పీసీసీ అధ్యక్షురాలిగా టీడీపీ కూటమి నేతృత్వంలోని ప్రభుత్వంపై కంటే తన అన్న వైఎస్‌జగన్ నాయకత్వంలోని వైకాపాపై యుద్ధం చేస్తున్నట్లు వ్యవహరించసాగారు. ప్రభుత్వ లోపాలను, వైఫల్యాలను ఎత్తిచూపడం కంటే జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు, కుటుంబ వివాదాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆమె తీరు పార్టీశ్రేణులకు ఏమాత్రం మింగుడుపడలేదు. దాంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ఏమాత్రం పుంజుకోలేకపోయింది. దీంతోపాటు జాతీయ స్థాయిలో పార్టీకి ఉన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైకమాండ్ షర్మిలను రాజ్యసభకు పంపకుండా చెయ్యిచ్చింది. జగన్ మీద ఆరోపణలకే పరిమితం కావడం తప్ప పార్టీకి ఊపు తీసుకొచ్చే కార్యక్రమాలేవీ చేపట్టడంలేదని షర్మిలపై అధిష్టానానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. అదేవిధంగా ఆమెకు తమ రాష్ట్రం నుంచి రాజ్యసభ అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనపై శివకుమార్ వంటి ఒకరిద్దరు తప్ప మెజారిటీ కర్టాటక కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చివరి నిమిషంలో అభ్యర్థుల జాబితాలో మార్పులు అనివార్యమయ్యాయి. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి హాజరైన షర్మిల అప్పటినుంచీ బెంగళూరులోనే ఉన్నారు. ఈలోగానే రాజ్యసభ అవకాశం దక్కలేదని తెలిసినా అధిష్టానాన్ని ప్రశ్నించడం కంటే ఏపీలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా ఆమెకు అవకాశం ఇవ్వకపోవడానికి మరో కారణం కూడా ఉందన్న చర్చ పార్టీవర్గాల్లో జరుగుతున్నది. గత ఎన్నికల్లో జగన్‌కు హ్యాండించి మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి చంద్రబాబుతో కలిసినప్పటికీ కొన్ని అనివార్యతల దృష్ట్యా ఇప్పటికీ జగన్ మోదీ నాయకత్వం, ఎన్డీయేపై సాఫ్ట్‌కార్నర్‌తోనే వ్యవహరిస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అధికార కూటమిలో లేని జగన్ సహకారం అవసరమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది. సమీప భవిష్యత్తులో జాతీయస్థాయిలో ఎన్డీయే కూటమిని గద్దె దించేందుకు లేదా బిల్లుల విషయంలో అవసరమైనప్పుడు ఇండియా కూటమికి జగన్ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఆ పార్టీకి ద్వారాలు తెరిచే ఉంచాలని భావిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో జగన్‌పై కుటుంబపరంగా విరుచుకుపడుతున్న షర్మిలను రాజ్యసభకు పంపిస్తే అది జగన్‌కు వ్యతిరేకంగా షర్మిలను ప్రోత్సహించినట్లు అవుతుందన్న ఆలోచనతోనే ఆమెను చివరి నిమిషంలో తప్పించారని విశ్లేషిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page