అందకే చికెన్ నెక్ అంత కీలకం!
- DV RAMANA

- Dec 19, 2025
- 3 min read
దాన్ని బంద్ చేస్తే ఏడు రాష్ట్రాలతో సంబంధాలు కట్
ఆ ఏడు ఈశాన్య రాష్ట్రాలే సెవన్ సిస్టర్స్
వాటిని భారత్‌కు దూరం చేయాలనే బంగ్లాదేశ్, చైనా కుట్రలు
ఇప్పటికే బంగ్లా భూభాగం నుంచి పాక్ ఉగ్ర చర్యలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
మా దేశాన్ని అస్థిరపరిస్తే చికెన్ కారిడార్‌ను ఆక్రమించి సెవన్ సిస్టర్స్‌ను దెబ్బతీస్తామని, భారత వ్యతిరేక ఉగ్రశక్తులకు బంగ్లా భూభాగంపై నుంచి కార్యకలాపాలు సాగించే అవకాశమిస్తామని బంగ్లాదేశ్‌కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ అధ్యక్షుడు హస్నత్ అబ్దుల్లా బెదిరింపులు..
ఇదే చికెన్ కారిడార్ కారణంగా భారత్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ బంగాళఖాత సాగర పరిరక్షకురాలు బంగ్లాదేశ్ మాత్రమేనని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఆమధ్య చైనా పర్యటనలో వ్యాఖ్యానించారు. ఈ తరహా ఉన్మాదపూరిత వ్యాఖ్యలు ఇప్పటికే అత్యంత సున్నితంగా మారిన భారత్`బంగ్లా సంబంధాలు మరింత దిగజారాయి. ఇదే తరుణంలో బుధవారం బంగ్లాదేశ్ హైకమిషనర్ ఎం రియాజ్ హమీదుల్లాకు భారత్ సమన్లు జారీ చేసి విదేశాంగ కార్యాలయానికి పిలిపించుకుని బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక చర్యలు, బెదిరింపులు పెరుగుతున్నా ఆ దేశ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో బంగ్లా ప్రభుత్వ అనుకూలవాదులు ఢాకాలోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని మట్టడిరచడంతో అక్కడి వీసా కార్యాలయాన్ని భారత్ మూసివేసింది. ఇదే సమయంలో గురువారం రాత్రి ఒక హిందూ పౌరుడిపై మతపరమైన వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణతో స్థానికులు మూకదాడికి పాల్పడి హతమార్చి, అనంతర చెట్టుకు కట్టేసి దహనం చేశారు.
వాటిపైనే అందరి దృష్టి
గత ఏడాది జరిగిన విద్యార్థి ఉద్యమం కారణంగా పదవిని వీడి భారత్‌కు వచ్చేసిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత ప్రభుత్వం రాజకీయ ఆశ్రయం ఇవ్వడాన్ని.. అసలు భారత్ అంటే మొదటి నుంచీ గిట్టని మహమ్మద్ యూనిస్ తాత్కాలిక అధ్యక్షుడైనప్పటి నుంచీ బంగ్లా ప్రభుత్వం భారత్ పట్ల శత్రువైఖరితోనే వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్ అవతరణకు భారత్ సహకరించిన విషయాన్ని విస్మరించి, నాడు తమను అవస్థల పాల్జేసిన పాకిస్తాన్‌తోనూ, భారత శత్రువుగా పరిగణించే చైనాతోనూ దోస్తీకి అర్రులు చాస్తున్న యూనస్ ఆ దేశాల సైనిక, ఉగ్రవాద శక్తులకు తమ భూభాగంలో ఆశ్రయం కల్పించి భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఊతం ఇస్తున్నారు. ఇప్పటికే జైషే మహమ్మద్, లష్కర్ ఈ తోయిబా వంటి పాక్ ఉగ్రసంస్థలు బంగ్లాదేశ్‌లో పాగా వేశాయని నిఘావర్గాలు పేర్కొంటున్నాయి. వీటికి ఆ దేశ నాయకులు వ్యాఖ్యలు అగ్నిలో ఆజ్యం పోసినట్లు మరింత ప్రేరేపిస్తున్నాయి. భారత్ పేరు చెప్పకుండానే.. 54 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా బంగ్లాదేశ్ తనపై నియంత్రణ సాధించడానికి రాబందులు చేసే ప్రయత్నాలను ఎదుర్కోవాల్సి వస్తోందని కొదిరోజుల క్రితం వ్యాఖ్యానించిన బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ అక్కడితో ఆగకుండా భారత్‌ను ముక్కలు ముక్కలు చేయకపోతే బంగ్లాదేశ్‌లో పూర్తి శాంతి సాధ్యం కాదన్నట్లు అవాకులు చవాకులు పేలారు. మరోవైపు రిటైర్డ్ జనరల్ అబ్దుల్లాహిల్ అమాన్ అజ్మీ కూడా బంగ్లా లోపల భారత్ ఎల్లప్పుడూ అశాంతిని సజీవంగా ఉంచుతుందని ఆరోపించారు. భారత్‌ను ఆడిపోసుకుంటున్న బంగ్లా నేతలందరూ రెండు దేశాల సరిహద్దులో ఉన్న చికెన్ నెక్‌ను, దాన్ని ఆనుకుని ఉన్న సెవన్ సిస్టర్స్‌నే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు చికెన్ నెక్ ఏమిటి? సెవన్ సిస్టర్స్ ఏమిటి?? వాటికి అంత ప్రాముఖ్యత ఏమిటి??? అన్న ఆసక్తి రేగుతున్నాయి.
అతి సన్నటి మార్గం
మనదేశం తూర్పు దిశలో పశ్చిమబెంగాల్‌లో ఉన్న సిలిగురి కారిడార్‌నే చికెన్ నెక్ అని అంటారు. ఇది చాలా ఇరుకైన భూభాగం. దీని వెడల్పు కేవలం 22 కిలోమీటర్లే. కోడిమెడలా సన్నగా ఉంటుంది కనుకే దీన్ని చికెన్ నెక్ కారిడార్ అని వ్యవహరిస్తుంటారు. ఇది పశ్చిమ దిశలో నేపాల్‌తో, ఉత్తరాన భూటాన్, దక్షిణంలో బంగ్లాదేశ్‌తో భారత సరిహద్దును కలిపే ప్రాంతం. అదే సమయంలో అది కీలకమైన ఏడు ఈశాన్య రాష్ట్రాలు.. అసోం, మణిపూర్, మిజోరం, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయలకు మిగతా భారత రాష్ట్రాలతో అనుసంధానించే ఏకైక భూమార్గం కూడా చికెన్ నెక్ కారిడారే. దేశంలోని ఇతర ప్రాంతాలను అనుసంధానించడమే కాకుండా రైలు, రోడ్డు కనెక్టివిటీ కల్పించడానికి, సరుకు రవాణాకు ఈ మార్గమే శరణ్యం. చికెన్ నెక్ కారిడార్‌ను నియంత్రించగలిగితే ఈ ఏడు రాష్ట్రాలకు మిగతా భారతదేశంతో సంబంధాలు తెగిపోతాయి. మరోవైపు నాలుగు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు పంచుకుంటున్న ప్రాంతం ఇదే కావడం వల్ల భద్రతపరంగానూ చికెన్ నెక్‌ను అత్యంత కీలక ప్రాంతంగా పరిగణిస్తున్నారు. మరోవైపు చైనా ఆధీనంలో ఉన్న టిబెట్‌లోని ఛంబీ ప్రాంతం చికెన్ నుంచి కేవలం 30లోపు కి.మీ. దూరంలోనే ఉంది. అయితే ఇరుకైనా ప్రాంతం కావడం వల్ల ఇన్నాళ్లూ అక్కడ సైనిక స్థావరాలు పెద్దగా కల్పించలేకపోయారు. ఈ భౌగోళిక బలహీనతల కారణంగానే చైనా చికెన్ నెక్‌ను లక్ష్యంగా చేసుకుని, దాన్ని భారత్ నుంచి విడదీస్తే సెవన్ సిస్టర్స్ పేరు కలిగిన ఏడు రాష్ట్రాలను కూడా స్వాధీనం చేసుకోవచ్చని చాన్నాళ్లుగా కుట్రలు పన్నుతోంది. ఇప్పుడు దానికి బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం తోడైంది. తమకు తాముగా భారత్‌ను ఏమీ చేయలేనని యూనస్ సర్కారుకు తెలుసు. అందుకే ఒకవైపు చైనాను తమ భూభాగంలో ఓడరేవులు, సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తూనే మరోవైపు ఇన్నాళ్లూ తాను శత్రువుగా భావించిన పాక్‌లోని ఉగ్రమూకలను, సైనికాధికారులను తమ దేశంలో కాలుమోపే ఛాన్స్ ఇస్తోంది. ఈ పరిణమాల నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా చికెన్ నెక్ కారిడార్‌లో కొత్త సైనిక గారిసన్‌ల ఏర్పాటుతోపాటు విశాలమైన రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తోంది. ఇదిలా ఉంటే చికెన్ నెక్ గురించి యూనస్ సర్కారు మాటిమాటికీ బెదిరించడానికి ఆసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గట్టి కౌంటరే ఇచ్చారు. కొన్నాళ్ల క్రితం ఆయన మాట్లాడుతూ ‘మాకు ఒక్క చికెన్ నెక్ ఉంటే.. మీకు రెండు చికెన్ నెక్‌లు ఉన్నాయని మర్చిపోకండి’ అని ఘాటుగా హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ దినాజ్‌పూర్ నుంచి మేఘాలయలోని నైరుతి గారో హిల్స్ వరకు 80 కి.మీ. ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్‌ను అడ్డుకుంటే మొత్తం రంగపూర్ డివిజన్ మిగిలిన బంగ్లాదేశ్‌తో విడిపోతుందని ఆయన హెచ్చరించారు. ఇక రెండోది.. దక్షిణ త్రిపుర నుంచి బంగాళాఖాతం వరకు ఉన్న 28 కి.మీ. చిట్టగాంగ్ కారిడార్. ఇది బంగ్లాదేశ్ ఆర్థిక రాజధాని చిట్టగాంగ్, రాజకీయ రాజధాని ఢాకాలను కలుపుతుందని.. ఈ రెండిరటినీ తెగ్గొడితే మొత్తం బంగ్లా జీవనం స్తంభించిపోతుందని హిమంత బిశ్వ శర్మ కొన్ని నెలల క్రితం హెచ్చరించారు. అయినా మళ్లీ ఈమధ్య బంగ్లా నాయకులు తమ నోటికి పని చెబుతున్నారు.










Comments