top of page

అంబటి.. చిరుగుతుందా చీటీ!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jun 20, 2025
  • 2 min read
  • మాయ చేయబోయిన డీసీసీ అధ్యక్షుడికే షాక్‌

  • పీసీసీ అధ్యక్షురాలి పర్యటననే మమ.. అనిపించే ఎత్తుగడ

  • పెయిడ్‌ ఆర్టిస్టుల గోలతో వ్యవహారం బట్టబయలు

  • పార్టీ సొమ్మును కైంకర్యం చేస్తున్నారని ఫిర్యాదులు

  • ఆయన తీరుపై షర్మిల తీవ్ర అసహనం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షురాలి పర్యటననే మాయ చేసి మమ.. అనిపించేయాలని చూసిన జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంబటి కృష్ణారావుకు రాష్ట్ర కాంగ్రెస్‌ (పీసీసీ) అధ్యక్షురాలు షర్మిల జెల్ల కొట్టారు. షర్మిల పర్యటన సమాచారాన్ని పార్టీ సీనియర్లకు ఇస్తే తన గుట్టంతా బయటపడిపోతుందని భయపడి కృష్ణారావు పీసీసీ అధ్యక్షురాలి పర్యటన గురించి కాంగ్రెస్‌ నుంచే ఎన్నికై కేంద్రమంత్రిగా చేసిన డాక్టర్‌ కిల్లి కృపారాణికి గానీ.. నెహ్రూ, ఇందిరాగాంధీల కాలం నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతూ.. రెండుసార్లు ఆమదాలవలస ఎమ్మెల్యేగా పని చేసిన బొడ్డేపల్లి సత్యవతి లాంటి నేతలకు గానీ సమాచారం ఇవ్వకుండా పెయిడ్‌ ఆర్టిస్టులతో షర్మిల సమావేశాన్ని మేనేజ్‌ చేసేద్దామని ప్రయత్నించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గురువారం ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌లో సమావేశం ముగిసిన తర్వాత డీసీసీ అధ్యక్షుడిని మార్చాలంటూ షర్మిల విసుగ్గా వెళ్లిపోయారు. జిల్లాలో నియోజకవర్గ ఇన్‌ఛార్జీలుగా ఉన్నవారిని కూడా పిలవకుండా వారి ఆత్మాభిమానం మీద దెబ్బకొట్టి షర్మిల కార్యక్రమం పూర్తి చేసేద్దామని డీసీసీ అధ్యక్షుడు భావించారు. అయితే షర్మిల క్యాడర్‌కు దిశానిర్దేశం చేయకముందే సమావేశానికి వచ్చిన పెయిడ్‌ ఆర్టిస్టులు తమ డబ్బులిస్తే వెళ్లిపోతామని హడావుడి చేయడంతో ఆ కార్యక్రమం రసాభాసగా మారింది. ఎటువంటి ఫిర్యాదులు తన మీద రాకూడదని ముందుజాగ్రత్త పడిన కృష్ణారావుకు వ్రతం చెడ్డా ఫలితం మాత్రం దక్కలేదు. కాంగ్రెస్‌ నాయకులు ఆయనపై ఎటువంటి ఫిర్యాదులు చేశారన్న విషయం తెలుసుకునే ముందు పార్టీతో సంబంధం లేని వ్యక్తులు షర్మిలకు ఏమని ఫిర్యాదు చేశారో తెలుసుకుందాం.

  • అద్దెల సొమ్ము సొంత ఖాతాలకు

అంబటి కృష్ణారావు తమకు భూమి అమ్ముతానని చాలాకాలం క్రితం డబ్బులు తీసుకున్నాడని, చివరకు తన భార్య మంగళసూత్రాన్ని సైతం అమ్మేసి సొమ్ములిచ్చేశామంటూ గార మండలానికి చెందిన దంపతులు పీసీసీ అధ్యక్షురాలికి ఫిర్యాదు చేశారు. ఇది ప్రైవేటు వ్యవహారమని, తనకు చెప్పి లాభమేమిటని షర్మిల ప్రశ్నిస్తే.. ఎప్పుడూ ఫోనెత్తరని, ఇంటికి వెళ్తే లేరని చెప్పించి పంపించేస్తున్నారని, పొరపాటున కనిపిస్తే కాంగ్రెస్‌, షర్మిల పేరు చెప్పి భయపెడుతున్నారని, అందుకే మీకు ఫిర్యాదు చేస్తున్నామంటూ వారు వివరించడంతో షర్మిల షాకయ్యారు. ఇక పార్టీ వ్యవహారాలకు సంబంధించి దాదాపు రూ.15 లక్షల వరకు సొమ్ము మాయమైందని షర్మిలకు ఫిర్యాదు అందింది. ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌కు షాపుల నుంచి, కల్యాణ మండపం నుంచి ప్రతి నెలా అందుతున్న అద్దెలను ట్రస్ట్‌ ఖాతాలో వేయకుండా అంబటి కృష్ణారావు తన సొంతానికి వాడుకున్నారని ఫిర్యాదు చేశారు. 2023లో ఇందిరా విజ్ఞాన్‌భవన్‌ అద్దెల కోసం ఏఐసీసీ ఆదేశాల మేరకు జాయింట్‌ అకౌంట్‌ ప్రారంభించారు. ఇందులోనే ఆ సొమ్ము జమవ్వాలి. అయితే అలా జరక్కపోవడంతో షర్మిలకు ఫిర్యాదు చేశారు. తాను వస్తున్నానని ముందస్తు సమాచారమిచ్చినా కాంగ్రెస్‌ నేతలెవరూ రాకపోవడంపై షర్మిల అసహనం వ్యక్తం చేయగా, టౌన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రెల్ల సురేష్‌, ఇచ్ఛాపురం కోఆర్డినేటర్‌ చక్రవర్తి రెడ్డి, కాంగ్రెస్‌ మత్య్సకార విభాగం అధ్యక్షుడు కిల్లి శాంతారావు, ఆమదాలవలస కాంగ్రెస్‌ నాయకుడు బస్వా షన్ముఖరావుతో పాటు మరికొందరు ఆమెకు ఇక్కడ జరుగుతున్న పరిణామాలను వివరించారు.

  • ఉద్యోగుల జీతాలకూ ఎగనామం

ఇక్కడ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జీలుగా ఉన్నవారిపై అంబటి కృష్ణారావు డీసీసీ అధ్యక్షుడైన తర్వాత కేసులు పెట్టారని, ఇప్పుడు కూడా ఈ సమావేశానికి ఎవర్నీ పిలవలేదని ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్‌కు ఇన్‌ఛార్జిగా మహేష్‌ అనే వ్యక్తిని పెడితే ఆయనా, డీసీసీ అధ్యక్షుడు ఒక్కటైపోయి పార్టీని పాతాళంలోకి తొక్కేస్తున్నారని వారు తెలిపారు. ఇవేవీ తన దృష్టిలో లేవని, తన దగ్గరకు వచ్చుంటే న్యాయం చేసుండేదాన్నని షర్మిల పేర్కొనడం గమనార్హం. దీంతో పాటు డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచి ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలివ్వడంలేదని, పేపర్‌ బిల్లులు చెల్లించడంలేదని, వస్తున్న అద్దెసొమ్ములు ఏమవుతున్నాయో తెలియడంలేదంటూ షర్మిలకు ప్రత్యేకంగా వివరించారు. ఈ పరిణామాలపై ఆమె అసహనం వ్యక్తం చేస్తూ ఈ జిల్లాకు తన తండ్రి ఎంతో చేశారని, అటువంటి జిల్లాకు తానొస్తే కాంగ్రెస్‌ నాయకులు ముఖం చాటేశారంటూ, నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని, డీసీసీ అధ్యక్షుడిని మారిస్తే గానీ పరిస్థితి మారేట్టు లేదంటూ ఆమె వెళ్లిపోయారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page