top of page

గిరగిరా.. మేయర్ గిరీ!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 15 minutes ago
  • 3 min read
  • వరం వారసుల మధ్య పదవి పోటీ

  • ఎన్నికలు ఎప్పుడో తెలియకుండానే రసవత్తర పరిణామాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

మున్సిపల్ ఎన్నికలు ఎప్ప్పుడు జరుగుతాయో తెలియకపోయినా.. శ్రీకాకుళం నగర రాజకీయ ముఖచిత్రం రోజుకోరూపం సంతరించుకుంటోంది. ప్రస్తుత ముఖచిత్రంతో ఎన్నికల ప్రక్రియ జరిగితే మేయర్‌గా మహిళను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కొన్ని పంచాయతీలను విడగొట్టడం, కొత్త పంచాయతీలను కలుపుకోవడం వంటివి జరిగితే మాత్రం రిజర్వేషన్లలో మార్పు తధ్యం. మేయర్ పదవి మహిళకు కేటాయించినా జనరల్‌కు రిజర్వ్ చేసినా తెలుగుదేశం పార్టీ వరకు దివంగత మాజీ మున్సిపల్ చైర్మన్ వరం కుటుంబానికే ఆ సీటు ఆఫర్ చేస్తారనేది తేటతెల్లమైంది. ధర్మాన ప్రసాదరావు అనుచరులుగా కొనసాగిన వరం వారసులు 2024 ఎన్నికల ముందు టీడీపీలోకి మారారు. అప్పట్నుంచి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పైడిశెట్టి జయంతికే మేయర్ టిక్కెటిస్తారని ప్రచారం జరిగింది. ఒకవేళ ఎచ్చెర్ల మండలానికి చెందిన రెండు పంచాయతీలు శ్రీకాకుళం కార్పొరేషన్ నుంచి బయటకు వచ్చినా, కోర్టు కేసు కారణంగా నగర శివార్లలోని పంచాయతీలను తప్పించినా, మంత్రి అచ్చెన్నాయుడు సూచన మేరకు రాగోలు పంచాయతీని అదనంగా కలిపినా రిజర్వేషన్ రోస్టర్ మారి పురుష అభ్యర్థికి అవకాశం రావచ్చు. అలా జరిగితే వరం చిన్నకుమారుడు అంధవరపు సంతోష్ రంగంలో ఉంటారని అంతా భావించారు.

ఒకరు కాకపోతే ఇంకొకరు

కానీ గత కొన్ని నెలలుగా నగరంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే మాత్రం వరం పెద్దకొడుకు ప్రసాద్ రేస్‌లోకి వచ్చినట్లు భావిస్తున్నారు. 2024 ఎన్నికల నుంచి ఈమధ్య వరకు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ సన్నిహిత టీమ్‌లో ఒకరిగా మెలిగిన సంతోష్ స్థానంలో ఇప్ప్పుడు ఆయన అన్న ప్రసాద్ వచ్చి చేరారా? అంటే.. ఆ సామాజికవర్గంలో అవుననేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. వరం కుటుంబం తప్ప తామెవరం అందుకు అర్హులం కాదా? అనేవారి అసంతప్తి పక్కన పెట్టి వరం కుటుంబానికే టిక్కెటిస్తారని భావించినవారిని పలకరిస్తే ఇప్ప్పుడు రేసులో ప్రసాద్ కూడా ఉన్నారని చెబుతున్నారు. అయితే వారిద్దరిలో ఎవరైనా ఒకటేనని చాలామంది భావించడంలేదు. స్వభావరీత్యా ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసముందని, ఎన్నికలు జరగవన్న ఆలోచన వచ్చిన తర్వాత సంతోష్ ఈ మధ్య గొండు శంకర్ కార్యక్రమాలకు మొక్కుబడిగా హాజరవుతున్నారని, అందుకే ప్రసాద్‌ను ఎమ్మెల్యే ఎంకరేజ్ చేస్తున్నారని తెలిసింది. ఎన్నికల వరకు వారిద్దరినీ ఎమ్మెల్యేకు రెండు కళ్లుగా అభివర్ణించినవారు సైతం ఇప్ప్పుడు తమ ఓటు ప్రసాదుకేనంటున్నారు. ఎమ్మెల్యేగా గొండు శంకర్ గెలిచిన తర్వాత కూడా గుండ వర్గంలో ఉన్న క్యాడర్‌ను దూరం పెట్టలేదు. శంకర్‌ను నమ్మి వచ్చినవారికి పాతవారి స్థానంలో కూర్చోబెట్టలేదు. కానీ గుజరాతీపేట ప్రాంతంలో మాత్రం వరం కుటుంబానికే ఆయన ప్రాధాన్యతనిచ్చారు. కారణం.. మంత్రి అచ్చెన్నాయుడు అండదండలు వారికి ఉండటమే. అచ్చెన్న మంత్రాంగంతోనే ఎన్నికల ముందు వీరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్ప్పుడున్న రిజర్వేషన్ మేరకు జయంతికే మేయర్ అభ్యర్థిగా బొట్టు పెడతామని పరోక్ష సంకేతాలిచ్చారు. కానీ ఆమె నాన్ లోకల్ కావడంతో ఆమె తరఫున సంతోష్ ఇక్కడ రాజకీయాలు నడుపుతున్నారని అంతా భావించారు. కానీ కార్పొరేషన్ ఎన్నికలు జరగాలంటే మరోసారి వార్డుల విభజన తప్పదని, ఆమేరకు కలిసొచ్చేవి, విడిపోయేవి లెక్కలేసుకొని రిజర్వేషన్ మారితే జనరల్ కోటాలో సంతోష్ మేయర్ కుర్చీకి పోటీ పడుతున్నట్లు టీడీపీలోని సీనియర్లు చెప్ప్పుకునేవారు. బహుశా అందుకేనేమో ఆయన్ను రిమ్స్ జనరల్ ఆస్పత్రి సలహామండలి సభ్యుడిగా నియమించాలని ఎమ్మెల్యే ప్రతిపాదించారు.

అక్కడ ఇళ్లు.. ఇక్కడ ఆఫీసు

వరం కుటుంబంలో జరుగుతున్న కుర్చీలాటలో ఎవరు ఎప్ప్పుడు పనికొస్తారో తెలియక ప్రసాద్‌కు కూడా ఓ పదవినిచ్చారు. అయితే ఈ రెండూ అమల్లోకి రాలేదు. ఇటీవల సంతోష్ పార్టీ కార్యక్రమాలకు కనిపించి వెళ్లిపోతుండటంతో ప్రసాద్‌ను స్టేజ్ మీదకు పిలుస్తున్నారు. వరం చనిపోయిన తర్వాత ప్రసాద్ వ్యాపార వ్యవహారాలు చూస్తారని, వరం వారసత్వం సంతోష్ కొనసాగిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్ప్పుడున్న పరిస్థితులు చూస్తే ప్రసాద్ కూడా రాజకీయ ఆరంగేట్రానికి సిద్ధంగా ఉన్నారని అర్థమవుతున్నది. గుజరాతీపేటలో ఉన్న వరం ఇంటిని ఉమ్మడి రాజకీయ కార్యాలయంగా ఉంచి, వరం వారసులంతా విశాఖపట్నంలో సెటిలయ్యారు. ఈమేరకు ప్రసాద్ ఇప్పటికే అక్కడ సొంతింటిలో అడుగు పెట్టగా, సంతోష్ కొత్త ఇంటి నిర్మాణంలో ఉన్నారు. ఇది నిజంగా అన్నదమ్ముల మధ్య అవగాహనా లేక రాజకీయంగా ముందుకెళ్లాలన్న ఆలోచనా? అనేది వారిని అడిగినా చెప్పరు. మరోవైపు అచ్చెన్నాయుడు ఓటు మాత్రం పైడిశెట్టి జయంతికే. ఇటీవల నగరంలో డయేరియా వెలుగుచూసిన తర్వాత కార్పొరేషన్ కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ సమీక్ష నిర్వహించనప్పుడు వేదిక మీద పైడిశెట్టి జయంతి కూడా కనిపించారు. అంటే ఆమె కూడా రేసులో ఉన్నారని పార్టీ చెప్పకనే చెబుతున్నట్టుంది. టీడీపీకి మైలేజీ రావడం కోసమే ఒకర్ని అక్కడ కూర్చోబెట్టారని భావిస్తే.. వేదిక కింద జిల్లా పార్టీ అధ్యక్షుడు మొదలవలస రమేష్ ఉన్నారు. అలా కాకుండా జయంతిని కూర్చోబెట్టారంటే.. కార్పొరేషన్ ఎన్నికలకు ఆమెను సిద్ధం చేస్తున్నామని ప్రకటించడమే. వ్యాపార వారసత్వం ప్రసాద్ తీసుకుంటారని అందరూ భావించారు గానీ, ఇప్ప్పుడు అందరికంటే పెద్ద వ్యాపారవేత్త సంతోషే. అన్ని పార్టీ నాయకులతోనూ ఆయన చేస్తున్న వ్యాపారాలకే సమయం సరిపోవడంలేదని, జరగని ఎన్నికల కోసం ఆయన సమయం వధా చేసుకోవడం అనవసరం కాబట్టే దూరంగా జరుగుతున్నారని ‘సత్యం’ వద్ద ఒక టీడీపీ నాయకుడు వ్యాఖ్యానించారు. కుటుంబంలో పొరపొచ్చాలు వచ్చి ఎవరికి వారే తమ రాజకీయ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారా? లేక ఒకరు అందుబాటులో లేకపోతే మరొకరైనా ఉండాలన్న కోణంలో వ్యవహరిస్తున్నారా? అనేది ఇప్ప్పుడే చెప్పలేం. రూపాయీ రూపాయీ నువ్వేం చేస్తావంటే.. పచ్చగా ఉన్న కుటుంబంలో చిచ్చుపెడతాను అన్నదట. ఇక రాజకీయం నువ్వేం చేస్తావంటే.. అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతానన్నదట. ఇక్కడ డబ్బు, రాజకీయం రెండూ ఉన్న కుటుంబమిది. భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు. అనూహ్యంగా సోమవారం ఎమ్మెల్యే నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అన్నదమ్ములిద్దరూ ఉన్నారు. అలాగే టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షుడు కూడా కనిపించినందున దీన్ని ఏ కోణంలో తీసుకోవాలో ఓటరే నిర్ణయించుకుంటారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page