top of page

అక్కడ పెళ్లిళ్లకు ‘విడాకులు’!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Dec 19, 2025
  • 2 min read

విడాకుల కేసులు పెరుగుతుంటే.. కోర్టులు, సంబంధిత కక్షిదారులు ఇబ్బంది పడాలి. కానీ బెంగళూరులోని ఒక ప్రాంత పండితులు వీటి వల్ల అవస్థలు పడుతున్నారు. వీటిని తట్టుకోలేక ఏకంగా పెళ్లిళ్లు చేయడానికే స్వస్తి చెప్పారు. మరోవైపు విడాకుల పిటిషన్లు వేయడానికి వివాహం జరిగి కనీసం ఏడాది కావాలన్న నిబంధన అమలు విషయంలో ఫ్లెక్సిబులిటీ ఉండాలని ఢల్లీి హైకోర్టు తాజాగా రూలింగ్‌ ఇవ్వడం విడాకుల కేసులు విచారణ మరింత సులభతరం కావచ్చు. బెంగళూరులోని హలసూరు ప్రాంతం చోళుల కాలానికి చెందిన సోమేశ్వర ఆలయం హిందూ పెళ్లిళ్లకు పవిత్ర స్థలంగా పేరుగాంచింది. ఇక్కడ రోజూ అనేక జంటలు శివుడి సాక్షిగా వివాహం చేసుకుంటుంటారు. అయితే ఇటీవలి కాలంలో విడాకుల కేసులు పెరుగడంతో పరిస్థితి మారిపోయింది. జంటల మధ్య వివాదాలు పెరిగి కోర్టులకు చేరడంతో విడాకుల కేసుల విచారణలకు పెళ్లిళ్లు చేసిన ఆలయ పండితులను సాక్షులుగా పిలవడం పెరిగింది. ఇలా గత రెండేళ్లలో 50కి పైగానే కేసుల్లో ఆలయ పండితులు హాజరు కావాల్సి వచ్చింది. ఇది వారిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడంతోపాటు ఆలయ ప్రతిష్ఠపై ప్రభావం చూపుతున్నాయని భావిస్తున్నారు. ఇళ్ల నుంచి పారిపోయి వచ్చి తప్పుడు పత్రాలు చూపించి ఆలయంలో పెళ్లి చేసుకుంటున్న ఘటనలు ఈమధ్య కాలంలో ఎక్కువయ్యాయి. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆలయానికి వచ్చి పండితులను నిలదీయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటున్నది. ‘సరైన పరిశీలన లేకుండానే పెళ్లిళ్లు చేస్తున్నారు’ అని ఆరోపణలు ఎక్కువయ్యాయి. ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయం బెంగళూరులో వివాహాలకు అతి ముఖ్యమైన స్థలంగా ప్రాచుర్యం పొందింది. అయితే విడాకుల కేసులు పెరగడం, పండితులను బాధ్యులను చేస్తుండటంతో ఈ సంప్రదాయం ప్రమాదంలో పడిరది. ఈ పరిస్థితుల్లో ఆలయంలో పెళ్లిళ్లు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని అక్కడి పండితులు, అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక ఆలయం నిర్ణయం మాత్రమే కాదు. సమాజంలో మారుతున్న ఆలోచనలు, సంబంధాల్లో అస్థిరత, ఇంటి నుంచి బయటికి వచ్చి పెళ్లి చేసుకోవటం వంటి ఘటనలు పెరగటం వంటివన్నీ ధార్మిక సంస్థల పనితీరుపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇదే సమయంలో హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు తీసుకోవాలంటే దంపతులు కనీసం ఏడాది పాటు విడివిడిగా ఉండాలనే నిబంధనపై ఢల్లీి హైకోర్టు సంచలన వివరణ ఇచ్చింది. పరస్పర అంగీకారంతో విడాకులు కోరుకునే జంటలు ఇకపై ప్రతి సందర్భంలోనూ ఏడాది పాటు వేచి చూడాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్‌ నవిన్‌ చావ్లా, జస్టిస్‌ అనూప్‌ జైరామ్‌ భంబానీ, జస్టిస్‌ రేణు భట్నాగర్‌లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. బంధం ఇప్పటికే పూర్తిగా విచ్ఛిన్నమైనప్పుడు, చట్టబద్ధంగా కలిసుండాలని దంపతులను బలవంతం చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని కోర్టు అభిప్రాయపడిరది. ‘చట్టం పేరుతో ఇష్టం లేని ఇద్దరు వ్యక్తులను ఒకే బంధంలో ఉంచడం వారి మానసిక, భావోద్వేగ స్థితిపై ప్రభావం చూపుతుంది. వారిని సంతోషకరమైన వైవాహిక జీవితంలోకి కాకుండా ఒక ‘వైవాహిక అగాధం’లోకి నెట్టడం సరికాదు’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. హిందూ వివాహ చట్టం`1955లోని సెక్షన్‌ 13బి(1) ప్రకారం విడాకుల దరఖాస్తుకు ముందు దంపతులు ఏడాది పాటు విడివిడిగా ఉండాలి. అయితే ఈ నిబంధనను ప్రతి కేసులోనూ కచ్చితంగా అమలు చేయాల్సిన పనిలేదని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని సడలించవచ్చని కోర్టు పేర్కొంది. విడాకులు కోరుకునే వ్యక్తి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా లేదా భాగస్వామి ప్రవర్తన దారుణంగా ఉన్నా.. ఏడాది వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండానే విడాకులు మంజూరు చేసే అధికారం కోర్టులకు ఉందని ధర్మాసనం వివరించింది. విడాకుల ప్రక్రియను అనవసరంగా పొడిగించడం వల్ల ఆ జంట భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆలస్యం కారణంగా వారు తమ జీవితాలను మళ్లీ నిర్మించుకునే అవకాశాన్ని లేదా పునర్వివాహం చేసుకునే వయసును కోల్పోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. సమాజంలో సాధారణ జీవితాన్ని గడపడానికి ఇలాంటి జాప్యం అడ్డంకిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. సెక్షన్‌ 14(1) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి ఏడాది వేచి ఉండే నిబంధనను కోర్టులు రద్దు చేయవచ్చని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఏడాది నిబంధనను సడలించినంత మాత్రాన సెక్షన్‌ 13బి(2) కింద ఉండే ఆరు నెలల గడువు ఆటోమేటిక్‌గా రద్దు అయినట్లు పరిగణించరాదని పేర్కొంటూ దాన్ని కోర్టులు విడిగా పరిశీలిస్తాయని త్రిసభ్య ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. ఒకవేళ కోర్టు రెండు గడువులను (ఏడాది మరియు ఆరు నెలలు) రద్దు చేయాలని నిర్ణయిస్తే వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చు. ఈ వెసులుబాటు కేవలం అసాధారణమైన కష్టాలు ఎదుర్కొంటున్న జంటలకు మాత్రమే వర్తిస్తుందని, సాధారణ కేసులకు వర్తించదని విస్పష్టంగా పేర్కొంది. ఫ్యామిలీ కోర్టులతో పాటు హైకోర్టులకు కూడా ఈ గడువును సడలించే అధికారం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చి లేదా వాస్తవాలను దాచిపెట్టి ఈ వెసులుబాటు పొందితే, ఏ దశలోనైనా ఆ విడాకులను రద్దు చేసే అధికారం కోర్టుకు ఉంటుంది. ఢల్లీి హైకోర్టు వెలువరించిన ఈ తీర్పు విడాకుల చట్టాల్లో మానవీయ కోణాన్ని ఆవిష్కరించింది. కేవలం నిబంధనల కోసమే విడిపోయిన జంటలను ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పడం కంటే వారు తమ జీవితాల్లో త్వరగా ముందుకు సాగేలా చేయడమే ఉత్తమమని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page