అక్కడ రివర్స్ ద్రవ్యోల్బణం.. దేనికి సంకేతం
- DV RAMANA
- 1 day ago
- 2 min read

ఆర్థికరంగం స్థిరంగా ఉండాలంటే.. నిత్యావసరాలతో సహా ఇతరత్రా వస్తువులు, సేవల ధరలు అదుపులో ఉండాలంటే ద్రవ్యోల్బణం(ఇన్‌ఫ్లేషన్) నియంత్రణలో ఉండాలి. మరో రకంగా చెప్పాలంటే ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదలకు సూచిక. ఇది అదుపులో ఉంటే ధరలు అదుపులో ఉన్నట్లే లెక్క. కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంకు ద్రవ్యోల్బణం రేటును ఎప్పటికప్పుడు ప్రకటించడంతో పాటు దానికి అనుగుణంగా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటుంటాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం తిరో గమనంలో పయనిస్తే దాన్ని రివర్స్ లేదా ప్రతి ద్రవ్యోల్బణం(డిఫ్లేషన్)గా వ్యవహరిస్తారు. అంటే ధరలు క్రమంగా తగ్గిపోతున్నప్పుడు ప్రతి ద్రవ్యోల్బణంగా నమోదవుతుంది. అయితే భారతదేశ చరిత్రలో జాతీయస్థాయిలో గానీ, రాష్ట్రాలస్థాయిలో గానీ ఇంతవరకెన్నడూ ప్రతి ద్రవ్యోల్బణం నమోదైన దాఖలా ల్లేవు. కానీ ఇప్పుడు తొలిసారి ఒక రాష్ట్రం ఆ దిశగా పయనిస్తున్నట్లు తాజా ద్రవ్యోల్బణ సూచీ వెల్లడిర చింది. అదే మన దాయాది తెలుగు రాష్ట్రం తెలంగాణ. అంటే ఆ రాష్ట్రంలో వస్తు, సేవల ధరలు బాగా తగ్గిపోతున్నట్లు భావించాలి. కానీ ధరలు తగ్గుముఖం పట్టిన దాఖలాలు లేకపోయినా.. కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణం అంచనాకు కొన్ని ప్రమాణాలు నిర్దేశించింది. వాటిని అనుసరించి ద్రవ్యోల్బ ణం, ప్రతి ద్రవ్యోల్బణం అనే దాన్ని ఆర్థిక శాఖ ప్రకటిస్తుంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ధరల పరిస్థితి కి, ఈ అంచనాలకు చాలావరకు పొంతన ఉండదు. ఆ సంగతి పక్కన పెడితే.. దేశంలో డిఫ్లేషన్‌లోకి వెళ్లిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అరుదైన ఆర్థిక పరిస్థితిలోకి అడుగుపెట్టింది. ఈ నెల 15న కేంద్ర గణాంక శాఖ (ఎంవోఎస్‌పీఐ) విడుదల చేసిన సమాచారం ప్రకారం 2025 జూన్ నెలలో తెలంగాణ లో ద్రవ్యోల్బణ రేటు తిరోగమనంలో పడి -0.93 శాతంగా నమోదైంది. ఇదే సమయానికి జాతీయ సగటు ద్రవ్యోల్బణం 2.1 శాతంగా ఉంది. ఆ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం మరింతగా తగ్గింది. గ్రామీణ తెలంగాణలో ఇది -1.54 శాతంగా ఉండగా దేశ సగటు గ్రామీణ ద్రవ్యోల్బణం 1.72 శాతంగా ఉంది. అలాగే పట్టణ తెలంగాణలో -0.45 శాతం ఉండగా జాతీయ సగటు పట్టణ ద్రవ్యోల్బణం 2.56 శాతంగా ఉంది. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ధరల పెరుగుదల చాలా తక్కువగా ఉంది. ఆ రాష్ట్రంలో ద్రవ్యోల్బణం 0.0 శాతంగా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో -0.55 శాతం, పట్టణాల్లో మాత్రం 1.06 శాతంగా నమో దైంది. తెలంగాణలో 2020 నుంచి 2023 వరకు ద్రవ్యోల్బణం 10 శాతం పైగా ఉండేది. ఆ సమ యంలో ప్రజలు అన్ని వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందిపడ్డారు. కానీ 2023 డిసెంబర్ తర్వాత ధరలు తగ్గడం మొదలైంది. 2025 ఫిబ్రవరిలో 1.31 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. మార్చిలో 1.06 శాతం, ఏప్రిల్‌లో 1.26 శాతం, మే నెలలో 0.55 శాతం, జూన్ నెలలో -0.93 శాతంగా ఉంది. ధరల తగ్గుదల తమ ప్రభుత్వ విజయమేనని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ‘ఇది ప్రజలకే ప్రయోజనకరంగా ఉండే పాలన ఫలితం’ అని ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల వల్ల ప్రజల ఖర్చులు తగ్గాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆహార ధరలు తగ్గడం, విద్యుత్ చార్జీల నియంత్రణ కూడా డిఫ్లేషన్‌కు కారణమయ్యే అంశాలని ఆర్థిక నిపు ణులు చెబుతున్నారు. అయితే దీన్ని ప్రభుత్వ పథకాల ఫలితంగా మాత్రమే చూడకూడదని, మార్కెట్‌లో ఉన్న ఇతర కారణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. తాత్కాలికంగా చూస్తే ధరల తగ్గుదల వినియోగదారులకు ఊరటగానే అనిపించినా దీర్ఘకాలంలో మాత్రం ప్రతికూల ప్రభా వం పడే అవకాశముందని మరికొందరు ఆర్థిక నిపుణులు వాదిస్తున్నారు. డిఫ్లేషన్ అంటే నిత్యావసర ధరలు తగ్గడం ఒక్కటే కాదని.. మార్కెట్ డిమాండ్ తగ్గడం, పెట్టుబడులు తగ్గిపోవడం, ఆర్థిక మందగమనానికి సంకేతంగా కూడా భావించాలంటున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి ఆ స్థాయికి వెళ్లలేదని, ఇది ప్రభుత్వ చర్యల వల్ల కలిగిన సరఫరా - ధరల నియంత్రణ ఫలితంగా నెల కొన్న పరిస్థితి అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం మైనస్‌లోకి వెళ్లడం అంటే ఆర్థిక సంక్షోభానికి సంకేతమనే మరో అభిప్రాయం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు భయంతోనే ఖర్చులు తగ్గిస్తున్నారని దీని కారణంగానే మార్కెట్లో అస్థిరత ఉందని కూడా విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా తెలం గాణలో ప్రస్తుతం భిన్న ఆర్థిక పరిస్థితి నెలకొందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Comments