అక్కరకురాని వెనిజులా ఆయిల్!
- DV RAMANA

- 1 day ago
- 3 min read

ఆయిల్ నిక్షేపాలు కలిగిన దేశాలు సుసంపన్నంగా ఉంటాయని అందరూ అభిప్రాయపడుతుంటారు. కానీ అది వాస్తవం కాదు. దానికి ఉదాహరణ ప్రస్తుతం వార్తల్లో నిలిచిన వెనిజులా దేశమే. ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిక్షేపాలు కలిగిన ఈ దేశం పేదరికం అనుభవిస్తోంది. వనరులు ఉన్నా వాటిని అమ్ముకోలేకపోవడం, ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలు ఈ దుస్థితికి కారణంగా నిలుస్తున్నాయి. ఆ దేశంలో లభించే ముడి చమురు చాలా చిక్కగా ఉంటుంది. అందువల్ల దాన్ని శుద్ధి చేయడం చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్నది. వెనిజులాకు చెందిన ఒరినోకో బెల్ట్‌లో దొరికే ముడిచమురును హెవీ క్రూడ్ ఆయిల్ అంటారు. ఇది చాలా చిక్కగా, జిగటగా ఉంటుంది. దీన్ని రిఫైనింగ్(శుద్ధి) చేయడం చాలా కష్టం. అలాగే ఇక్కడ లభించే ముడిచమురులో సల్ఫర్ శాతం అధికంగా ఉండటం మరో జటిల సమస్య. దీన్ని తొలగించి శుద్ధి చేయడానికి అధునాత సాంకేతికను వినియోగించాల్సి ఉంటుంది. దానివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా వెనిజులా చమురు తక్కువ ధర పలుకుతుంది. అయినా గతంలో అమెరికన్ ఆయిల్ కంపెనీలు ఖర్చు ఎక్కువైనా భరించి ముడిచమురు వెలికితీసి, శుద్ధి చేసేవి. కానీ ఛావేజ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చమురు పరిశ్రమ మొత్తాన్ని ప్రైవేటురంగం నుంచి తప్పించి జాతీయం చేసేశారు. తర్వాత వచ్చిన నికోలస్ మదురో ప్రభుత్వం కూడా అదే విధానం అనుసరించింది. కానీ అత్యధికంగా ఉన్న పెట్టుబడి, నిర్వహణ ఖర్చులు తట్టుకోలేక ప్రభుత్వరంగ సంస్థలు చేతులెత్తేయడంతో ఆదాయం తగ్గిపోయి వెనిజులా ఆర్థికంగా వెనుకబడిపోయింది. ఇక డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచీ వెనిజులా ఆయిల్ రిజర్వ్స్‌పై కన్నేశారు. స్వతహాగా వ్యాపారి అయిన ట్రంప్ ఆ కోణంలోనే ఆలోచిస్తూ తనలాగే సార్వభౌమత్వం కలిగిన వెనిజులా రాజధానిపై దాడి చేసి.. ప్రభుత్వాధినేతనే తీసుకెళ్లి.. తన దేశంలోని జైల్లో పెట్టారు. ఇప్పుడు వెనిజులాలోని అపార చమురు నిక్షేపాలతో అమెరికా కంపెనీలే వ్యాపారం చేస్తాయని కూడా కుండబద్దలు కొట్టేశారు. ఇదే కాకుండా ఆయిల్ నిక్షేపాలు కలిగిన ఇతర లాటిన్ అమెరికన్ దేశాలపైనా ట్రంప్‌లోని వ్యాపారి కన్నుపడితే.. వాటిని నయానో భయానో స్వాధీనం చేసుకునేందుకు ఆయనలోని పాలకుడు కుట్రలు చేస్తున్నాడు.. కత్తులు నూరుతున్నాడు. ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు ప్రపంచ చమురు మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దక్షిణ అమెరికా ఖండంలో అమెరికా నుంచి సుమారు 2,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెనిజులాలో అల్ జజీరా టీవీ నివేదిక ప్రకారం సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలు ఉన్నాయి. ఇవి చమురు నిక్షేపాలు కలిగిన దేశాల జాబితాలో వెనిజులాను అగ్రస్థానంలో నిలుపుతున్నా ఆదాయపరంగా మాత్రం ఆ దేశం చివరి స్థానాల్లో ఉండిపోయింది. ఇప్పుడు ఈ చమురు వ్యాపారాన్ని అమెరికా తన హస్తగతం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. అమెరికా కంపెనీలు వెనిజులా చమురు పరిశ్రమను మరమ్మతు చేస్తాయని, బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టి దేశాన్ని సంపన్నంగా మార్చడానికి ప్రయత్నిస్తాయని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్తులో చమురు ఆదాయం ద్వారా వెనిజులా ఆర్థికంగా పుంజుకుంటుందో లేదో గానీ.. అమెరికన్ కంపెనీలకు, ఆదేశ ఆర్థిక రంగానికి మాత్రం ఊతమిస్తుందనడంలో సందేహం లేదు. వెనిజులా మాదిరిగానే చమురు నిక్షేపాలు కలిగిన దేశాల ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తే వెనిజులా తర్వాత సౌదీ అరేబియా సుమారు 267 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలతో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ఈ దేశం చమురు ఉత్పత్తిలో ప్రపంచ ంలోనే మొదటిస్థానంలో ఉంది. ప్రతిరోజూ మిలియన్ల బ్యారెల్స్ చమురును వెలికితీస్తూ తన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకుంటోంది. ఆ తర్వాత కెనడా సుమారు 171 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలతో మూడో స్థానంలో ఉంది. అయితే ఆ దేశంలో చమురు ఎక్కువగా ఇసుక (ఆయిల్ సాండ్స్) నుంచి లభిస్తుంది. ఈ చమురు వెలికితీయడం ఖర్చుతో కూడుకున్నా దేశాన్ని గ్లోబల్ చమురు మార్కెట్లో ప్రధాన ఆటగాడిగా నిలిపే సామర్థ్యం ఉంది. ఇరాన్ సుమారు 158 బిలియన్ బ్యారెళ్ల నిక్షేపాలు కలిగి ఉంది. మధ్యప్రాచ్యం(మిడిల్ ఈస్ట్)లో ఇరాన్ ప్రధాన చమురు ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ ఆంక్షలు కారణంగా తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతోంది. ఇరాక్‌లో సుమారు 143 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో ఆయిల్ ఉత్పత్తి దేశాల పరిస్థితిని ఆసరా చేసుకుని ఇరాక్ తన క్షేత్రాల్లో ఆయిల్ ఉత్పత్తిని ఇటీవలి కాలంలో పెంచుతోంది. ఇతర మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా దేశాల పరిస్థితి చూస్తే.. కువైట్ 102 బిలియన్ బ్యారెల్స్, ఖAజు 98 బిలియన్, రష్యా 80 బిలియన్ బ్యారెళ్లు, లిబియా 48 బిలియన్ బ్యారెళ్లు, నైజీరియా 37 బిలియన్ బ్యారెళ్లు, యునైటెడ్ స్టేట్స్ 35 బిలియన్ బ్యారెళ్లు. కజకిస్తాన్ 30 బిలియన్ బ్యారెళ్లు, ఖతార్ 25 బిలియన్ బ్యారెళ్లు, చైనా 25 బిలియన్ బ్యారెళ్లు, బ్రెజిల్ 16 బిలియన్ బ్యారెల్స్ మేరకు ఆయిల్ నిక్షేపాలు కలిగి ఉన్నాయి. కానీ ఆదాయపరంగా చూస్తే.. అమెరికా కంటే ఐదురెట్లు అధిక నిక్షేపాలు కలిగిన వెనిజులా 2023లో ఆయిల్ ఎగుమతుల ద్వారా సంపాదించిన ఆదాయం 4.05 బిలియన్ డాలర్లు మాత్రమే. అదే ఏడాది సౌదీ అరేబియా 181 బిలియన్ డాలర్లు, అమెరికా 125 బిలియన్ డాలర్లు సంపాదించి ఆర్థికంగా పైచేయి సాధించాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. సహజ వనరులు ఉండటం ఒక్కటే దేశాలను సంపన్నం చేయలేదని.. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన నాయకత్వం, సాంకేతిక బలం వంటివి ఉండాల్సిన అగత్యాన్ని వెనిజులా ఉదంతం చాటిచెబుతోంది. ఇవి లేకపోతే ఎన్ని వనరులు ఉన్నా.. ఉపయోగించుకోలేకపోగా, బలమైన దేశాల నుంచి ఆక్రమణల ముప్పును నిరంతరం ఎదుర్కోవాల్సి వస్తుంది. వెనిజులా అమెరికా కబంద హస్తాల్లో చిక్కుకోవడమే నిదర్శనం.










Comments