అక్రమాల గుంతల్లో ప్రాణాలే గల్లంతు!
- BAGADI NARAYANARAO

- Dec 15, 2025
- 2 min read
ఇసుక కోసం నదిలో యథేచ్ఛగా తవ్వకాలు
ఆ గోతులతో నిరంతరం ప్రమాదాలు
బైరిలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
ఆ వాహనానికి అనుమతి లేదు.. మృతుడికి లైసెన్సూ లేదు
ఘటనను కప్పిపుచ్చేందుకు రాజీ యత్నాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నాగావళి నదిలో భైరి సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు నమోదు చేసిన కేసులోనూ బహుశా ఇదే కారణం పేర్కొని ఉంటారు. అందులో తప్పులేదు కూడా. కానీ ఈ మరణానికి అసలు కారణం ఏమటిన్నది పరిశీలిస్తే.. ఇసుకాసురుల అక్రమాలకు డ్రైవర్ బలయ్యాడని స్పష్టమవుతుంది. అధికారుల అవినీతి, ఇసుక దోపిడీకి పరాకాష్టగా దీన్ని పేర్కొవచ్చు. ఎందుకంటే.. ఇసుక కోసం నాగావళి నదిలో అక్రమార్కులు చేసిన భారీ గుంతే అతన్ని మింగేసింది. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నాగావళి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ నదిలో ఉన్న గుంతలో కూరుకుపోయి బోల్తాపడటంతో దాన్ని నడుపుతున్న శ్రీకాకుళం రూరల్ మండలం బైైరికి చెందిన మెండ వెంకటరమణ (27) అక్కడిక్కడే మృతి చెందాడు. ఇసుక కోసం తవ్విన గుంతలోనే ట్రాక్టర్ బోల్తా పడడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
అనుమతుల్లేవు
ఉచిత ఇసుక అమల్లోకి వచ్చిన తర్వాత నదుల్లో ఇసుక దోపిడీకి హద్దు లేకుండా పోయింది. బైరికి చెందిన కొందరు వ్యక్తులు ట్రాక్టర్లు, జేసీబీలు కొనుగోలు చేసి మరీ ఇసుక అక్రమ తవ్వకాలు ప్రారంభించారు. ఇసుక తవ్వకాలే అక్రమమని అనుకుంటే.. దాన్ని తరలించడానికి వినియోగిస్తున్న ట్రాక్టర్లు, జేసీబీలకు రవాణా శాఖ నుంచి అనుమతులు ఉండవు. వాటిని నడిపించే డ్రైవర్లకూ లైసెన్సులు ఉండవు. తాజాగా నదిలో బోల్తాపడిన ఇసుక ట్రాక్టర్‌ను నడుపుతూ మృతి చెందిన వెంకటరమణకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడమే దీనికి నిదర్శనం. ప్రమాదానికి గురైన వాహనం గ్రామానికి చెందిన దొండపాటి ఈశ్వరరావుది కాగా.. దానికి కూడా ఎటువంటి అనుమతి పత్రాలు లేవని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ కారణాల వల్లే ప్రమాదాన్ని బయటకు రాకుండా తొక్కిపెట్టేందుకు అక్రమార్కులు ప్రభుత్వ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నా.. మరోవైపు బాధిత కుటుంబానికి డబ్బుల ఆశచూపి రాజీ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసింది.
ఉచితం ముసుగులో..
నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు అనేక సందర్భాల్లో ‘సత్యం’ ఆధారాలతో కథనాలు ప్రచురించింది. ఎక్కడికక్కడ స్థానికులు మైన్స్, రెవెన్యూ, పోలీసు అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఉచిత ఇసుక విధానం ఉన్నందున ఎవరైనా తరలించుకోవచ్చన్న సాకుతో అక్రమార్కుల నుంచి లంచాలు తీసుకొని వారు లారీలు, ట్రాక్టర్లలో భారీగా తరలించుకుపోతుంటే అధికారులు కళ్లు మూసుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమార్కుల ఇసుక దాహానికి ఒకరు బలైన తర్వాత కూడా తమకేమీ సంబంధం లేనట్టుగానే వారు వ్యవహరిస్తున్నారు. ఇసుక తవ్వకందారులను గుర్తించి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ హెచ్చరించినా ప్రయోజనం లేదు. ఇకముందు తవ్వకాలు జరపబోమని ఎమ్మెల్యే సమక్షంలో చెప్పి .. మళ్లీ అర్ధరాత్రి తవ్వకాలు చేపట్టి లారీల్లో విశాఖకు తరలించుకు పోతున్నారు. అక్రమ తవ్వకాలు జరుపుతున్నట్టు సమాచారం ఉన్నా మైన్స్ అధికారులు అటువైపు చూడడంలేదు. ప్రమాదాలు జరిగితే పరిహారం ఇచ్చి నోరు మూయించేస్తున్నారు.










Comments