అక్రమాలే పునాది..భద్రతకు సమాధి
- BAGADI NARAYANARAO

- May 27, 2025
- 3 min read
క్వారీల నిర్వహణ లోపభూయిష్టం
అధికారులకు కాసులు.. కార్మికులకు కష్టాలు
మెళియాపుట్టి ప్రమాదానికి మసిపూసే యత్నాలు
అవి ఫలించకపోవడంతో తనిఖీల హడావుడి
అనుమతుల్లేని క్వారీలను ఏం చేస్తారన్నదే ఆసక్తికరం

కాసులు దండుకొని కళ్లు మూసుకోవడం.. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం హడావుడి చేసి తర్వాత మళ్లీ మౌనం దాల్చడం గనుల శాఖ అధికారులకు కొత్త కాదు. మెళియాపుట్టి మండలంలో ఇటీవల గ్రానైట్ క్వారీ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటనలో ఇది మరోసారి రుజువైంది. ఈ ప్రమాదాన్ని పిడుగుపాటు ఘటనగా చిత్రీకరించి మాయ చేయడానికి తొలుత ప్రయత్నాలు జరిగాయి. జిల్లా ఎస్పీ రంగప్రవేశంతో ఆసలు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాజమాన్యం దిగివచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ నేపథ్యం, అధికారులతో లాలూచీ ఒప్పందాలతో క్వారీల నిర్వాహకులు కార్మికుల భద్రతను గాలికొదిలేసి, అనుమతుల్లేకుండానే ఇష్టారాజ్యంగా పేలుళ్లు నిర్వహిస్తూ ఆదాయం పెంచుకుంటున్నట్లు మెళియాపుట్టి ఘటన మరోసారి బట్టబయలు చేసింది.
పారని పిడుగుపాటు ప్రచారం
గనుల శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో గ్రానైట్, రోడ్‌మెటల్, బిల్డింగ్ స్టోన్‌కు సంబంధించి 301 క్వారీలు ఉన్నాయి. వీటిలో సుమారు 70 శాతం క్వారీలకు పూర్తిస్థాయిలో అనుమతులు లేవు. అలాగే 90 శాతం క్వారీలకు బ్లాస్టింగ్ అనుమతులు లేవు. అయినా జిలెటిన్ స్టిక్స్ ఉపయోగించి యథేచ్ఛగా బ్లాస్టింగులు నిర్వహిస్తున్నారు. పోనీ ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలైనా పాటిస్తున్నారా అంటే అదీ లేదు. దీని ఫలితమే ఇటీవల మెళియాపుట్టి మండలం దీనబంధుపురం గ్రామం వద్ద ఉన్న వీఆర్‌పీ గ్రానైట్స్ క్వారీలో ముగ్గురు కార్మికులు పేలుడులో మృతి చెందిన దుర్ఘటన. అక్కడి సర్వే నెం.13లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే సమీప బంధువైన ఒకానొక రెడ్డి ఈ క్వారీని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మెళియాపుట్టి పోలీసులు కేసు నమోదు చేసినా దాన్ని పిడుగుపాటు ఘటనగా చూపించేందుకు అటు పోలీసులు, ఇటు క్వారీ యాజమానులు ప్రయత్నించారు. కానీ జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి క్వారీని తనిఖీ చేయడంతో రెండు రోజుల తర్వాత అసలు విషయం బయటకొచ్చింది. దాంతో గత్యంతరం లేక వీఆర్‌పీ యాజమాన్యం దిగొచ్చి బాధితులకు చెరో రూ.17 లక్షలు చొప్పున రూ.51 లక్షలు ఇవ్వడానికి అంగీకరించి రూ.25 లక్షలు అప్పటికప్పుడే చెల్లించింది. మిగతా మొత్తం జూన్ మొదటి వారంలో ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్టు తెలిసింది.
పూర్తి అనుమతులు రాకుండానే..
మొత్తం ఏడు హెక్టార్లలో రెండు లీజులు పొందిన వీఆర్‌పీ యాజమాన్యం మొదట లీజు పొందిన 4.5 హెక్టార్లలో రెండేళ్ల పాటు గ్రానైట్ వెలికితీశారు. అయితే పెట్టుబడికి తగ్గట్టుగా గ్రానైట్ లభించకపోవడంతో ఆ పక్క స్థలాన్నే రెండో లీజు తీసుకుని క్వారీ ప్రారంభించారని తెలిసింది. అయితే ప్రభుత్వం నుంచి లీజు అనుమతి ప్రక్రియ పూర్తి కాకుండానే పనులు ప్రారంభించి బ్లాస్టింగ్ చేయగా ముగ్గురు మృతిచెందారు. సాంకేతిక కారణాలతో పాటు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే బ్లాస్టింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. పేలుడు ధాటికి ముగ్గురు కార్మికుల శరీరాలు ఛిద్రమైపోయాయి. పిడుగుపాటు వల్ల మృతి చెందారని నమ్మించేందుకు మృతదేహాలను ఘటనా స్థలం నుంచి క్వారీ బయటకు తీసుకువచ్చారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఘటన జరిగిన రెండు గంటల తర్వాత మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే విషయం తెలిసిపోవడంతో కుటుంబ సభ్యులు మృతదేహాలను చూసి బ్లాస్టింగ్ వల్లే మృతి చెందారని అనుమానం వ్యక్తం చేసినా రాజకీయ అండతో అది పిడుగుపాటేనని యాజమాన్యం దబాయించగా, పోలీసులు వారికి వంత పాడారు. అయితే బాధితులు, గ్రామస్తులు ఆందోళన చేయడం, కలెక్టర్, ఎస్పీలు వెళ్లడంతో క్వారీ యాజమాన్యం దారిలోకి వచ్చింది.
ముడుపులు కట్టామన్న ధీమాతో నిర్లక్ష్యం
అధికారంలో పార్టీ, ప్రభుత్వ పెద్దలకు కప్పం కట్టి తగిన అనుమతులు తీసుకోకుండానే క్వారీలు నిర్వహించడం జిల్లాలో సర్వసాధారణమైపోయింది. ప్రతి క్వారీ నుంచి ఆ ప్రాంత పోలీస్ స్టేషన్‌కు రూ.10 వేలు, డివిజనల్ మైౖన్స్ అధికారులకు రూ.10వేలు చొప్పున నెలవారీ మామూళ్లు చెల్లిస్తున్నట్లు తెలిసింది. అది కాకుండా కలెక్షన్లు అవసరమైనప్పుడల్లా జిల్లా గనుల శాఖ అధికారులు తనిఖీల పేరుతో హడావుడి చేస్తుంటారు. కాగా రెవెన్యూ అధికారులకు మాత్రం సర్వే చేసి క్వారీ అప్పగించినప్పుడు మాత్రమే కొంత మొత్తం చెల్లిస్తుంటారు. ఇలా వేలల్లో మామూళ్లు ముట్టజెబుతున్నందున క్వారీల నిర్వహణలో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భద్రతా ప్రమాణాలను గాలికొదిలేస్తున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతంలో సేఫ్టీ చెకింగ్‌లు, భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై యాజమాన్యాలు కార్మికులతో సమావేశాలు నిర్వహించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కార్మకులకు బూట్లు, గ్లౌజులు, హెల్మెట్లు కూడా సక్రమంగా ఇవ్వడంలేదని కార్మిక సంఘ నాయకుడు నంబూరు షన్ముఖరావు ఆరోపించారు.
తనిఖీల్లో ఏం తేలుతుందో?
జిల్లాలో దాదాపు క్వారీలన్నింటినీ రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు ఉన్నవారే నిర్వహిస్తున్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు క్వారీలు తెరుచుకోలేదు. అధికార పార్టీ నాయకులకు వ్యతిరేకంగా వ్యవహరించిన క్వారీలపై విజిలెన్స్ దాడులు చేయించి రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు అపరాధ రుసుం విధించారు. మరోవైపు అన్ని అనుమతులున్నప్పటికీ పలు రోడ్డు మెటల్ క్వారీల పర్మిట్లు నిలిపేశారు. దాంతో వారంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదే సమయంలో పేలుడుతో ముగ్గురు కార్మికులు మృతి చెందిన తర్వాత తర్వాత కలెక్టర్ ఆదేశాలతో అధికారులు తనిఖీల హడావుడి ప్రారంభించడంతో జిల్లావ్యాప్తంగా క్వారీలు మూతపడ్డాయి. తనిఖీల కోసం అధికారులు క్వారీలకు వెళ్లి ప్రభుత్వం నుంచి పొందిన అనుమతి పత్రాలతో రెవెన్యూ కార్యాలయాలకు రావాలని లీజుదారులను ఆదేశించారు. దాంతో వారంతా తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలు పట్టుకొని క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే చాలామందికి పూర్తిస్థాయి అనుమతులు లేనందున అధికారులు ఏ రీతిలో క్లియరెన్స్ ఇస్తారన్న ఆసక్తి నెలకొంది.










Comments