top of page

అక్షరాల సంబరం

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • 4 days ago
  • 2 min read
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)
అక్షరాలు అక్కడ సీతాకోక చిలుకలై వాలాయి.. రండి.. పూలబాలలమై తేనెలు కురిపిద్దాం.. పదాలు అక్కడ పెదాలపై పూవులై వికసించాయ్‌.. రండి.. తోటమాలులై మాలలు కడదాం.. సిరా చుక్కలు వాక్యాలై అక్కడ సిరిమువ్వల్లా మోగుతున్నాయ్‌.. రండి స్వరాభిషేకాన్ని జరిపించేద్దాం.. నల్లరంగు నక్షత్రాలు అక్కడ హరివిల్లులై వెలిశాయ్‌.. రండి మేఘమాలికలపై వాలిపోదాం.. భావాలు, అనుభవాలు అక్కడ రంగుల ముగ్గులై విరిశాయ్‌.. రండి.. సంక్రాంతి పండుగై వెలిగిపోదాం.. పద్యం, పాట, కథ, కవిత, వ్యాసం, ఉపన్యాసం, నవల, నాటకం, ఎన్నో రకాల బొమ్మలు, రంగురంగుల బట్టల్లో రామచిలుకల్లా మెరిసిపోతున్నాయ్‌ అక్కడ... రండి.. అందమైన ఆ బొమ్మల కొలువును ఒకసారి చూసొద్దాం.. కాగితాల రెక్కలు కట్టుకొని లెక్కలేనన్ని పుస్తకాలు సిక్కోలు కొమ్మపైకి చేరి ఊసులేసుకుంటున్నాయ్‌.. రండి.. ఆ కబుర్ల పరిమళాలను మనసారా పీల్చుకుందాం..

- రఘుపాత్రుని శ్రీనివాసరావు

ree
రేపటితో ముగియనున్న ప్రదర్శన, అమ్మకాలు

శ్రీకాకుళం నగరంలో తొలిసారిగా వందకు పైగా ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థలు 50వేల టైటిల్స్‌ కలిగిన పుస్తకాల ప్రదర్శన, అమ్మకాన్ని సిక్కోలు పుస్తక మహోత్సవం పేరుతో నిర్వహిస్తున్నారు. దీనికి రేపే చివరి రోజు. ఏడు రోడ్ల జంక్షన్‌ వద్దనున్న ఎన్టీఆర్‌ మున్సిపల్‌ మైదానంలో ఈ నెల 11న ప్రారంభమైన ఈ పుస్తక ప్రదర్శనకు అన్ని వర్గాల నుంచి మంది ఆదరణ లభించింది. పుస్తక ప్రదర్శన, అమ్మకాలతో పాటు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు సాహిత్య, సాంస్కృతిక, వైజ్ఞానిక కార్యక్రమాలతో సాహితీ ప్రియులు, విద్యార్ధులు, ఔత్సాహికులు, సందర్శకులతో పుస్తక మహోత్సవ ప్రాంగణం సందడి వాతావరణం తలపించాయి. జిల్లాకే ప్రత్యేకమైన కళారూపాలైన తప్పెటగుళ్లు, కోలాటం, జముకుల పాట, ఎరుకల పాట, శాస్త్రీయనృత్యాలు, ఏకపాత్రాభినయాలు, నాటికలు, సినీ సంగీత విభావరులు, సంగీత వాయిద్య, విన్యాసాలతో సిక్కోలు పుస్తక మహోత్సవం సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జనవిజ్ఞాన వేదిక నిర్వాహకులు వైజ్ఞానిక ప్రదర్శనలు, మూఢనమ్మకాలపై ప్రదర్శనలు తదితర కార్యక్రమాలు సిక్కోలు పుస్తక మహోత్సవంలో ఎంతగానో అలరించాయి. సందర్శకులు, సాహితీవేత్తలు, విద్యార్ధులు, ఔత్సాహికులను అలరించే వినోద, వికాస, విజ్ఞాన ప్రదర్శనలు ఒకేచోట మేళవించేలా నిర్వహించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కవులు, రచయితల పుస్తకాలు, కవితలు, ఆవిష్కరణ, పుస్తక పరిచయాలు, రచయితల ప్రసంగాలు, కవిసమ్మేళనం, సమీక్షలు నిర్వహించారు. కళింగాంధ్ర గేయ సాహిత్య పరిణామంపై గంటేడ గౌరునాయుడు రచించిన ‘నదికీ ఓ భాష ఉంది’, సిరికి స్వామినాయుడు రచించిన ‘శతర’, కూన రంగనాయకులు రచించిన ‘ఆఖరిమెట్టు’, ‘కూన కథలు’ ఇక్కడే ఆవిష్కరించారు. బాల సుధాకర్‌మౌళి రచించిన ‘గాలిబోత’, ‘సందువ’, రౌతు వాసుదేవరావు రచించిన ‘తూరుపు కొండల్లో మెరిసిన మేరంగి’, మజ్జి భారతి రచించిన ‘జీవన గానం’, అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు రచించిన సంకలనం పుస్తక పరిచయ కార్యక్రమం నిర్వహించారు. లండ సాంబమూర్తి రచించిన ‘ఆమెకై మిగలని ఆమె’ పుస్తక ఆవిష్కరణ, పాయల మురళీకృష్ణ రచించిన ‘గచ్చంశెట్టికి అటు ఇటు’ సంకలన పుస్తకావిష్కరణలు జరిగాయి. కె.రజిని రచించిన ‘పెయిన్స్‌-గెయిన్స్‌’, మల్లిపురం జగదీష్‌ రచించిన ‘అడవి పూల దారిలో మన్నెం ముచ్చట్లు’, కె.ఉదయ్‌కిరణ్‌ రచించిన ‘కాకిచొక్కా’, మామిడి కోదండరావు రచించిన ‘వర్తమానం నుండి గతం వైపు’, ప్రొఫెసర్‌ కెఎస్‌ చలం ఆధ్వర్యంలో దక్షిణాదిన సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్‌ పుస్తకావిష్కరణ కొసమెరుపు. ‘దేశంలో లోపల యుద్ధం’, మండా శ్రీనివాసరావు రచించిన లయతరంగం పుస్తకాన్ని ఆవిష్కరించారు. బుధవారం సాయంత్రం జాతీయోద్యమంలో కళింగాంధ్ర అనే అంశంపై చర్చ, అనంతరం రచయిత కుత్తుం వినోద్‌ రచించిన స్వాతంత్రోద్యమంలో సిక్కోలు వీరులు, ప్రముఖ జర్నలిస్టు అరుణ్‌ బవేర రచించిన ఇలాంటి ఓ ప్రయాణం, మండ శ్రీనివాసరావు రచించిన కళాపూర్ణోదయంలో లయ తరంగం పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. చివరి రోజైన 20న ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వెలమల సిమ్మన్న అధ్యక్షతన కళింగాంధ్ర యాష భాషపై చర్చలు వక్తల ప్రసంగాలు, రచయిత మొయిద శ్రీనివాసరావు రచించిన కరవాక పుస్తక ఆవిష్కరణ, ఎల్‌.ఎన్‌.కొల్లి రచించిన ‘ఎకోస్‌ అండ్‌ ఎంబర్స్‌’ పుస్తక ఆవిష్కరణ ఉంటుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page