top of page

అకటా.. ట్రంప్‌ శాంతిదూతట!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jul 11, 2025
  • 2 min read

ట్రంప్‌కు నోబెల్‌ బహుమతి!.. అదీ శాంతి స్థాపనకు కృషి చేసినందుకు!! అవునా.. ఇది నిజమా! ఇదేం పోయేకాలం!! అని నిందించకండి.. ఇంకా అంత దారుణం జరగలేదు గానీ.. ఏమో గుర్రం ఎగరావచ్చు.. అన్నట్లు జరిగినా జరగవచ్చు. ఎందుకంటే.. డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న అణు ఉద్రిక్తతలను అడ్డుకుని శాంతిస్థాపనకు సర్వశక్తులూ ఒడ్డి కృషి చేస్తున్నారట. అందుకే ఆయనగారి పేరును నోబెల్‌ శాంతి బహుమతి కోసం అమెరికా అనంగు మిత్ర దేశాలైన పాకిస్తాన్‌, ఇజ్రాయెల్‌ ప్రతిపాదించాయన్న వార్తలు అణుబాంబు పేలినంత భీకర విస్ఫోటనం సృష్టించి యావత్తు ప్రపంచం చెవులు మూసుకునేలా చేశాయి. ట్రంప్‌ పేరుతో నామినేషన్లు అందినట్లు నోబెల్‌ కమిటీ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ప్రపంచవ్యాప్తంగా శాంతిస్థాపనకు కృషి చేస్తున్నందుకు గాను ఇజ్రా యెల్‌, భారత్‌`పాక్‌ మధ్య ఇటీవల చెలరేగిన సైనిక ఘర్షణలను నివారించినందుకుగాను పాకిస్తాన్‌ శ్రీమాన్‌ ట్రంప్‌గారు నోబెల్‌ శాంతి బహుమతికి అన్ని విధాలా అర్హుడని పేర్కొంటూ నామినేట్‌ చేశాయని ఆ వర్గాలు వెల్లడిరచాయి. ట్రంప్‌ ఈ అత్యున్నత పురస్కారానికి నామినేట్‌ కావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అమెరికాలోని రిపబ్లికన్‌ సెనేటర్లు, అలాగే నార్వే న్యాయరంగానికి చెందిన కొందరు ఉత్తర కొరియ వల్ల అణు ఉద్రిక్తతలను ఉపశమింపజేసినందుకు గాను 2018లో ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్‌ చేశారు. అలాగే మద్యప్రాచ్యంలో రేగిన ఉద్రిక్తతలను చల్లార్చేందుకు కృషి చేశా రంటూ 2021లో కూడా నార్వేకు చెందిన కొందరు ట్రంప్‌ను సిఫార్సు చేశారు. తాజాగా తనపేరు మళ్లీ నామినేట్‌ కావడంపై ట్రంప్‌ స్పందిస్తూ అసలు ఈ అవార్డు తనకు ఎప్పుడో రావాల్సిందని ఉవా చించారు. వాస్తవానికి నోబెల్‌ విజేతల ఎంపిక ప్రక్రియ చాలా సుదీర్ఘంగా రహస్యంగా జరుగుతుంది. ఈ బహుమతులకు అర్హులను నామినేట్‌ చేయడమనేది ఈ ప్రక్రియలో కేవలం ప్రాథమిక చర్య మాత్రమే. కానీ అత్యున్నతమైన, ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ శాంతి బహుమతికి అర్హులుగా ఒకరి పేరును ప్రతిపాదించడమంటే.. వారు ఎంతో నిస్వార్థంగా వ్యవహరిస్తూ, రాగద్వేషాలకు అతీతంగా ప్రపంచ స్థాయిలో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేందుకు, యుద్ధ ఉద్రిక్తతలను ఉపశమింపజేసేందుకు కృషి చేసినవారై. శాంతిదూతలుగా అంతర్జాతీయ గుర్తింపు, మన్ననలు పొంది ఉండాలి. కానీ ఏకంగా మూడుసార్లు శాంతి బహుమతికి నామినేట్‌ అయిన ట్రంప్‌ ఏ రకంగా ఆ పురస్కారానికి అర్హుడని భావించారో అర్థం కావడంలేదు. ట్రంప్‌ ఆ స్థాయికి ఎదిగారా, లేక నోబెల్‌ స్థాయిని తగ్గించేస్తున్నారా? అన్న అనుమానాలు, ఆవేదన వ్యక్తం కాకమానవు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి వెలగబెడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ తెంపరితనం, వాచాలత, స్వార్థచింతన, పెత్తందారీ ధోరణి ఎలాంటివో ప్రపంచ దేశాల న్నింటికీ బాగా తెలుసు. వాటిలో చాలా దేశాలకు అవి అనుభవైకవేద్యమే. ఎందుకంటే చాలా దేశాలు ఆయన బాధితులే. ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యంగా అమెరికాకు అధ్యక్షుడి హోదాలో ఇతర దేశాల న్నింటిపైనా పెత్తనం చెలాయించేందుకు ట్రంప్‌ నిత్యం ప్రయత్నిస్తుంటారు. ఆయన ప్రతి చర్యలోనూ ఆమెరికా సొంత ప్రయోజనాలే ఇమిడి ఉంటాయి. అణు ఉద్రిక్తల ఉపశమనానికి ఆయన కృషి చేస్తున్నా రన్నది పూర్తిగా అవాస్తవం. అమెరికా అణు విధానాలను, ఆయుధ సార్వభౌమత్వానికి ఎదురెళ్లకుండా ఇతర దేశాలను అణచివేసే ధోరణే తప్ప.. ప్రపంచ శాంతి కోసమన్నది ఉత్తి భ్రమ. మూడేళ్లకుపైగా సాగుతున్న రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇంతకాలం ఆయుధాలు సరఫరా చేసి ఎగదోసింది ఈ అమెరికానే.. ఏడాదికాలంగా ఈ పని చేస్తున్నది ఈ ట్రంప్‌గారు. తీరా ఇప్పుడు తన మాటలు మన్నించి రాజీచర్చలకు రానందుకు హుంకరిస్తూ ఉక్రెయిన్‌కు మళ్లీ ఆయుధాలు సరఫరా చేస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. మరోవైపు ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధ సమయంలో ఒకపక్క చర్చలు, శాంతి మంత్రం జపిస్తూనే.. మరోవైపు ఇరాన్‌లోని భూగర్భ అణుశుద్ధి కేంద్రాలపై తమ యుద్ధ విమానాలతో దాడులు చేయించారు. ఇక ఆపరేషన్‌ సింధూర్‌ను తానే ఆపించి శాంతిస్థాపనకు కృషి చేశానని ప్రకటించుకున్న ట్రంప్‌.. కొద్ది రోజులకే పాక్‌ సైన్యాధ్యక్షుడిని పిలిపించుకుని విందు చర్చలు జరిపారు. ఇక తన మాట వినని దేశాలపై ఏకపక్షంగా సుంకాలు భారీగా పెంచి వాణిజ్య యుద్ధానికి పాల్పడుతున్నారు. అటువంటి వ్యక్తి ప్రపంచ నాయకుడు, శాంతి దూత ఎలా అవుతారు? ఆయన్ను నామినేట్‌ చేయడం ఏమిటి?? ఆయన తీరు చూస్తే ఆ పురస్కారాన్ని ట్రంప్‌ బలవంతంగా తనకు ప్రకటించేలా చేసినా ఆశ్చర్యంలేదు. హతవిధీ!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page