అచ్చెన్న సర్జికల్ స్ట్రైక్!
- DV RAMANA

- Dec 27, 2025
- 3 min read
22ఏ ఇతర చట్టాల్లో చిక్కుకున్న భూములకు విముక్తి
రెవెన్యూ యంత్రాంగం మొత్తాన్ని సమీకరించి వినతుల స్వీకరణ
కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం
మిగతావాటిపై రెండోరోజు కూడా కొనసాగుతున్న కసరత్తు
రాష్ట్రంలోనే తొలిసారి మంత్రి ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ఎచ్చెర్ల మండలంలో సర్వే నెం.450/1లో రైతులకు చెందిన 14 ఎకరాలు పొరపాటున జాతీయ రహదారి విస్తరణ సందర్భంగా భూసేకరణ జాబితాలో చేరిపోయాయి.
అదే ఎచ్చెర్ల మండలం ధర్మవరం ధర్మవరం పరిధిలోని సర్వే నెం.454పిలో 60 మందికి చెందిన సుమారు వంద ఎకరాలు ల్యాండ్ సీలింగ్ చట్టం పరిధిలో చేరిపోయాయి.
హిరమండలం సర్వే నెం. 71/1లో 450 మంది పేదలకు నివేశన స్థలాలుగా ఇవ్వాల్సిన 11 ఎకరాలు వంశధార ప్రాజెక్టు భూసేకరణలో చిక్కుకున్నాయి.
..ఫలితంగా తమకు కాకుండా పోయిన భూములకు విముక్తి కల్పించాలని బాధితులు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ , గ్రీవెన్స్‌ల్లో దరఖాస్తులు ఇస్తూ నానా ప్రయాసలు పడుతున్నా మోక్షం లభించని భూ సమస్యలకు ఒకే ఒక్కరి సంకల్పం పరిష్కారం చూపింది. పైన పేర్కొన్నవారే కాకుండా జిల్లావ్యాప్తంగా వందలాది ఈ తరహా బాధితులు ఉన్నారు. అధికారులు చేసిన తప్పిదాల వల్ల ప్రభుత్వ భూముల జాబితా అయిన 22ఏ, ల్యాండ్ సీలింగ్, భూసేకరణ చట్టాల ఉచ్చులో వందలాది ఎకరాల భూములు చిక్కుకుని, వాటి హక్కుదారులకు చుక్కలు చూపించాయి. పేరుకు సొంత భూములైన వాటిలో సేద్యం చేయలేక, అవసరానికి అమ్ముకోలేక నానా అవస్థలు పడిన బాధితులు కార్యాలయాల చుట్టూ తిరిగినా, వినతిపత్రాలు సమర్పించినా వారి వైపు చూసేవారు గానీ, పరిష్కరించేవారు గానీ లేకుండాపోయారు. ప్రభుత్వ యంత్రాంగం వారం వారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్‌కు రెవెన్యూకు సంబంధించి ఇలాంటి భూసమస్యలపైనే వినతులు అందుతున్నా.. రెవెన్యూ చిక్కుముడుల సాకుతో అధికారులు వాటిని పరిష్కరించలేక చేతులెత్తేయడం లేదా చూద్దాం.. చేద్దాం.. అంటూ కాలయాపన ధోరణి అవలంభించడం వల్ల జిల్లాలో భూసమస్యలు కోకొల్లలుగా పేరుకుపోయాయి.
అమాత్యుడి ఆపన్నహస్తం
ఆక్రందనల నడుమ ‘ఎవరో వస్తారని.. ఏదో చేస్తారన్న’ ఆశలతో ఎదురుచూస్తున్న బాధితులకు నేను ఉన్నానంటూ జిల్లాకు చెందిన వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముందుకొచ్చారు. రాష్ట్రంలో ఏ మంత్రీ చేయని సాహసం చేశారు. అంతకు మించి సంకల్పం పూనారు. 22ఏ తో సహా ఇతరత్రా భూచట్టాల ఉచ్చులో చిక్కుకున్న భూములకు విముక్తి కల్పించి, బాధితుల కష్టాలకు మోక్షం కల్పించాలని నిర్ణయం తీసుకున్న ఆయన వినూత్న కార్యక్రమం చేపట్టారు. మంత్రి తలచుకుంటే సాధ్యం కానిది ఉండదన్నట్లు.. అనుకున్నదే తడవుగా ‘మీ చేతికి మీ భూమి`22ఏ భూస్వేచ్ఛ’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వివాదాలు పరిష్కరించి భూములకు విముక్తి కల్పించడమే ఈ డ్రైవ్ లక్ష్యం. శుక్రవారం జిల్లాపరిషత్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మంత్రి అచ్చెన్నాయుడతోపాటు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, తదితరులు స్వయంగా పర్యవేక్షించారు. ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు ఏకధాటిగా జరిగిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బాధిత రైతులు, ఇతర వర్గాల ప్రజలు తమ సమస్యల వినతులతో వెల్లువెత్తారు. సాధ్యమైనంతవరకు అక్కడికక్కడే వినతులను పరిశీలించి పరిష్కరించేలా మంత్రి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, భూసేకరణ డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్డీవోలను రప్పించి వారికి వేర్వేరుగా కంప్యూటర్లు, సహయకులతో కౌంటర్లు ఏర్పాటు చేసి వినతులను స్వీకరించడంతోపాటు తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు.
758 మందికి తక్షణ లబ్ధి
భూసమస్య పరిష్కార డ్రైవ్ ద్వారా జిల్లాలో 758 మందికి తక్షణ ఉపశమనం లభించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అధికారిక సమచారం ప్రకారం వివిధ రకాల భూ సమస్యలకు సంబంధించి జిల్లా నలుమూలల నుంచి 293 దరఖాస్తులు అందాయి. వీటిలో అత్యధికంగా టెక్కలి డివిజన్ నుంచి 156, శ్రీకాకుళం డివిజన్ నుంచి 112, పలాస డివిజన్ నుంచి 25 దరఖాస్తులు అందాయి. వీటిలో రెండు దరఖాస్తులను తిరస్కరించి, 7 దరఖాస్తులకు పరిష్కారం చూపించారు. శ్రీకాకుళం డివిజన్ పరిధిలో 10 సమస్యలను పరిష్కరించి 23 దరఖాస్తులను తిరస్కరించారు. ఇక టెక్కలి డివిజన్ 10 దరఖాస్తులకు పరిష్కారం చూపిన అధికారులు 7 వినతులను తిరస్కరించారు. ఆమోదించడం లేదా తిరస్కరించడం ద్వారా జిల్లావ్యాప్తంగా 59 దరఖాస్తులను అధికారులు అక్కడికక్కడే క్లియర్ చేశారు. తద్వారా పలాస డివిజన్‌లో 34.219 ఎకరాలు, శ్రీకాకుళం డివిజన్‌లో 18.13 ఎకరాలు, టెక్కలి డివిజన్‌లో 35.09 ఎకరాలు.. మొత్తం 87.43 ఎకరాల భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తప్పించి వాటి యజమానులకు ఉపశమనం కల్పించారు. ఈ కార్యక్రమం వల్ల పలాస డివిజన్‌లో 98 మంది, శ్రీకాకుళం డివిజన్ లో 44 మంది, టెక్కలి డివిజన్‌లో 616 మందికి తక్షణ లబ్ధి చేకూరింది.
రెండో రోజు కొనసాగుతున్న డ్రైవ్
పైన పేర్కొన్న గణాంకాలు పరిశీలిస్తే అందిన దరఖాస్తుల్లో చాలా తక్కువ మాత్రమై పరిష్కరించినట్లు కనిపిస్తుంది. అయితే పరిష్కార కార్యక్రమం వరుసగా రెండో రోజైన శనివారం కూడా కొనసాగుతోంది. మొదటి రోజు అందిన దరఖాస్తుల్లో వివిధ కారణాల వల్ల అప్పటికప్పుడు పరిష్కారం చూపించలేకపోయిన దరఖాస్తులపై రెవెన్యూ మంత్రాంగం కార్యాచరణ నిర్వహిస్తోంది. తహసీల్దార్లు, డీటీలు సహా అధికారులందరూ కలెక్టరేట్‌లో మకాం వేసి వీటిపైనే కసరత్తు చేస్తున్నారు. అందిన దరఖాస్తుల్లో దేవదాయ శాఖ వివాదాలు, న్యాయ సమస్యలు, కచ్చితమైన రికార్డులు లేకపోవడం, క్షేత్రస్థాయి పరిశీలిన జరపాల్సిన, ల్యాండ్ సీలింగ్ వివాదాలు, సబ్ డివిజన్ సమస్యలతో లింక్ అయి ఉన్న దరఖాస్తులను పెండిరగులో పెట్టారు. అయితే వాటిని అలా వదిలేయకుండా ఏదోరకంగా కచ్చితమైన పరిష్కారం చూపించడంపైనే మంత్రి నిర్దేశకత్వంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మంత్రి అచ్చెన్న శుక్రవారం రాత్రి దాదాపు 11 గంటల వరకు జెడ్పీ హాల్‌లోనే ఉండిపోయారు. పరిష్కారం కానివాటిపైన మరోసారి సమీక్షించడానికి ఇటువంటి డ్రైవ్ క్షేత్రస్థాయిలో నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా తన నియోజకవర్గానికి సంబంధించిన భూముల కొర్రీలు విడదీయడానికి స్వయంగా తహసీల్దార్, ఆర్డీవోల చుట్టూ తిరగడం కనిపించింది. ప్రస్తుతానికి పరిష్కారమైన అర్జీల సంఖ్య తక్కువగా ఉండొచ్చు. కానీ ఇది ఓ కొత్త సంస్కృతికి నాంది. ఇదే వినతిని గతంలో వివిధ గ్రీవెన్స్‌లలో ఇచ్చినప్పుడు పరిష్కారం కాకుండా ఇప్పుడు మాత్రమే ఆ పని పూర్తయిందంటే.. దీని వెనుక రెడ్ టేపిజం ఉన్నట్టే అర్థం. వైకాపా హయాంలో తమకు సంబంధం లేని భూములు కోట్లు విలువ చేస్తున్నాయని తెలిసి చాలామంది ప్రభుత్వం నుంచి సిఫార్సు చేయించుకొని ఎంచక్కా భూములు కొట్టేశారు. సామాన్యుడు మాత్రం తన హక్కును పొందడానికి యుద్ధమే చేయాల్సి వచ్చింది.










Comments