top of page

అడ్డగోలు బిల్లులు.. ఖజానాకు చిల్లులు!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 8 hours ago
  • 2 min read
  • అక్రమార్కుల చేతుల్లోకి చేరిపోతున్న కార్పొరేషన్ ఆదాయం

  • ఖజానాకు తూట్లు పొడిచిన పుణ్యం గత అధికారులదే

  • ఇందులో సరెండర్ చేసిన ఏఈ వాటా ఎక్కువే

  • జనరేటర్, మోటార్ రిపేర్ల పేరుతో రూ.లక్షల్లో బిల్లులు

  • నీటిసరఫరా, విద్యుత్ పనుల పేరుతో బినామీలకు చెల్లింపులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

కుండ నిండా నీరున్నా.. దాని కింద చిల్లున్నట్టు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేసి ఖజానా నింపుతున్నా అందులో ఒక్క రూపాయి కూడా ఉండకపోవడానికి కారణం.. ఇక్కడ పని చేస్తున్న అధికారులే. ప్రతి ఏడాది మార్చి 31 నాడు ఆస్తిపన్ను వసూళ్లలో కార్పొరేషన్ తన రికార్డులను తానే బద్దలుగొట్టుకున్నది. కానీ కనీస అవసరాలకు సరిపడిన నిధులు కూడా ఉండకపోవడానికి పూర్తి బాధ్యత ఇంజినీరింగ్, హెల్త్ అధికారులతో పాటు కమిషనర్లుగా పనిచేసి వెళ్లిన వారిదే. 15 ఏళ్లకు పైగా ఎన్నికైన పాలకవర్గం లేకపోవడంతో ఇష్టారాజ్యంగా సాగిన అధికారుల పాలనతో అడ్డదిడ్డంగా బిల్లులు పెట్టేసి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో పని చేయడానికి అధికారులు ఇష్టపడరన్న ఒకే ఒక్క సాకు చూపించి ఎవరిపైనా చర్యలకు ఇంతకుముందున్న కమిషనర్లు ఉపక్రమించలేదు సరికదా.. ఇష్టానుసారంగా పెట్టిన బిల్లులను పాస్ చేసి చెక్కుల రూపంలో చెల్లింపులు జరిపేశారు. సవ్యంగా పని చేయడంలేదన్న ఆరోపణలతో కొద్దిరోజుల క్రితం వాటర్ వర్క్స్ ఏఈ సత్యనారాయణను కమిషనర్ కూర్మారావు సరెండర్ చేసినందుకు ఇంజినీరింగ్ అధికారులు బాగా ఫీలైపోయారు.

తిరిగిరాని జనరేటర్, మోటార్

వాస్తవానికి ఆయన ఇక్కడ ఉద్యోగం మాత్రమే చేయలేదు.. ఆ ముసుగులో వ్యాపారం కూడా చేసుకున్నారు. ఖాజీపేటలో వాల్వ్ ఆపరేటర్‌గా పని చేస్తున్న కిశోర్‌ను ముందు పెట్టి అర్జంట్ వర్క్‌ల పేరుతో అనేక బిల్లులు చేసుకున్నారు. వీటిలో ఎన్ని చేశారు.. ఎన్ని అర్జంట్.. ఎంత ఖర్చు అయ్యింది.. అనే లెక్కలను ఏ రోజూ ఎవరూ అడగలేదు. అత్యవసర సర్వీసుల్లో తాగునీటి సరఫరా ఒకటి కాబట్టి తరచూ ఎక్కడో ఒకచోట లీకు చూపించడం, ఆ పేరుతో లెక్కాపత్రం లేకుండా లక్షల్లో బిల్లులు పెట్టడం, పాస్ చేయించుకుని విత్‌డ్రా చేయడం ఒక తంతుగా జరిగిపోయింది. తీరా కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తర్వాత ఒకసారి రికార్డులు తిరగేస్తే కోట్లాది రూపాయల నిధులకు పత్రాలు దొరకడంలేదు. మిగిలినవి కూడా నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిపినట్లు తెలిసింది. శ్రీకాకుళం నగరంలో తాగునీటి సరఫరాకు 2014లో లక్షలు పోసి 250 కేవీ జనరేటర్ పోసి కొన్నారు. కొన్నాళ్ల క్రితం దానికి రిపేరు వచ్చింది. దాన్ని బాగు చేయడానికి స్థానికంగా ఉన్న మెకానిక్‌లు ముందుకొచ్చినా ‘అలా కుదరదు.. కంపెనీకే పంపిస్తున్నామంటూ’ రిపేర్ల పేరుతో రూ.4.80 లక్షల బిల్లు పెట్టారు. తీరా కమిషనర్ కూర్మారావు మొన్న తనిఖీకి వెళ్తే సదరు జనరేటర్ ఎక్కడుందో ఎవరూ చెప్పలేకపోయారు. రూ.1.50 లక్షలు ఇస్తే జనరేటర్ బాగు చేస్తామని స్థానికంగానే కొందరు ముందుకొచ్చారు. ఒకవేళ తమవల్ల కాకపోతే వేరేచోట బాగు చేయించి అరువు పెట్టయినా జనరేటర్ తెస్తామని చెప్ప్పుకొచ్చారు. అలా కాకుండా సంబంధిత కంపెనీకే పంపాలంటూ జనరేటర్‌ను ఇక్కడి నుంచి తరలించేశారు. అది ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో ఉన్న 45 కేవీ జనరేటర్ కూడా చెడిపోయింది. రూ.10వేలు ఖర్చు పెడితే బాగవుతుంది. కానీ దాన్నుంచి కూడా సొమ్ము పిండుకోవాలన్న దురాలోచనతో అలాగే వదిలేశారు. ఎన్ని రోజులు పని చేయకుండా ఉంటే సమస్య అంట జఠిలమవుతుంది కాబట్టి అంత పెద్ద మొత్తంలో బిల్లు పెట్టుకోవచ్చనేది సంబంధిత ఇంజినీర్ అతితెలివిగా కనిపిస్తోంది. అలాగే వాటర్ వర్క్స్‌లో 75 హెచ్‌పీ మోటార్‌ను రిపేరు కోసమంటూ బొబ్బిలి పంపించారు. అది ఇప్పటికీ రాలేదు. ఈలోగా ఏఈని సరెండర్ చేశారు.

విద్యుత్ పనుల్లో చీకటి బాగోతాలు

శ్రీకాకుళంలో కొన్ని ప్రాంతాలకు నీరు రావడం, మరికొన్ని ప్రాంతాలకు పాక్షికంగా అందుతుండటానికి ఈ రెండే కారణాలు. ఒకటి జనరేటర్ లేకపోవడం, రెండు మోటార్ రాకపోవడం. అలాగే ఏఈ సత్యనారాయణ తనకు అనుకూలంగా ఉండే శ్రీ ఎలక్ట్రికల్ అండ్ సివిల్ వర్క్స్ అనే సంస్థను తెర మీదకు తెచ్చి 2024 మే లో పంప్‌సెట్ రిపేర్ అండ్ మెయింటినెన్స్ కింద రూ.2 లక్షల పైచిలుకు బిల్లు చేయించుకున్నారు. అదే నెల ఎలఈడీ డ్రైవర్స్ సప్లై చేశారంటూ రూ.2.78 లక్షలు ఇప్పించేశారు. వీధి దీపాలు సరఫరా చేశారంటూ రూ.6.19 లక్షలు, వీధి దీపాలు బిగించడానికి అవసరమైన క్లాంప్ సెట్లకు రూ.4.53 లక్షలు, వీధి దీపాలు ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ కోసం రూ.7 లక్షలు పైచిలుకు, అదే ఏడాది అక్టోబరులోపు మొత్తం రూ.17.74 లక్షలు పైచిలుకు వర్క్ బిల్లు కింద పిండేశారు. ఇది కాకుండా శ్రీసూర్య కన్‌స్ట్రక్షన్స్ పేరుతో క్లోరినేషన్ పనుల్లో రూ.15.62 లక్షలు, ఎస్‌వీఎల్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో మరో రూ.81 వేలు అదే ఏడాది చివరిలో బిల్లు చేసుకున్నారు. మోహన్ ఎలక్ట్రికల్ వర్క్స్, శ్రీ ఎలక్ట్రికల్స్, ఎస్‌వీఎల్ ఎంటర్‌ప్రైజెస్.. ఇవన్నీ వాటర్ వర్క్స్ ఏఈ సత్యనారాయణ తనతో పాటు తెచ్చుకున్న సంస్థలే. వీధి దీపాల నిర్వహణను కూడా ఈయనే చూడటం వల్ల పెద్ద ఎత్తున ఆయన బినామీలు చేరి అప్పటి కమిషనర్లతో అర్జంట్ వర్క్‌ల కింద చెక్కులు రాయించుకొని చెక్కేశారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page