అణు విద్యుత్ దిశగా ఘనమైన ముందడుగు!
- DV RAMANA

- 4 days ago
- 3 min read

ప్రపంచమంతా యుద్ధం చుట్టూ తిరుగుతున్నది. పెట్రో సంక్షోభంలో చిక్కుకుని ఇంకే దేనిపైనా దష్టి సారించలేకపోతున్నది. అందుకే భారత్ సాధించిన ఓ అద్భుత విజయాన్ని ఎవరూ ఇంకా గుర్తించలేనట్లు కనిపిస్తున్నది. దశాబ్దాల క్రితం భారత అణు పితామహుడు డాక్టర్ ీVAమీ జహంగీర్ బాబా కన్న కలలను భారత్ సాకారం చేసింది. అణు విద్యుత్ రంగంలో అరుదైన విజయాన్ని నమోదు చేసింది. తమిళనాడు కల్పక్కంలోని అణువిద్యుత్ కేంద్రంలో ఉన్న ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించడం ద్వారా ఈ రంగంలోని ప్రపంచస్థాయిలో అరుదైన మైలురాయిని అధిగమించింది. అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలకే సాధ్యం కాని విజయంగా దీన్ని పేర్కొనవచ్చు. ఇప్పటి వరకూ రష్యా మాత్రమే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌ను వాణిజ్య అవసరాల కోసం విజయవంతంగా నడుపుతుండగా తాజా విజయంతో త్వరలోనే భారత్ కూడా ఆ ఘనత సాధించిన రెండో దేశంగా నిలవనుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) సైతం ఈ విషయంలో భారత్‌ను అభినందించింది. ఈ నేపథ్యంలో అణు క్రిటికాలిటీని సాధించడం అంటే ఏమిటీ.. దీని వల్ల దేశానికి కలిగే ప్రయోజనం ఏమిటన్న ఆసక్తి నెలకొంది. అత్యధిక జనాభా కలిగిన మనదేశ విద్యుత్ డిమాండ్ 2047 నాటికి 900 గిగావాట్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం థర్మల్(బొగ్గు), హైడల్(జల), సౌర, పవన్ విద్యుత్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నాం. భవిష్యత్తు అవసరాలకు ఇవి ఏమాత్రం సరిపోవు. అందువల్ల అణువిద్యుత్ కీలకం కానుంది. అతి చౌకగా, నిరంతరాయంగా, కాలుష్యరహిత విద్యుత్‌ను అణు రియాక్టర్లు అందించగలవని హోమీ బాబా ఆనాడే గుర్తించారు. మరోవైపు అణు రియాక్టర్లను నడపడానికి యురేనియం వాడుతున్నారు. అది మన దేశంలో చాలా తక్కువగా లభిస్తుంది. అయితే దానికి ప్రత్యామ్నాయంగా మన దేశంలో పుష్కలం(ప్రపంచ ఉత్పత్తిలో 25 శాతం)గా లభించే థోరియంను ఉపయోగించి అణువిద్యుత్ ఉత్పత్తికి మూడంచెల అణుశక్తి వ్యూహానికి 1950ల్లోనే హోమీ భాభా రూపకల్పన చేశారు. కానీ ఆయన తదనంతరం వేగంగా ముందుకు వెళ్లలేకపోయాం. మళ్లీ ఇన్నాళ్లకు కల్పక్కంలోని ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ సాధించడం ద్వారా నాడు ీVAమీ బాబా సూత్రీకరించిన చౌక అణువిద్యుత్ తయారీకి సంబంధించిన మూడంచెల ప్రక్రియలోని మొదటి దశను విజయవంతంగా దాటి రెండో దశలోకి భారత్ ప్రవేశించింది. క్రిటికాలిటీ అంటే.. ఒక రియాక్టర్ బయటి నుంచి ఎలాంటి సహాయం లేకుండానే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ద్వారా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేసే స్థితికి చేరుకోవడం. ఈ ప్రక్రియలో మనం ఖర్చు చేసే ఇంధనం కంటే ఉత్పత్తి అయ్యే ఇంధనం ఎక్కువగా ఉంటుంది. మరింత సులువుగా అర్థమయ్యేలా చెప్పాలంటే సాధారణ రియాక్టర్లు ఇంధనాన్ని మండిస్తే.. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు మండించిన ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో న్యూట్రాన్లు అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. మాడరేటర్లను ఉపయోగించి వీటి వేగాన్ని తగ్గిస్తారు. కంట్రోల్ రాడ్లను ఉపయోగించి న్యూట్రాన్ల సంఖ్యను తగ్గిస్తారు. వాటి వేగం వల్ల పుట్టే విపరీతమైన వేడిని తగ్గించడానికి ఈ రియాక్టర్లలో నీటికి బదులు ద్రవ సోడియంను కూలెంట్‌గా ఉపయోగిస్తారు. కానీ ఇది గాలితో లేదా నీటితో కలిసినా మండుతుంది. అందుకే వీటి నిర్వహణ కష్టంతో కూడుకున్నది. ఈ టెక్నాలజీ ద్వారా అణువిద్యుత్ ఉత్పత్తి చేయడానికి చాలా ఏళ్లుగా అమెరికా, ఫ్రాన్స్, జపాన్ తదితర దేశాలు లక్షల కోట్లు ఖర్చుతో విఫలయత్నాలు చేశాయి. ఒక్క రష్యా మాత్రమే విజయం సాధించి వాణిజ్య స్థాయిలో ఫాస్ట్ బ్రీడర్ రియక్టర్లను విజయవంతంగా నడుపుపున్న ఏకైక దేశంగా నిలిచింది. క్రిటికాలిటీని సాధించడం ద్వారా కల్పకంలోని రియాక్టర్లు తాము వినియోగించుకునే అణు ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇందుకోసం రియాక్టర్లలో మిక్స్‌డ్ ఆక్సైడ్ ఫ్యూయల్ లేదా ఎంఓఎక్స్ ఫ్యూయల్‌ను, లిక్విడ్ సోడియంను కూలెంట్‌గా ఉపయోగిస్తారు. ఈ ఏడాది చివర్లో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభించడానికి ముందు ఇంకా కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. ఇవన్నీ విజయవంతమైతే రష్యా తర్వాత ఈ తరహా అణు విద్యుత్ ఉత్పత్తి చేసే రెండో దేశంగా భారత్ అవతరించనుంది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల తయారీకి అమెరికా 1960ల్లోనే ప్రయత్నించింది. డెట్రాయిట్ సమీపంలో ఫెర్మి 1 రియాక్టర్‌ను నిర్మించింది. కానీ 1966లో లూస్ ప్లేట్ కూలెంట్ సరఫరాను అడ్డుకోవడంతో రియాక్టర్ దెబ్బతింది. దీంతో ఆ ప్రాజెక్ట్ మూలన పడింది. ఆ తర్వాత బిగ్గర్ క్లించ్ రివర్ బ్రీడర్ రియాక్టర్ కోసం అమెరికా ప్లాన్ చేసినా అది కూడా బెడిసికొట్టింది. ఫ్రాన్స్ కూడా ఈ టెక్నాలజీ కోసం భారీగా ఖర్చు చేసింది. ప్రపంచంలోనే తొలి అతిపెద్ద వాణిజ్య బ్రీడర్ రియాక్టర్‌గా 1200 మెగావాట్ల సూపర్‌ఫినిక్స్ రియాక్టర్ ఏర్పాటుకు ప్లాన్ చేసింది. దశాబ్దాలపాటు ఇది మనుగడలో ఉన్నప్పటికీ.. కొన్ని నెలలపాటే పని చేసింది. సోడియం లీకేజీలు, అగ్నిప్రమాదాలు, క్షయీకరణ, రాజకీయ కారణాలతో 1998లో ఈ రియాక్టర్ మూతపడింది. ఇక జపాన్ తన మొంజు రియాక్టర్ విషయంలో ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంది. 1995లో ఈ రియాక్టర్‌లో సోడియం లీక్ కావడంతోపాటు మంటలు చెలరేగి మూతపడింది. కొన్నేళ్లకు మళ్లీ ప్రారంభించినా మరో ప్రమాదం జరిగింది. చివరకు 2016లో దీన్ని జపాన్ మూసివేసింది. కాగా ప్రస్తుతం ఎనిమిది గిగావాట్ల అణువిద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్న భారత్ 2047 నాటికి దాన్ని 100 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. థోరియంతో అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేయగలిగితే యురేనియం దిగుమతులు, ఇంధన ధరల ప్రభావం లాంటి ఒత్తిళ్ల నుంచి బయటపడగలదు. కల్పక్కం రియాక్టర్ దాదాపు 30 లక్షల ఇళ్లకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూనే.. భవిష్యత్తు రియాక్టర్ల కోసం అదనంగా ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. థోరియం ఆధారిత రియాక్టర్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఎవరిపైనా ఆధారపడకుండా విద్యుత్ ఉత్పత్తి చేసుకోగలదు.






Comments