ఇరాన్‌దే వ్యూహాత్మక విజయం!
- DV RAMANA

- 1 day ago
- 2 min read

యుద్ధంలో గెలవడమంటే ఎదుటివారిని చంపడం కాదని అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అది ముమ్మాటికీ వాస్తవం. కానీ ఆ విషయం ఇరాన్‌కు తెలిసినంతగా అమెరికా, ఇజ్రాయెల్ పాలకులకు తెలియదని ప్రస్తుత యుద్ధపరిణామాలు చూస్తే అర్థమవుతుంది. అగ్నికి వాయువు తోడైనట్లు ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్‌ను రెండుమూడు రోజుల్లోనే మడతెట్టేస్తామన్న అతివిశ్వాసాన్ని ప్రదర్శించాయి. కానీ ఇరాన్ అలా అనుకోలేదు. అగ్రరాజ్యంతో నేరుగా తలపడుతున్న విషయాన్ని, దాడుల తీవ్రతతో వాటిల్లుతున్న అపారనష్టాన్ని జాగ్రత్తగా అంచనా వేస్తూనే సైనికబలంతో కాకుండా వ్యూహచతురతతో అగ్రరాజ్యంపైనే ఆధిపత్యం సాధించింది. ఫలితంగా రెండుమూడు రోజుల్లో ఇరాన్ కథ ముగించేస్తామని బీరాలు పలికిన అమెరికా`ఇజ్రాయెల్ నెలరోజులకు పైగా దాడులు చేసినా ఇరాన్‌ను వీసమెత్తు కూడా లొంగదీసుకోలేకపోగా.. చివరికి తామే చర్చల పేరుతో రెండు వారాల సీజ్‌ఫైర్ ప్రకటించి శాంతిమంత్రం జపించాల్సి వచ్చింది. ఇస్లామాబాద్ వేదికగా రెండురోజుల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అణుపరిశోధనలు, హర్మూజ్ జలసంధి విషయంలో ఇరుపక్షాలు పట్టువిడుపులు ప్రదర్శించకుండా మొండిగా వ్యవహరించడంతో చర్చలు అర్థంతరంగా ముడిసిపోయాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ హూంకరింపులు మొదలుపెట్టారు. హర్మూజ్‌ను దిగ్బంధిస్తామంటూ జలసంధిని యుద్ధనౌకలతో చుట్టుముట్టారు. దాంతో మళ్లీ ఉద్రిక్తతలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు గానీ.. శాంతి చర్చలకు ముందు మాత్రం ఇరాన్ వ్యూహాత్మకంగా గెలుపొందిందనే చెప్పాలి. యుద్ధరంగంలో సైనిక, ఆయుధ బలంతో అమెరికాను ఓడించడం ఇరాన్ లక్ష్యం కాదని దాని ఎత్తుగడలు, కార్యాచరణ గమనిస్తే అర్థమవుతుంది. దానికి బదులు ఆ దేశంపై ఆర్థికంగా తట్టుకోలేనంత భారం పడేలా చేయడమే దాని ఉద్దేశం. ప్రపంచ ఆయిల్ రవాణా సరఫరాలో 20 శాతం వరకు రవాణా జరుగుతున్న పర్షియన్ గల్ఫ్‌లోని హర్మూజ్ జలసంధిని ఏకధాటిగా 38 రోజుల పాటు మూసివేయడం, కొన్ని దేశాలకు మాత్రమే.. అదికూడా భారీగా టోల్ వసూలుచేసి రవాణాకు అనుమతించడం, అంతర్జాతీయ చమురు ధర బ్యారెల్ 115 డాలర్లకు పెరిగేలా చేయడం, గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలను గడగడలాడించడం ద్వారా అమెరికన్లు యుద్ధ ప్రభావాన్ని గ్యాస్ పంపుల (పెట్రోల్ బంకుల) వద్ద స్వయంగా అనుభవించేలా చేశారు. ఒక విశ్లేషకుడి అభిప్రాయం ప్రకారం దీన్ని సరళ భాషలో చెప్పాలంటే.. యుద్ధం వెళ్లగక్కిన వేడి నేరుగా అమెరికాకు తగిలేలా చేయడంలో ఇరాన్ వ్యూహకర్తలు విజయం సాధించారు. ట్రంప్ మళ్లీ ఆ ప్రయత్నం చేస్తారని నేను అనుకోను అని ఆ విశ్లేషకుడు వెల్లడించి అభిప్రాయమే పశ్చిమాసియా యుద్ధం ఫలితాన్ని వివరిస్తుంది. యుద్ధం గెలిచామని, ఇరాన్‌ను మెడలు వంచి చర్చల వరకు తీసుకొచ్చామని ట్రంప్ ఢాంబికాలు ప్రదర్శించినా వాస్తవ ఫలితాలను గమనిస్తే ఇరాన్‌కే దీనివల్ల తక్షణ ఫలితం లభించిందని చెప్పాలి. యుద్ధం ప్రారంభానికి ముందు అంటే ఫిబ్రవరి 28 వరకు ఇరాన్ ఆధీనంలో లేని రెండు అంశాలు ఇప్పుడు దాని వశమయ్యాయి. వాటిలో మొదటిది అంతర్జాతీయ వాణిజ్యానికి ఊతమిస్తున్న హర్మూజ్ జలసంధిపై అనధికారిక నియంత్రణ, దాని తమ దేశానికి భారీ ఆదాయ వనరుగా చేసుకునే అవకాశం. ఇక రెండోది.. ప్రస్తుత చేదు అనుభవాల నేపథ్యంలో భవిష్యత్తులో ఇరాన్‌పై పెద్ద ఎత్తున దాడి చేయాలంటే ఏ అమెరికా అధ్యక్షుడూ చెల్లించలేనంత భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే బలమైన హెచ్చరిక పంపగలగడం. సీజ్‌ఫైర్‌కు ముందు 38 రోజుల యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌లోని 12,300 కంటే ఎక్కువ లక్ష్యాలపై విరుచుకుపడి నాశనం చేశాయి. ఇరాన్ నౌకాదళంలో అధిక భాగాన్ని ముంచేశాయి, ఆ దేశ సర్వోన్నత నాయకుడిని అంతమొందించాయి. క్షిపణి నిల్వలను ధ్వంసం చేశాయి. ఈ నష్టాలు, సంప్రదాయ సైనిక కొలమానాల ప్రకారం చూస్తే మాత్రం యుద్ధంలో అమెరికా`ఇజ్రాయెల్ దేశాýదే పైచేయి అని చెప్పకతప్పదు. అయినప్పటికీ ట్రంప్ ఎంచుకున్న సమయంలో కాకుండా, ఇరాన్ ప్రతిపాదించిన సీజ్‌ఫైర్ షరతుల ప్రకారం హర్మూజ్ జలసంధి ఇంకా టెహ్రాన్ చేతుల్లో ఉండగానే కాల్పుల విరమణ అమల్లోకి రావడం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. హర్మూజ్‌ను తన శత్రువులు, అనుమతి లేని ఇతర దేశాలకు చెందిన నౌకలు వినియోగించకుండా జలసంధి అడుగున సీమైన్స్‌ను కూడా ఇరాన్ అమర్చింది. వాటిని తొలగించడానికి మైన్ స్వీపర్ నౌకలను రంగంలోకి దించినప్పటికీ కచ్చితమైన లొకేషన్లు తెలియకుండా పూర్తిస్థాయిలో మైన్స్ తొలగించడం కష్టసాధ్యమేనంటున్నారు. మరోవైపు దాడుల ద్వారా ఇరాన్ ప్రభుత్వాన్ని బలహీనపర్చి అనుకూల పాలకులను ప్రతిష్టింపజేసుకోవాలన్న అమెరికా లక్ష్యం వికటించి ఇరాన్ ప్రభుత్వం మరింత కఠినంగా మారింది. సైన్యంతో పాటు కీలకమైన ఐఆర్‌జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) మునుపటి కంటే ఎక్కువ శక్తి సంతరించుకుంది. కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారని చెబుతున్నప్పటికీ ఆయన పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు దివంగత సుప్రీం లీడర్ కంటే కఠినమైన వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి. అమెరికా బాంబు దాడులు తమకు స్వేచ్ఛను ప్రసాదిస్తాయని భావించిన దేశంలోని నిరసనకారులను ఇప్పుడు గూఢచారులన్న ముద్ర వేసి వేటాడుతున్నారు. యుద్ధం వల్ల ఇరాన్ బలహీనపడుతుందని, అమెరికా పట్టు పెరుగుతుందని భావించారు. కానీ ఇప్పుడు ఇరాన్ ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గంలో పన్నులు వసూలు చేస్తోంది. ఇరాన్ అణు ఆకాంక్షలు అంతమవుతాయని భావించారు, కానీ టెహ్రాన్ మాత్రం అణు ఇంధన శుద్ధిని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నది. చైనాపై పట్టు సాధించడానికి హర్మూజ్ జలసంధిని వాడాలనే అమెరికా అప్రకటిత లక్ష్యం కాస్త వికటించి చివరికి ఇరాన్ చేతికే చిక్కింది.






Comments