top of page

అది కొంపలు ముంచే ‘ప్లాన్‌’!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 3 days ago
  • 3 min read
  • పాత మాస్టర్‌ ప్లాన్‌ బూజు దులిపి కొత్త ఆమోదం

  • నేటి జనావాసాలను అందులో ఖాళీగా చూపిన వైనం

  • 150 అడుగుల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు

  • దాన్ని నిర్మించాలంటే ఇళ్లు, లే అవుట్లు అన్నీ కూల్చాల్సిందే

  • విషయం తెలిసి లబోదిబోమంటున్న బాధితులు

  • న్యాయం చేస్తామని ఎమ్మెల్యే శంకర్‌ భరోసా

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఆ ప్రాంతంలో అన్ని అనుమతులతో నిర్మించిన ఇళ్లు, భవనాలు ఉన్నాయి. డీటీసీపీ అప్రూవల్‌ పొందిన లే అవుట్లు, ఇళ్ల స్థలాలు ఉన్నాయి. విలువైన ఈ స్థలాలతోపాటు చాలావాటిలో లక్షలు వెచ్చించి జరిపిన నిర్మాణాలు ఒకే ఒక్క నిర్ణయంతో మట్టిలో కలిసిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. సుమారు రూ. 300 కోట్ల విలువైన ఆస్తులను నగర ప్రజలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. కేవలం కేంద్రం ఇచ్చే అమృత్‌ పథకం నిధుల కోసం అప్పటి అధికారులు చేసిన తప్పిదం ఇప్పుడు సుమారు వంద కుటుంబాల కొంప ముంచేవరకు తీసుకొచ్చింది. బాధితులు, అధికారుల వివరాల ప్రకారం.. పట్టణాలు, నగరాల్లో ప్రతి ఇరవయ్యేళ్లకోసారి మాస్టర్‌ ప్లాన్‌ను మారుస్తుంటారు. రాబోయే సంవత్సరాల్లో పెరిగే జనాభా అవసరాలను పరిగణనలోకి తీసుకుని కొత్త మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించి, ఆమల్లోకి తెస్తుంటారు. ఆ విధంగా తీసుకొచ్చిన ఒక మాస్టర్‌ ప్లానే ఇప్పుడు పౌరుల ఆస్తులకు ప్రమాదంగా పరిణమించింది.

అనాలోచితంగా ఆ మాస్టర్‌ ప్లాన్‌ తయారీ

శ్రీకాకుళం మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 2000లో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌కు 2020లో కాలం చెల్లింది. ఆ సమయానికి శ్రీకాకుళం నగరపాలక సంస్థ స్థాయికి ఎదగ్గా.. అంతవరకు ఉన్న వుడా పరిధి నుంచి నగరాన్ని తప్పించి, ప్రత్యేకంగా సుడా(శ్రీకాకుళం నగరాభివృద్ధి సంస్థ) ఏర్పాటు చేశారు. కాగా శ్రీకాకుళం కార్పొరేషన్‌తో పాటు జోన్‌`1 పరిధిలోని ఏడు మండలాలకు కలిపి వుడా వీఎంఆర్‌డీఏగా మారిన తర్వాత 2017లోనే ఒక మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారు. లీ కన్సల్టెన్సీ అనే సంస్థ రూపొందించిన ఈ మాస్టర్‌ప్లాన్‌లో అన్ని ప్రాంతాలను ఖాళీ స్థలాలుగానే చూపించారు. అప్పటికే వుడా అనుమతితో వేసిన లే అవుట్లు, నిర్మించిన ఇళ్లు, భవనాలు, ఆలయాలు, ఇతర నిర్మాణాలతోపాటు ప్రైవేట్‌ నివాస స్థలాలను అసలు పరిగణనలోకి తీసుకోలేదు. కాగా 2020లో పాత మాస్టర్‌ప్లాన్‌ గడువు మగిసినా తర్వాత కొత్త మాస్టర్‌ప్లాన్‌ రూపొందించకపోవడంతో అమృత్‌ పథకం ద్వారా కేంద్రం నుంచి సుడాకు నిధులు అందలేదు. దాంతో 2023లో మళ్లీ లీ కన్సల్టెన్సీకే మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించే బాధ్యత అప్పగించారు. అయితే నగరపాలక సంస్థ అధికారులు ఫీజు చెల్లించకపోవడంతో లీ కన్సల్టెన్సీ మాస్టర్‌ప్లాన్‌ వారికి అప్పగించలేదు. ఇక గత్యంతరం లేక 2017లో వీఎంఆర్‌డీఏ తయారుచేసిన మాస్టర్‌ ప్లాన్‌కు బూజు దులిపి, ప్లానింగ్‌ సెక్రటరీలతో నామమాత్రపు మార్పులు చేయించారు. అప్పటికే నిర్మాణాలు, లే అవుట్లు వెలసిన ప్రాంతాలను ఖాళీ స్థలాలుగానే చూపించారు. క్రెడాయ్‌ అధ్వర్యంలో బాపూజీ కళామందిర్‌లో దానిపై ప్రజాభిప్రాయ సేకరణ తతంగం ముగించి ప్రభుత్వానికి నివేదించారు. దీన్నే యథాతథంగా ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు ఆరో తేదీన జీవో 154ను విడుదల చేసింది.

ఆసలు విషయం ఆలస్యంగా..

జీవో వచ్చాకే ఆ మాస్టర్‌ ప్లాన్‌ ఎంత చేటు చేస్తుందో అర్థమైంది. నగరంలో కీలకంగా మారిన 80 అడుగుల రోడ్డుకు సమాంతరంగా కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 150 ఆడుగుల రోడ్డు నిర్మిస్తారని జీవో 154తో వెల్లడైంది. 2020` 2047 అభివృద్ది ప్రణాళికలో భాగంగా దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. పెద్దపాడు, ఖాజీపేట, ఆరసవల్లి, 80 ఆడుగల రోడ్డు, పొన్నాడ బ్రిడ్జ్‌ మీదుగా నవభారత్‌ జంక్షన్‌ వరకు 150 ఆడుగుల రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ జీవోలో పేర్కొన్న అంశాలు స్థానికుల్లో అందోళన రేపాయి. ప్రతిపాదిత రోడ్డు పరిధిలో చేర్చిన భూముల్లో 2009లో వుడా ఆమోదించిన లే అవుట్లు, స్థలాలు ఉన్నాయి. వాటిలో చాలావరకు ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేసుకుని ప్రజలు నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 150 అడుగుల రోడ్డు నిర్మించాలంటే ఆ నిర్మాణాలన్నింటినీ కూల్చివేసి స్థలాలను సేకరించాల్సి ఉంటుంది. దీనివల్ల సుమారు 100 కుటుంబాలవారు ఆశ్రయం కోల్పోయి బాధితులుగా మారతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 2017లో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించే నాటికే 80 అడుగల రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే 2017 నాటి మాష్టర్‌ప్లాన్‌ను ఆమోదించినా.. దాన్ని ఎనిమిదేళ్లు ఆలస్యంగా అమల్లోకి రావడం, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకపోవడమే ఈ అనర్థానికి కారణమంటున్నారు.

బాధిత ప్రాంతాలు ఇవే..

కొత్త మాస్టర్‌ప్లాన్‌ను ఆమోదించిన విషయం అధికారవర్గాలు బహిర్గతపర్చలేదు. ఇళ్ల అనుమతుల కోసం వెళ్లినప్పుడే ఇది బయటపడిరది. ఎల్‌పీ నెంబర్‌ 35/2009లో ఉన్న శ్రీసాయి శ్రీనివాసనగర్‌ లేఅవుట్‌లో ఇంటి నిర్మాణానికి అవసరమైన ప్లాన్‌ అనుమతుల కోసం కొందరు నగరపాలక సంస్థ అధికారులను సంప్రదించినప్పుడు 2017నాటి మాస్టర్‌ప్లాన్‌ అమల్లోకి వచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ మాస్టర్‌ ప్లాన్‌లో ప్రతిపాదించిన 150 అడుగల రోడ్డు శ్రీసాయి శ్రీనివాస లే అవుట్‌ మీదుగానే వెళుతుందని, అందువల్ల ఇంటి నిర్మాణానికి ప్లాన్‌ ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో కొత్త మాస్టర్‌ప్లాన్‌పై ఆందోళన ప్రారంభమైంది. ఈ ఒక్క లే అవుటే కాకుండా పొన్నడ బ్రిడ్జ్‌ నుంచి వండాన మురళీ లేఅవుట్‌లో ఉన్న 30 ఇళ్లు, స్థలాలు, 80 అడుగల రోడ్డు మార్గంలో ఉన్న వండాన ఆస్పత్రి, 40 ఫ్లాట్లతో కూడిన ఆపార్ట్‌మెంట్‌, కేవీఆర్‌ లేఅవుట్‌లో ఉన్న 15 ఇళ్ల స్థలాలను వాటి యజమానులు కోల్పోవలసి వస్తుంది. దాంతో బాధితులు లబోదిబోమంటూ కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు, స్థానిక ఎమ్మెల్యే ను, జిల్లా ఉన్నతాధికారులను కలిసి మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాస్టర్‌ప్లాన్‌ వల్ల ఎవరికీ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిష నర్‌కు సూచించారు. దీంతో బాధితులతో సోమవారం సాయంత్రం సమావేశమైన కమిషనర్‌ రోడ్డు ఎలైన్‌మెంట్‌ మార్చడానికి చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. అయితే మాస్టర్‌ ప్లాన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత మార్పుచేర్పులు చేయడం అంత సులభం కాదని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page