top of page

అదొక హఠాత్పరిణామం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jul 19
  • 2 min read
  • ఆ హత్య వెనుక పథకం లేదు..రాజకీయ కోణమే లేదు!

  • భార్యాభర్తల గొడవ నేపథ్యంలోనే జరిగిన ఘటన

  • గొడవకు వచ్చి ఆవేశంలో కొట్టడంతో చనిపోయాడు

  • అదుపులో ఎనిమిది మంది నిందితులు

  • విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రమణ, డీఎస్పీ వివేకానంద

    ree
(సత్యంన్యూస్‌,శ్రీకాకుళం)

జిల్లాలో కలకలం సృష్టించిన ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటకు చెందిన వైకాపా నాయకుడు సత్తారు గోపి(41) హత్యోదంతంలో రాజకీయ కోణం లేదని ఏఎస్పీ కె.వి.రమణ, డీఎస్పీ వివేకానంద స్పష్టం చేశారు. ఎచ్చెర్ల మండలం కొయిరాల వద్ద ఈ నెల 11న ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళుతున్న సత్తారు గోపీ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఇది పథకం ప్రకారం జరిగిన హత్యని ఏఎస్పీ, డీఎస్పీ వివరించారు. ఈ కేసులో అరెస్టు చేసిన ఎనిమిది నిందితులను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫరీద్‌పేటకు చెందిన దంపతులు జి.ఉమామహేశ్వరరావు, భవానీల మధ్య తలెత్తిన వివాదం చివరికి హత్యకు దారి తీసిందన్నారు. వివాదంపై భవానీ ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి వద్ద పంచాయితీ పెట్టిందన్నారు. అక్కడ చేసిన సెటిల్‌మెంట్‌ నచ్చకపోవడంతో మళ్లీ టీడీపీ నాయకుడు కొత్తకోట అమ్మినాయుడిని ఆశ్రయించారని తెలిపారు. ఆ తర్వాత తన భర్త ఉమా మహేశ్వరరావుపై భవానీ ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు కౌన్సెలింగ్‌కు రావాలని మూడుసార్లు నోటీసులు పంపినా ఉమామహేశ్వరరావు స్పందించలేదని వివరించారు. ఈ తరుణంలో అమ్మినాయుడు వర్గానికి చెందిన ఎనిమిది మందితో కలిసి ఉమామహేశ్వరరావు ఇంటికి వెళ్లిన భవానీ తలుపులు బద్దలుగొట్టి సామాన్లను వ్యానులో తీసుకుపోయి కొయిరాల జంక్షన్‌లోని ఒక ఇంట్లో పెట్టారని చెప్పారు. దాంతో రంగంలోకి దిగిన సత్తారు గోపి అక్కడికి వెళ్లి ఇంటి తలుపులు పగులగొట్టి దౌర్జన్యంగా సామాన్లు ఎందుకు తీసుకెళ్లారని భవానీని నిలదీయడం ప్రారంభించాడు. సామాన్లను కొయిరాల వద్ద ఇంట్లో పెట్టిన అనంతరం మద్యం సేవిస్తున్న ఎనిమిది మంది కలగజేసుకుని గోపీని రోడ్డుపైనే కర్రలతో కొడుతూ ఇంటి వెనుక వైపునకు ఈడ్చుకెళ్లి కర్రలు, ఇటుకలతో తలపై కొట్టి హత్య చేశారని వారు వివరించారు. ఈ కేసును ఎస్పీ పర్యవేక్షణలో జేఆర్‌పురం సీఐ అవతారం ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు గాలింపు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నాయన్నారు. గ్రామానికి చెందిన కొత్తకోట సూర్యనారాయణ, పైడి పెద్ది సత్యనారాయణ, కొత్తకోట ఈశ్వరరావు, కొత్తకోట రంగనాథం, సీపాన శివకృష్ణ, సీపాన అనిల్‌కుమార్‌, పైడి రంగరామానుజులు, గురుగుబెల్లి భవానీలను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి పాత్రపై విచారణ జరుగుతోందని చెప్పారు. వారి పాత్ర ఉందని తేలితే అరెస్టు చేస్తామన్నారు. నిందితులందరూ గోపీ బాధితులేనని తెలిపారు. అరెస్టయిన వారిలో ఇద్దరు రౌడీషీటర్లు ఉండగా, హతుడు సత్తారు గోపీపై ఎనిమిది క్రిమినల్‌ కేసులు ఉన్నాయన్నారు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ (సాంకేతిక ఆధారాలు)తో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. హత్య జరిగిన చోట సీసీ కెమెరా ఉందన్నారు. దీనికి సంబంధించిన డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐ అవతారం, ఎస్సైలు సందీప్‌కుమార్‌, ఎస్‌.చిరంజీవి, జి.లక్ష్మణరావు, ఎస్‌.బాలరాజు పాల్గొన్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page