అది వ్యవస్థ లోపం.. ఇది వ్యక్తి హననం!
- DV RAMANA

- 16 hours ago
- 3 min read

నిత్యం తన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై స్పందించడం సమాజనైజం. వ్యక్తిగతంగా అనేకమంది చాలా ఘటనలపై మనకెందుకులే అన్నట్లు మౌనంగా ఉండిపోవచ్చేమో గానీ.. మానవ సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సమాజం మాత్రం ప్రతి ఘటనపైనా ఏదో ఒక రూపంలో స్పందిస్తూనే ఉంటుంది. అయితే సమాజం స్పందించే తీరు ఎప్పుడూ ఒకేలా ఉండదు. సంఘటనను బట్టి.. సందర్భాన్ని బట్టి.. బాధితుడిని బట్టి.. ఆ సమస్య వెనుక ఉన్న వ్యవస్థల పనితీరును బట్టి అది మారుతుంటుంది. అయితే కొన్నిసార్లు ఒకే రకమైన ఉదంతాలపై విభిన్నంగా స్పందించడం చిత్రంగా కనిపిస్తుంది.. విస్మయం కలిగిస్తుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య కాలంలో తీవ్ర చర్చనీయాంశాలుగా మారిన తిరుమల లడ్డూ కల్తీ, మేడారం జాతరలో కోవా బన్ విక్రేతకు వేధింపుల ఉదంతాలే దీనికి నిదర్శనం. ఈ రెండూ ఆహార పదార్థాలే. కల్తీకి సంబంధించిన వివాదాలే. కోవాబన్ కంటే తిరుమల లడ్డూ ప్రశస్తమైనది. ఏడుకొండల వెంకన్న మహాప్రసాదంగా దానికో పవిత్రత ఉంది. కోవాబన్‌కు అటువంటిదేమీ లేదు. ఒక చిరువ్యాపారి పొట్టకూటి కోసం దాన్ని అమ్ముకుంటుంటే.. నచ్చినవారు దాన్ని కొంటే కొనవచ్చు లేకపోతే లేదు. దాని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే తిరుమల లడ్డూ ప్రసాదంలో ఏమాత్రం తేడా ఉందని తెలిసినా లక్షలాది భక్తుల మనోభావాలు దిబ్బతింటాయి. వారంతా తీవ్రంగా స్పందించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ విచిత్రంగా ఈ రెండు వివాదాలపై సమాజ స్పందన, వ్యక్తుల స్పందిన ఈ అంచనాలకు పూర్తి భిన్నంగా ఉంది. శ్రీవారి లడ్డూ విషయంలో రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు తప్పితే భక్తులు దాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు లేదు. అదే సమయంలో కోవాబన్ విషయంలో మాత్రం తీవ్రమైన స్పందనలు కనిపిస్తున్నాయి. దాదాపు ఒకేరకమైన రెండు వివాదాలపై పరస్పర భిన్నంగా వ్యక్తమవుతున్న స్పందనలు నేటి మన సామాజిక మనస్తత్వంలోని భిన్న దక్పథాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవానికి చెందిన ప్రసాదంలో అపచారం జరిగిందన్న వార్త వచ్చినప్పుడు సమాజం కొంత నిశ్శబ్దంగా మారిన్నట్లు కనిపించింది. అయితే ఆ నిశ్శబ్దం వెనుక ఒక గంభీరమైన నిరీక్షణ ఉందనేది వాస్తవం. ఆ ఆరోపణలపై నమ్మకంలేక నిర్ధిష్టమైన ఆధారాలు లభించేవరకు కాస్త వేచి చూడాలన్న ధోరణి కనిపించింది. దానికి తగినట్లే లడ్డూ వ్యవహారం బయటకు రాగానే.. ఆ ఆరోపణలకు తక్షణమే రాజకీయ రంగు పులిమేశారు. భగవంతుడి ప్రసాదాన్ని, భక్తుల మనోభావాలతో పరాచికాలాడకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా లడ్డూ వివాదాన్ని అధికార, ప్రతిపక్షాల మధ్య ఫక్తు రాజకీయ పోరాటంగా మార్చి పేట్రేగడాన్ని గమనించిన సామాన్య భక్తులు కొంత తటస్థంగా ఉండిపోయారు. ఈ సమస్య పరిష్కారం వీధుల్లో కాకుండా.. అత్యున్నత ధర్మపీఠాల వద్ద జరుగుతుందని వారు నమ్మడమే దీనికి కారణం. అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు ఈ వివాదంలో స్వయంగా జోక్యం చేసుకుని ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్) నియమించడం ద్వారా చట్టపరిధిలో ఈ వివాదాన్ని పరిష్కరించడానికి తనవంతు ధర్మాన్ని నిర్వర్తించింది. ఈ అంశం ప్రాంతీయంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ రాజకీయ ప్రకంపనలు రేపింది. ప్రధాని నరేంద్రమోదీ దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా దీనిపై నివేదికలు కోరడం ఈ సమస్య తీవ్రతను చాటిచెప్పింది. అటు విపక్ష నేత రాహుల్‌గాంధీ సైతం ‘ప్రతి భక్తుడిని గాయపరిచే అంశమిది’ అంటూ విచారణకు డిమాండ్ చేశారు. స్థానికం నుంచి జాతీయస్థాయి వరకు మీడియా కూడా ఈ వివాదంపై నిరంతరం దృష్టి సారించి సొంత విశ్లేషణలు, పరిశోనల వ్యాసాలు కవర్ చేయడంతోపాటు లడ్డూ చుట్టూ జరుగుతున్న రాజకీయ ఆధిపత్య పోరాటాన్ని ఎండగట్టడం వంటి పరిణామాలు ఈ వివాదాన్ని సజీవంగా ఉంచాయి. నెలల తరబడి ఈ విషయంపై చర్చ జరగడం, సామాజిక మాధ్యమాల్లో నిలదీయడం అనేది ఒక శుభపరిణామం. అయితే కమీషన్ల కక్కుర్తి కోసం జరిగిన ఈ అక్రమ వ్యవహారాన్ని చిలవలు పలవలు చేసి సెంటిమెంట్లను దెబ్బతీయడానికి జరిగిన కుట్రగా భావించిన భక్తులు మాత్రం మౌన వీక్షకులుగానే ఉండిపోయారు. కానీ కోవాబన్ విక్రేత విషయంలో సమాజం అసాధారణ రీతిలో తక్షణ స్పందన కనబర్చింది. దీనికి ప్రధాన కారణం ఈ ఇష్యూలో ఎటువంటి రాజకీయ జెండాలు, అజెండాలు లేకపోవడమే. కోవా బన్ అమ్ముతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తనను వేధించి, బెదిరించినప్పుడు ఆ చిరువ్యాపారి కళ్లలో కనిపించిన నిస్సహాయత, భయం, తన కుటుంబం ఏమౌతుందోనన్న ఆవేదన ప్రతి సామాన్యుడిని వ్యక్తిగతంగా కదిలించింది. సోషల్ మీడియా పేరిట జరిగిన సామాన్యుడి పొట్ట కొట్టే ప్రయత్నంపై పెల్లుబుకిన ఆగ్రహం.. వ్యవస్థల కంటే వ్యక్తుల పట్ల సహజంగా మనలో ఉండే సానుభూతిని చాటిచెప్పింది. లడ్డూ విషయంలో వ్యవస్థాగత మార్పు కోసం నిరీక్షిస్తున్న సమాజం, కోవాబన్ విషయంలో మాత్రం ఒక వ్యక్తికి జరుగుతున్న అన్యాయంగా భావించి, దాన్ని అడ్డుకోవడానికి తక్షణమే కదిలింది. ఈ రెండు ఘటనలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సమాజం స్పందించడం లేదని అనడం కంటే తనదైన శైలిలో పోరాడుతున్నదని చెప్పడం సబబు. లడ్డూ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ద్వారా పూర్తిస్థాయి విచారణ జరిగి దోషులకు శిక్షలు పడతాయని, ప్రక్షాళన జరుగుతుందని ఆశిస్తున్న మానవ సమాజం.. మరోవైపు కళ్లముందు కనిపిస్తున్న మానవీయ సంక్షోభాలపై మాత్రం తక్షణమే స్పందిస్తోంది. సూత్రధారులు ఎవరైనా సరే చట్టానికి దొరక్క తప్పదనే నమ్మకంతో ఉన్న కోట్లాది భక్తుల నిరీక్షణ ఫలించాలని ఆశిద్దాం. నివురుగప్పిన నిప్పులా ఉన్న సహనం, ఓర్పును తేలికగా తీసుకుంటే.. ఆ గీత దాటితే.. రాజకీయులకైనా, సోషల్ మీడియా వంటి ఆధునిక వ్యవస్థలకైనా విశాల ప్రజాసమూహం అనబడే సమాజం చేతిలో చావుదెబ్బ తప్పదు.










Comments