అదే ‘సత్యం’.. అది సర్కారు స్థలం!
- BAGADI NARAYANARAO
- 1 day ago
- 1 min read
కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు
సర్వే చేసి జిరాయితీ కాదని తేల్చి హద్దుల ఏర్పాటు
కే.మత్స్యలేశంలో అక్రమానికి అడ్డుకట్ట

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అక్రమాలు నిజమే.. అది ముమ్మాటికీ సర్కారు భూమేనని ఎట్టకేలకు అధికారులు తేల్చారు. ‘సత్యం’లో ‘మొన్న ప్రభుత్వ భూమి.. నేడది జిరాయితీ’ శీర్షికతో ప్రచురితమైన కథనంతో అధికారులు ఆగమేఘాలపై స్పందించి రీసర్వే చేయించడంతో లోగుట్టు బయటపడిరది. కే.మత్స్యలేశం పరిధిలోని సర్వే నెంబర్ 211/6 లోని 1.56 ఎకరాలు జిరాయితీ కాదని గార మండల రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఈ భూమిపై అదే గ్రామానికి చెందిన బొంది రమణారావు గత నెల 11న గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై రోజులు గడుస్తున్నా గార రెవెన్యూ అధికారులు స్పందించలేదు. దాంతో గ్రామస్తులు ‘సత్యం’ పత్రికను ఆశ్రయించారు. వారిచ్చిన ఆధారాల ప్రకారం ‘ప్రభుత్వ భూమిని జిరాయితీగా మార్చిన వైనాన్ని వివరిస్తూ ‘సత్యం’ సమగ్ర కథనం ప్రచురించింది. దాంతో ఉలిక్కిపడిన రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలకు పూనుకున్నారు. ఆ మేరకు మండల సర్వేయర్, సచివాలయం సర్వేయర్ వివాదంలో ఉన్న భూమిని సర్వే చేసి.. ప్రభుత్వ భూమిగా నిర్ధారించి సరిహద్దులు ఏర్పాటు చేశారు.
రెండో అంశం వదిలేశారు
అయితే రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 211/6లో ప్రభుత్వ భూమి 1.56 ఎకరాల విస్తీర్ణంగా పేర్కొనగా.. రీసర్వే అనంతరం దాన్ని 1.82 సెంట్లకు పెంచేశారు. కానీ గురువారం నిర్వహించిన సర్వేలో మళ్లీ 1.56 ఎకరాలుగానే చూపించి హద్దులు నిర్ణయించారు. రీసర్వేలో చూపించిన అదనపు భూమి ఎవరి ఖాతాలో వేశారో తెలియాల్సి ఉంది. అలాగే సర్వే నెంబర్ 211/8లో మొత్తం విస్తీర్ణం 1.75 ఎకరాలు జిరాయితీగా రికార్డుల్లో ఉంది. కానీ రీసర్వే తర్వాత దాన్ని 2.06 ఎకరాలుగా నమోదు చేశారు. దీనిపైనా బొంది రామణారావు కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఈ సర్వే నెంబర్‌లోని 50 సెంట్ల స్థలంలో ప్రభుత్వ పాఠశాల ఉండగా, రీసర్వే తర్వాత దాన్ని 30 సెంట్లకు కుదించారు. మిగతా 20 సెంట్లు వేరొకరి ఖాతాలో నమోదు చేశారు. దీనిపైనా రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బొంది రమణారావు తెలిపారు. ఫిర్యాదులో ఒక అంశానికి చెందిన వివాదాన్నే పరిష్కరించిన అధికారులు మరో అంశాన్ని పట్టించుకోకుండా ఫిర్యాదులో పేర్కొన్న అన్ని అంశాలకు పరిష్కారం చూపించినట్టు పేర్కొంటూ రెవెన్యూ అధికారులు తనతో సంతకాలు చేయించుకున్నారని రమణారావు ‘సత్యం’కు వివరించారు. ఆక్రమణలో ఉన్న భూమికి హద్దులు నిర్ణయించి ప్రభుత్వ భూమిగా నిర్ధారించడం కొంత ఉపశమనం కలిగించిందని సంతృప్తి వ్యక్తం చేశారు.
Comments