top of page

కొత్త పాస్‌పుస్తకాలు కొందరికే!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 2 hours ago
  • 2 min read
  • వివాదాలు ఉన్న భూములకు పెండింగ్

  • స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా కానరాని పరిష్కారం

  • కొద్దిపాటి 22ఏ సమస్యలకే విముక్తి

  • ఆన్‌లైన్ చేయకుండానే గడువు పెంపు కాలక్షేపం

(సత్యంన్యూస్,శ్రీకాకుళం)

గత ప్రభుత్వం నిర్వహించిన భూముల రీసర్వేలో జరిగిన తప్పులను సరిదిద్ది, ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పాస్‌పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం జిల్లాలో మందకొడిగా జరుగుతోంది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటోతో కూడిన పాస్ పుస్తకాల స్థానంలో జగన్ ఫొటో తొలగించి రాజముద్రతో కూడిన పుస్తకాలు ఇస్తున్నారు తప్ప వాటిలో పొందుపర్చిన భూముల వివరాలు, హద్దుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. న్యాయ, ఇతరత్రా వివాదాలు ఉన్న భూములకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పాస్ పుస్తకాలు ఇవ్వడంలేదు. సమగ్ర భూసర్వే జరగని రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే చేయాలని నిర్ణయించడంతో ఆ కార్యక్రమం మాత్రమే జరుగుతోంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో భూములకు హద్దులు నిర్ణయించి, పాతిన జగన్ బొమ్మతో కూడిన రాళ్లను మాత్రం తొలగించి మిగతా వాటిని యథాతథంగా ఉంచేశారు. రెవెన్యూ క్లినిక్ పేరుతో భూసమస్యలకు పరిష్కారం చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూములకు విముక్తి కల్పించనున్నట్లు రాష్ట్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్న వెంటనే జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి పెండిండ్‌లో ఉన్న కొన్ని దరఖాస్తులకు పరిష్కారం చూపించారు. దీన్ని కొనసాగించే ఉద్దేశంతో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌లో రెవెన్యూ క్లినిక్ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 30 మండలాల తహసీల్దార్లను భాగస్వా ములను చేశారు. వీరంతా రెండు వారాలుగా జిల్లా స్థాయి గ్రీవెన్స్‌లో పాల్గొంటున్నారు. భూ సమస్యపై పదేపదే గ్రీవెన్స్‌కు వచ్చే వారి అర్జీలను ఆన్‌లైన్ చేయకుండా నేరుగా తహసీల్దార్లకు అప్పగించి పరిష్కరించాలని ఉన్నతాధికారులు అదేశిస్తున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు సతమతమవుతున్నారు. సమస్యను పరిష్కరించకుండా ఆర్జీని తిరస్కరిస్తే దానికి వివరణ ఇవ్వాల్సివస్తున్నందున 105 రోజులు గడువు పెట్టి అర్జీలను పరిష్కారంలో నాన్చివేత ధోరణి అనుసరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం చూపించగలమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ సమస్యల్లో అధికంగా గ్రామ కంఠం, ప్రభుత్వ, ఎండోమెంట్, ఇనాం భూములకు సంబంధించి న్యాయస్థానాల్లోనూ, రెవెన్యూ కోర్టుల్లోనూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.

రిసర్వేది అదే పరిస్థితి

నిషేధిత జాబితాలో చేరిన భూములకు విముక్తి కల్పించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు అప్పగించింది. అయితే జిల్లాలో నిషేధిత జాబితాలో చేరిన భూముల్లో ఎండోమెంట్, ఇతర అభ్యంతరకరమైన ప్రభుత్వ భూములే ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల వీటిపై మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినా కేవలం కొన్నింటిని మాత్రమే పరిష్కరించగలిగారు. వీటిలో గ్రామ కంఠం, నీటిపారుదలశాఖ సేకరించిన భూములు, ల్యాండ్ సీలింగ్ జాబితాలో చేరిన కొన్నింటిని మాత్రమే 22ఏ జాబితా నుంచి తొలగించారు. ప్రత్యేక డ్రైవ్‌లో పెండింగ్‌లో ఉన్నవి, నేరుగా దరఖాస్తు చేసుకున్న 293 ఆర్జీల్లో కేవలం 59 మాత్రమే పరిష్కరించగలగారు. వీటిలో 37 అర్జీలను తిరస్కరించి 22 ఆర్జీలకు చెందిన భూములకు విముక్తి కల్పించారు. దీనికి కొనసాగింపుగా గ్రీవెన్స్‌లో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌లోనూ ఆర్జీలు స్వీకరిస్తూ వాటికి పరిష్కారం చూపించడానికి గడువు ఇస్తున్నారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి వందల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఈ ప్రక్రియ కొనసాగిస్తునే జిల్లాలో 205 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే ప్రారంభంచారు. 230 సర్వే బందాలు 80 రోవర్స్‌తో రోజుకు రెండు వేల ఎకరాలు రీసర్వే చేయాలని టార్గెట్ ఇచ్చారు. 2024 మార్చి నాటికి రీ సర్వే నిలిచిపోయిన చోటు నుంచే పున:ప్రారంభించారు. రీసర్వేకు మొదట 2027 డిసెంబర్ వరకు గడువు ఇచ్చినా.. తర్వాత దీన్ని 2026 డిసెంబర్‌కు కుదించారు. వైకాపా హయాంలో రికార్డుల ఆధారంగా సర్వే నిర్వహించగా.. ఇప్పుడు రైతుల ఆధీనంలో ఉన్న భూముల వివరాల ఆధారంగా సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలో హద్దులు నిర్ణయిస్తున్నా రాళ్లు పాతడం లేదు. రీసర్వేకు కాలపరిమితి నిర్ణయించినా.. అందుకు తగినట్లు సర్వేయర్లను, సాంకేతిక పరికరాలను కేటాయించలేదని విమర్శలు ఉన్నాయి. 205 రెవెన్యూ గ్రామాల్లో రోజుకు రెండువేల సర్వే చేయడానికి 253 రోవర్లు అవసరం కాగా 80 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఉన్నవాటిలో కొన్ని మరమ్మతులకు గురయ్యాయంటున్నారు. దీంతో సర్వే చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page