ఆమదాలవలస వైకాపాలో అసమ్మతి
- BAGADI NARAYANARAO

- 2 hours ago
- 1 min read
నియోజకవర్గ సమన్వయకర్త మార్పుపై అసంతప్తి
పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన పప్పల రమేష్
తమ్మినేని ప్రధాన అనుచురుడి నిష్క్రమణపై విస్మయం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో స్టార్ నియోజకవర్గాల్లో ఒకటైన ఆమదాలవలస వైకాపాలో అసమ్మతి రాజుకుంటోంది. నియోజకవర్గ క్యాడర్ ప్రమేయం లేకుండా ఏకపక్షంగా పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిని మార్చడంపై కొన్నాళ్లుగా గూడు కట్టుకుని ఉన్న అసంతప్తి అసమ్మతి రూపంలో బయటపడుతోంది. దాని పర్యవసానంగానే పొందూరు మండల వైకాపా అధ్యక్షుడు పప్పల రమేష్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ మేరకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి లేఖ పంపించినట్టు వెల్లడించారు. పార్టీ అధినేత ఆనాలోచిత నిర్ణయాల వల్ల ఆమదాలవలసలో వైకాపాకు తీరని నష్టం జరిగిందని ఆరోపించారు. నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌ను సŸంప్రదించకుండా, వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా నియోజకవర్గ సమన్వయకర్తను నియమించడంపై అసంతప్తి వ్యక్తం చేశారు. ఈ మార్పు వల్ల నియోజకవర్గంలో పార్టీ నిస్తేజంగా మారిందన్నారు. పార్టీలో పరిస్థితి మారుతుందని ఇన్నాళ్లూ ఎదురుచూసినా ఆ దిశగా అధిష్టానం చొరవ తీసుకోలేదని అవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంతోనే పార్టీని వీడినట్లు ప్రకటించారు. త్వరలోనే మరికొందరు కూడా పార్టీని వీడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పార్టీని వీడాలన్నది తన వ్యక్తిగత నిర్ణయమని, ఇంకే పార్టీలోనూ చేరాలనుకోవడంలేదని స్పష్టం చేశారు. కాగా రమేష్ రాజీనామా ప్రకటన నియోజకవర్గ వైకాపాలో తీవ్ర చర్చకు తావిచ్చింది. అమదాలవలస వైకాపా సమన్వయకర్తగా చింతాడ రవికుమార్‌ను నియమించడాన్ని రమేష్ బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. పార్టీ పిలుపు మేరకు చేయాల్సిన కార్యక్రమాలను చింతాడ రవికి పోటీగా తానే నిర్వహిస్తూ వచ్చారు. చివరికి పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. మాజీ స్పీకర్, వైకాపా శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాంకు అత్యంత ఆప్తుడిగా, ప్రధాన అనుచురుడిగా మెలిగిన రమేష్ నిర్ణయంపై తమ్మినేని వర్గంలోనూ విస్మయం వ్యక్తమవుతోంది.
కాళింగుల్లో గుర్తింపు
వైకాపా ఆవిర్భావ సమయంలోనే తమ్మినేనితోపాటు పార్టీలో చేరిన ఆయన ఆమదాలవలస నియోజకవర్గ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. గత నెల 28న కళింగులందరినీ ఏకం చేయాలని ఆలోచనతో నిర్వహించిన కళింగ సమ్మేళనాన్ని విజయవంతం చేయడంలోనూ పప్పల రమేష్ ప్రధాన పాత్ర పోషించారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగాకళింగ సామాజికవర్గీయులకు రంగవల్లికల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇవ్వడం వంటి వి రమేష్‌కు ఆ వర్గంలో మంచి గుర్తింపునిచ్చాయి. పార్టీకి రాజీనామా చేసినా తమ్మినేనితో తన అనుబంధం కొనసాగుతుందని ప్రకటించారు. వైకాపా బహిషత నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తోనూ రమేష్‌కు సత్సాంబంధాలు ఉన్నాయి. దీంతో దువ్వాడను రమేష్ ఫాలో అవుతున్నారన్న చర్చ జరుగుతోంది. పప్పల రాజీనామా నిర్ణయం వెనుక తమ్మినేని, దువ్వాడ ప్రభావం ఉండవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.










Comments