top of page

మందుబాబులకు మద్దెల దరువు!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 2 hours ago
  • 2 min read

  • బాటిల్‌పై రూ.10 చొప్పున పెంచిన ప్రభుత్వం

  • దానికి పోటీగా మరో పది పెంచిన షాపులవారు

  • ఇదేమిటని అడిగే వారిపై గ్రామీణ ప్రాంతాల్లో దౌర్జన్యాలు

  • చేతులు కట్టుకుని చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు

(సత్యంన్యూస్, కొత్తూరు/శ్రీకాకుళం)

నువ్వు ఒకటేస్తే.. నేను రెండేస్తా.. అన్నట్లుంది మద్యం ధరల తీరు. మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తుంటే.. అదే మద్యం వ్యాపారంతో అధిక లాభాలు దండుకుంటూ వ్యాపారులు ప్రభుత్వంతో పోటీపడుతున్నారు. సాధారణంగా మద్యం అమ్మకాలు, ఆదాయం పెంచుకోవాలంటే ప్రభుత్వం నేరుగా మద్యం ధరలు పెంచుతుంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ప్రభుత్వం తెలివిగా సీసాల్లో ఉన్న మద్యం ధర పెంచకుండా సీసాకు రూ.10 చొప్పున పెంచుకుంటూ పోతోంది. ఆ విధంగా ఏడాది కాలంలో రెండుసార్లు బాటిల్‌పై రూ.10 చొప్పున పెంచారు. మరోవైపు ఇదే అవకాశంగా మద్యం షాపుల నిర్వాహకులు కూడా రూ.10 పెంచి విక్రయిస్తున్నారు. అటు ప్రభుత్వం, ఇటు షాపుల బాదుడుతో వినియోగదారులకు మద్దెల దరువు తప్పడంలేదు. బాటిల్‌కు రూ.20 అదనపు భారం పడుతోంది.

కమీషన్ ఇవ్వనందుకేనట!

ప్రభుత్వం మద్యం రేట్లు పెంచకుండానే బాటిల్‌పై రూ.10 పెంచి వ్యాపారులు విక్రయించడం ప్రారంభించారు. సంక్రాంతికి ముందు మద్యం బాటిల్‌పై రూ.10 పెంచిన తర్వాత కూడా అదనంగా వసూలు చేయడం ఆగలేదు. జిల్లా వ్యాప్తంగా ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత మద్యం బాటిల్‌పై నిర్ధిష్ట చిల్లర ధరపై కూటమి ప్రభుత్వం రూ.20 పెంచగా, వ్యాపారులు అనధికారికంగా రూ.10 వసూలు చేస్తున్నారు. బాటిల్‌పై ప్రభుత్వం రూ.10 పెంచిన ప్రతిసారీ వ్యాపారులకు ఒక శాతం కమీషన్ ఇస్తున్నట్టు ప్రకటిస్తుంది. అంటే వందకి ఒక రూపాయి కమీషన్‌గా అందుకుంటున్నారు. నూతన మద్యం పాలసీలో ప్రభుత్వం 20 శాతం కమీషన్ ఇస్తామని ప్రకటించి 12 శాతానికి మాత్రమే పరిమితం చేసింది. దీనివల్ల తాము ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్స్ ఫీ˜Óజు కూడా గిట్టుబాటు కాదని భావించి సిండికేట్‌గా మారిన మద్యం వ్యాపారులు అనధికారికంగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. రూ.99 బాటిల్ ధరను ప్రభుత్వం పెంచకపోయినా ఎమ్మార్పీ ధరపై వ్యాపారులు రూ.11 వసూలు చేస్తున్నారు. అనధికారికంగా ధరలు పెంచేస్తున్నారని మందుబాబులు ఫిర్యాదు చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు స్పందించడం లేదు. వ్యాపారులు అక్రమాలకు, అదనపు వసూళ్లకు పాల్పడితే జరిమానాలు వసూలు చేయడంతోపాటు లైసెన్సులు రద్దు చేస్తామని నూతన మద్యం పాలసీలో ప్రభుత్వం హెచ్చరించింది. ఆ హెచ్చరికలను అధికారులు బట్టదాఖలు చేస్తున్నారు. ఇటీవల రెవెన్యూ, లీగల్ మెట్రాలజీ అధికారులతో కలిసి పాన్‌షాపుల్లో సోదాలు చేసి సిగరెట్లు అధిక ధరకు విక్రయిస్తున్నట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు. రూ.300 ఎమ్మార్పీ కలిగిన సిగరెట్ ప్యాకెట్‌ను రూ.350కు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. దీనిపై ఎవరూ ఫిర్యాదు ఇవ్వలేదు. కేంద్రం సిగరెట్లపై జీఎస్టీని 40 శాతానికి పెంచి ఫిబ్రవరి నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. దాంతో ఎవరూ ఫిర్యాదు చేయకుండానే పాన్‌షాపుల్లో ధరలపై దష్టిపెట్టి అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కేసులు పెట్టారు. అదే మాదిరిగా ధరలు పెంచి అమ్ముతున్న మద్యం షాపులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా

జిల్లావ్యాప్తంగా అన్ని మద్యం షాపుల్లోనూ అధిక ధరలు వసూలు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న వారి నుంచి కూడా ఎక్కువ ధర వసూలుకు వ్యాపారులు వెనుకాడటం లేదు. జిల్లాలోని 176 మద్యం షాపులు ఉండగా.. నియోజకవర్గాల వారీగా సిండికేట్‌గా ఏర్పడి వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు పూర్తిస్థాయిలో క£మీషన్ ఇవ్వడంలేదని, అందువల్ల అదనపు వసూళ్లు తప్పడం లేదని వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్నారు. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులకు నెలవారీ మామూళ్లు చెల్లించాల్సి వస్తున్నందున కూడా ఇది తప్పడం లేదంటున్నారు. యథేచ్ఛగా ఎమ్మార్పీ ఉల్లంఘన జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ చోద్యం చూస్తున్నారని విమర్శలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అదనపు వసూళ్ల దందా మరింత విచ్చలవిడిగా సాగుతోంది. కొత్తూరు మండల కేంద్రంలో జరుగుతున్న అదనపు వసూళ్లపై ప్రశ్నించిన మందుబాబులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అక్కడి ఒక మద్యం షాపు నుంచి బెల్ట్ దుకాణాలకు అక్రమంగా మద్యం సరఫరా చేస్తూ స్పెషల్ స్క్వాడ్‌కు చిక్కారు. కానీ నామమాత్రపు జరిమానా విధించి వదిలేశారు. రోజురోజుకు మద్యం వ్యాపారుల ఆగడాలు పెరిగినా ఎక్సైజ్ అధికారులు మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటి వెనుక అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page