సంబరాల వెనుక శుభ సంకల్పం ఉందిగా!
- Prasad Satyam
- 2 days ago
- 3 min read
రథసప్తమి పేరుతో నేల విడిచి సాము చేస్తున్నారన్న చర్చ
అందుకు తగినట్లే నిధులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
ఎమ్మెల్యే శంకర్ చొరవతో రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటన
ఉత్సవాల పేరుతోనైనా అభివద్ధి పనులు చేపట్టాలన్నది ఆయన ఆకాంక్ష

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అరసవల్లి రథసప్తమి వేడుకలను గత ఏడాది మూడు రోజులు నిర్వహించి ఏం సాధించారు? ఈసారి ఏడు రోజులకు పెంచి ఏం బావుకుంటారు? ఇస్మామని ప్రకటించిన ప్రభుత్వం నుంచి ఇంతవరకు పైసా నిధులు రాకుండా స్థానికంగా ఉన్నవారిపై ఒత్తిడి తెచ్చి మరీ ఈ ఆర్భాటాలు అవసరమా? అనేది ఇప్ప్పుడు నగరంలో నడుస్తున్న చర్చ. పక్క జిల్లా అనకాపల్లిలో గౌరీపరమేశ్వరుల ఉత్సవమంటూ ఒకే ఏరియాలో రెండు చోట్ల వారం రోజులు చొప్ప్పున రెండుసార్లు నిర్వహిస్తే మనం ఎగబడి వెళ్తాం. సంక్రాంతి సమయంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభల తీర్థం జరిగితే మనకు సంబంధం లేకపోయినా సంబరపడిపోతాం. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మాత్రం పండగ వాతావరణాన్ని జీర్ణించుకోలేం. ఎందుకంటే.. ఇక్కడ క్రెడిట్ కొందరికి పోతుందనే అక్కసు తప్ప ప్రజా ప్రయోజనాల గురించి మాట్లాడినవారు కనపడరు. నిజమే.. ఏడు రోజుల పాటు పండుగ నిర్వహిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు. నిఖార్సుగా చెప్ప్పుకోవాలంటే ఖజానాలో రూపాయి కూడా లేదంటూ స్వయంగా ఉప ముఖ్యమంత్రి నేతత్వం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీనే కోర్టుకు ఓ నోట్ సమర్పించారు. జెడ్పీటీసీల జీతాలు ఇవ్వలేదని కోర్టుకు వెళితే.. తమ ఖజానాలో రూపాయి లేదని రిప్లై ఇచ్చారు.
దాతలపైనే భారం
అటువంటి గడ్డు పరిస్థితుల్లో ఏడు రోజుల వేడుకకు రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుందంటే నమ్మలేం. కానీ ఇక్కడే ఒక కొత్త మెలిక ఉంది. గతసారి కిందామీదా పడి మూడు రోజులు వేడుక నిర్వహించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు ఆలస్యంగా విడుదల చేసింది. ఈసారి మాత్రం రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా అవి ఎప్పుడు విడుదల అవుతాయో తెలియదు. కానీ అప్పటికే దాతలు, స్పాన్సరర్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నెట్టుకొచ్చిన ఎమ్మెల్యే గొండు శంకర్ ఆ రూ.3 కోట్లతో నగరంలో ఇప్పటి వరకు రోడ్డు పడని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు వేశారు. రథసప్తమి రాష్ట్ర పండుగ అంటే ప్రభుత్వం నిధులిస్తుందని, దాంతో నాలుగు అభివద్ధి పనులు చేపట్టవచ్చనేది ఎమ్మెల్యే శంకర్ ఆలోచన. ఇప్ప్పుడు ఏడురోజుల వేడుకకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లు మంజూరు చేయాలంటూ కొద్ది నెలల క్రితం అమరావతిలో సంబంధిత మంత్రులందర్నీ కలిసి వేడుకున్నారు. అయితే సోమవారం వేడుకలు ప్రారంభమైనా ప్రభుత్వం నుంచి రూపాయి రాకపోవడంతో గొండు శంకర్ విజయవాడ బాట పట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్‌లు దావోస్ వెళ్లడం వల్ల అమరావతిలో ఉన్న అచ్చెన్నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలను కలిసి నిధులివ్వండి మహాప్రభో అని అర్థించారు. రూ.13 కోట్లకు అంచనాలు ఉన్నాయని, వాటిని విడుదల చేయాలంటూ సోమవారం రాత్రి అమరావతి పనులు చూసుకొని ఆలస్యంగా వచ్చిన మున్సిపల్ శాఖ మంత్రిని కలిసి మరీ గొండు శంకర్ వేడుకున్నారు. గత ఏడాది రూ.3 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది వారం రోజుల పాటు అనగానే కనీసం రూ.4 కోట్లు అయినా ఇస్తుందన్న నమ్మకంతో ఆయన సోమవారమంతా సెక్రటేరియట్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీలు, మంత్రుల చుట్టూ తిరిగారు. రథసప్తమి పేరుతో ఎన్నో కొన్ని కోట్లు విడుదలైతే కాలువలు లేని ప్రాంతాల్లో వాటిని నిర్మించవచ్చనేది ఎమ్మెల్యే ఆలోచన. కానీ రెండు కోట్లు విడుదల చేస్తామని నారాయణ ప్రకటించారు.
గత ఏడాది నిధులతో పెదపాడు రోడ్డు
గతసారి రథసప్తమికి పెద్దపాడు రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రథసప్తమికి అది అందుబాటులోకి వచ్చింది. సాంస్కతిక కార్యక్రమాలు కాకుండా హెలికాఫ్టర్ రైడింగ్ ఒక్కటే గతసారి రథసప్తమిలో మెరుపు. కానీ అంతకు మించి ఈసారి ఈ సంబరాన్ని అంబరానికి తాకిస్తున్నారు. హెలికాప్టర్ రైడింగ్‌తో పాటు హాట్ ఎయిర్ బెలూన్ మంగళవారం నగరంలో ఎగిరింది. ఇప్పటి వరకు మంగ్లీ, రామ్ మిర్యాల వంటి సింగర్లు మాత్రమే జిల్లాలో ఈవెంట్స్ చేûశారు. కానీ ఈ రథసప్తమికి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎసఎస్ థమన్ షో హైలెట్ కానుంది. దీనికి తోడు రోజూ సాంస్కతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్దపండగ అయిన వెంటనే వచ్చిన రథసప్తమి గతసారి కంటే ఈసారి పెద్ద ఎత్తున జరుగుతోంది.
అధికారులు లేకపోయినా.. అన్నీ తానే!
శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్‌గా దుర్గాప్రసాద్ రిలీవ్ అయిన తర్వాత కొత్త కమిషనర్‌ను ఇప్పటి వరకు మున్సిపల్ శాఖ నియమించలేదు. అలాగే కార్పొరేషన్ కార్యాలయంలో గత కొన్నేళ్లుగా డీఈ, ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకవైపు నగరంలో రథసప్తమి వేడుకలు జరుగుతుంటే కమిషనర్ లేకపోవడం, ఒకేరోజు 38 రోడ్డు పనులను ప్రారంభిస్తే, వాటిని పర్యవేక్షించడానికి డీఈలు, ఏఈలు లేకపోవడం గత కొద్ది రోజులుగా మున్సిపల్ డీఈనే ఎంఈగా, కార్పొరేషన్ కమిషనర్‌గా ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న దుస్థితిలో కార్పొరేషన్ ఉంది. దీన్ని కూడా మున్సిపల్ మంత్రి నారాయణ దష్టికి గొండు శంకర్ తీసుకువెళ్లారు. వాస్తవానికి గతంలో ఇక్కడ డుమా పీడీగా పని చేసి ప్రస్తుతం ఏపీ ఆగ్రోస్‌లో అడ్మినిస్ట్రేషన్ జనరల్ మేనేజర్‌గా మంగళగిరిలో పని చేస్తున్న హనుమంతు కూర్మారావు పేరును కార్పొరేషన్ కమిషనర్ పోస్టుకు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు జిల్లాలో మరికొందరు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయినా ఆయన్ను నియమిస్తూ జీవో జారీలో జాప్యం జరుగుతోంది. దీనిపై దష్టి సారించాలని, రథసప్తమి వేడుకలకు నిధులు కేటాయించాలని కోరుతూ గొండు శంకర్ ఆదివారం, సోమవారాల్లో అమరావతిలో మకాం వేసి ప్రయత్నాలు చేశారు. రూ.13 కోట్లు అడిగిన చోట ప్రభుత్వం ఎంత విదిల్చినా ఏదో ఒక అభివద్ధి పని చేపట్టవచ్చనేది శంకర్ ఆలోచన కాగా, అందుకు అనుగుణంగానే కలెక్టర్, జేసీలు కూడా ప్రతి కార్యక్రమానికి స్పాన్సర్‌షిప్‌లు సమకూర్చారు. ఇష్టంగానో, కష్టంగానో చాలామంది నుంచి ఈ కార్యక్రమాలకు ఖర్చులు వసూలుచేశారు. దీంతో రథసప్తమి వేడుకలు ముగిస్తే ప్రభుత్వం విడుదల చేసే సొమ్ముతో నగరంలో అభివద్ధి కార్యక్రమాలకు మరోసారి శ్రీకారం చుడతారు. ప్రస్తుతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించే పరిస్థితిలో లేదు. ఇలా వేడుకల పేరుతో ఏదో ఒకటి చేసి రోడ్లు, కాలువలు పూర్తి చేయడం వెనుక ఎమ్మెల్యే సంకల్పాన్ని శంకించాల్సిన అవసరం లేదోమో!










Comments