అనంత్ ఆలోచనల దొంతర.. వంతారా!
- DV RAMANA

- Aug 28, 2025
- 3 min read
మూడువేల ఎకరాల విస్తీర్ణంలో ప్రైవేట్ అడవి సృష్టి
200 ఏనుగులు సహా రెండువేల వన్యప్రాణులకు ఆవాసం
వాటి సంరక్షణకు వందలాది నిపుణులు, ఉద్యోగులు
త్వరలో దేశంలో ప్రైవేట్ జూల ఏర్పాట్లు కేంద్రంతో చర్చలు
జంతు సంరక్షణ చట్టాల ఉల్లంఘిస్తున్నట్లు పిల్
విచారణకు సిట్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

చట్టాలను ఉల్లంఘించి విదేశాల నుంచి జంతువులను తీసుకొస్తున్నారంటూ ఓ సంస్థకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)లో వాస్తవాలను నిర్థారించేందుకు సుప్రీంకోర్టు ఏకంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన రిలయన్స్ గ్రూప్ కావడం విశేషం. ఆ సంగతి పక్కనపెడితే ఒక పారిశ్రామిక సంస్థ జంతువులను దిగుమతి చేసుకోవడం ఏమిటన్న సందేహాలు కలగవచ్చు. అయితే రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ వారసుల్లో ఒకడైన అనంత్ అంబానీ ఆధ్వర్యంలో గ్రీన్ జూలాజికల్ రెస్క్యూ, పునరావాస కేంద్రమైన వంతారాపై ఈ ఆరోపణలు వచ్చాయి. సాధారణంగా వన్యప్రాణి పునరావాస కేంద్రాలను, రిజర్వ్ ఫారెస్టులను, జూపార్కులను ప్రభుత్వాలే ఏర్పాటు చేస్తుంటాయి. కానీ గుజరాత్‌లోని జామ్‌నగర్ ప్రాంతంలో రిలయన్స్ సంస్థ స్వయంగా వంతారా పేరుతో ప్రధానంగా ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. దీనికోసం ఏకంగా ఒక అడవినే సృష్టించి ఏనుగులకు ఆవాసంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు అదే వంతారాపై పిల్ దాఖలు కావడంతో మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అసలు వంతారా ఏమిటి? ఆ పేరుతో రిలయన్ అంబానీ కుటుంబం ఓ పెద్ద అడవినే ఎలా సృష్టించింది? అక్కడ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నది ఆసక్తిదాయకం.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
జంతువుల పట్ల పిల్లలు చూపే ఆసక్తి, వాటి వైపు ఆకర్షితులు కావడం అందరికీ తెలిసిందే. అందుకే పిల్లలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా అటవీ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వాలు జూపార్క్‌లు నిర్వహిస్తున్నాయి. అలాగే జంతు సంరక్షణ కోసం, వాటి సంతతి పరిరక్షణ కోసం ప్రత్యేకించి కొన్ని అడవులను రిజర్వ్ ఫారెస్టులుగా ప్రకటిస్తుంటాయి. అయితే రాజు తలచుకుంటే దెబ్బలు కొదవా అన్నట్లు పారిశ్రామిక దిగ్గజమైన రిలయన్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆసక్తే వారి సొంత ప్రాంతం అంటే గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్ సమీపంలో సరికొత్త వన్యప్రాణి లోకం ఏర్పాటుకు కారణమైంది. వంతారా పేరుతో ప్రసిద్ధి చెందిన ఆ అభయారణ్యంలో ప్రస్తుతం సుమారు 200 ఏనుగులు సహా రెండువేలకుపైగా జంతువులు మనుగడ సాగిస్తున్నాయి. వాటి సంరక్షణకు, ఆరోగ్య పరిరక్షణకు వందలాది నిపుణులు, వైద్యులు, ఇతర సిబ్బంది పని చేస్తున్నారు.
ఆ గున్న ఏనుగే ప్రేరణ
దీనికి ఆద్యుడైన అనంత్ అంబానీ తన పన్నెండేళ్ల వయసులో తల్లి నీతా అంబానీతో కలిసి ఏదో ఊరికి ప్రయాణమయ్యాడు. కారులో కూర్చొని రోడ్డుకిరువైపులా వెనక్కి పరుగులు తీస్తున్నట్లున్న ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. అదే సమయంలో ఓ గున్న(పిల్ల) ఏనుగు అతని దృష్టిపథంలోకి వచ్చింది. అయితే అది చాలా ఇబ్బందిగా నడుస్తుండగా.. మావటివాడు దాన్ని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం ఆ పిల్లాడి మనసును కదిలించింది. తల్లి వద్ద అదే బాధ వ్యక్తం చేస్తూ.. ఆ గున్న ఏనుగును పెంచుకుందామా.. అమ్మా’ అని తల్లిని అడిగాడు. అందుకు నీతా అంబానీ సమ్మతించడంతో సదరు గున్న ఏనుగు అనంత్ చెంతకు చేరింది. అయితే అది ఏం తింటుందో.. దాన్ని సాకడం ఎలాగో’ అనంత్ సహా అతని కుటుంబానికి అసలు తెలియదు. దాంతో మావటి వాడు ఏం చెబితే అదే చేసేవారు. ఆరోగ్య సమస్యలు ఎదురైతే చికిత్స చేయించడానికి నిపుణులు కూడా పెద్దగా అందుబాటులో లేరు. వాటన్నింటినీ క్రమంగా సమకూర్చడమే కాదు. గున్న ఏనుగులాగే ఆపదలో ఉన్న వందలాది వన్యప్రాణులను అక్కున చేర్చుకుని వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించారు. ఆ క్రమంలో ఎన్నో జంతువులు గాయాల పాలై, ప్రాణాపాయ స్థితిలో ఇక్కడికి వచ్చి కోలుకుని ఆనందంగా జీవిస్తున్నాయి. వాటికోసం వందల సంఖ్యలో నిపుణులను నియమించారు. జంతు వ్యాధులపై పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. విభిన్న జాతుల జంతువులు ఈ అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తాయి. దానికి తగినట్లే వంతారా అంటే స్టార్ ఆఫ్ ద ఫారెస్ట్ లేదా అడవి చుక్క అని అర్థం!
మూడు వేల ఎకరాల్లో
వన్యప్రాణుల స్వేచ్ఛా విహార స్థలం వంతారా మొత్తం విస్తీర్ణం మూడువేల ఎకరాలు. ఇదంతా అంబానీ కుటుంబ భూమే. ఇందులో 43 జాతులకు చెందిన సుమారు రెండువేల జంతువులు ఉన్నాయి. 200 ఏనుగులతోపాటు మంచు చిరుతలు, తెల్ల పులులు, సింహాలకు వంతారా ఆవాసం. అనేక రకాల పాములు, మొసళ్లు, జిరాఫీలు, జీబ్రాలు, హిప్పోలను భారత్ సహా ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలించి సంరక్షిస్తున్నారు. అలాగే అంతరిస్తున్న జాతుల జాబితాలో ఉన్న దేవాంగ పిల్లి, బట్టమేక పక్షి, రాబందు, ఒకాపి, కారకల్.. లాంటి జంతు, పక్షిజాతులెన్నో ఇక్కడ తమ ఉనికిని , జాతిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అడవుల నరికివేత వల్ల స్థావరాలను కోల్పోవడం.. వేట, స్మగ్లింగ్.. లాంటి వన్యప్రాణి వ్యతిరేక కార్యకలాపాలకు దెబ్బతిన్న జంతువులే ఇవన్నీ. ఇక ఆరోగ్య సమస్యలతో వచ్చే వాటిని ఇక్కడి నిపుణులైన వైద్యులు పరిశీలిస్తారు. ప్రపంచంలోనే అగ్రశ్రేణి వైద్యులు, జంతు సంరక్షణ నిపుణులతో పాటు న్యూట్రిషనిస్టులు, పాథాలజిస్టులు సహా 500 మంది నిపుణులు వీటి సేవలో నిమగ్నమై ఉంటారు. క్రూర జంతువులా, సాధు జంతువులా, సరీసృపాలా అన్నదాన్ని బట్టి అన్ని జంతువులకూ స్వేచ్ఛగా సంచరించేందుకు సరిపడా స్థలాన్ని కేటాయిస్తారు. వీటి బాగోగులు జాగ్రత్తగా చూసుకునేందుకు 2100 మంది వరకు ఉద్యోగులు పని చేస్తున్నారు. 75 యానిమల్ అంబులెన్సులు కూడా ఉన్నాయి.
ఏనుగులే ప్రధాన ఆకర్షణ
ఎన్ని రకాల జంతువులు ఉన్నా వంతారాలో ప్రధాన ఆకర్షణ ఏనుగులే. ఇక్కడ ఉన్న 200కు పైగా గజరాజుల ఆరోగ్య పరిరక్షణకు 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆస్పత్రి కట్టారు. భారీ సైజులో ఉండే ఏనుగులకు ఆర్థరైటిస్ లాంటి ఎముకల సమస్యలు ఏర్పడుతుంటాయి. దానికి హైడ్రోథెరపీ చేస్తారు. కాళ్ల సమస్యలు, కీళ్ల నొప్పులతో ఇబ్బందిపడుతున్న ఏనుగులు ఇక్కడి హైడ్రోథెరపీ పూల్స్‌లో కొన్ని గంటల పాటు సేదతీరి, సాంత్వన పొందుతుంటాయి. ఇవికాక ముల్తానీ మట్టి మసాజ్, జకుజీ (బాత్ టబ్ థెరపీ)లాంటి వైద్య ప్రక్రియలను వీటి కోసం ఏర్పాటు చేశారు. ఆరోగ్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు, ఇతర చికిత్సల కోసం ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్లగలిగే పోర్టబుల్ ఎక్స్‌రే యూనిట్లు, లేజర్ మిషన్లు, సీటీ, ఎంఆర్‌ఐ స్కానింగ్ యంత్రాలు, ఐసీయూ, డయాలిసిస్ కేంద్రం, పాథాలజీ ల్యాబ్, ఆపరేషన్ థియేటర్లు, హైపర్ బారిక్ ఆక్సిజన్ ఛాంబర్లు ఉన్నాయి. అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ లాంటి పరీక్షలు చేసే పరికరాలూ ఇక్కడ ఉన్నాయి. జంతువుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా వాటి గురించి పరిశోధనలు జరిపే ప్రత్యేక విభాగమూ వంతారాలో ఉంది. ఆపదలో ఉన్న జంతువుల సంరక్షణకు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్), వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్(డబ్ల్యూడబ్ల్యూఎఫ్)లతో కలిసి వంతారా పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ జూ అథారిటీతో టై అప్ అయ్యింది వంతారా. దేశవ్యాప్తంగా జూలు ఏర్పాటు చేసేందుకు జరుపుతోంది. అటువంటి వంతారాపై జంతు సంరక్షణ చట్టాలను ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలు, ఫిర్యాదులు రావడం విస్మయం కలిగిస్తోంది. ఆ మేరకు దాఖలైన పిల్‌ను విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్ కూడా ఈ ఆరోపణలు నిరాధారమైనవని అంటూనే.. ఇలాగైనా వంతారా వాస్తవాలు లోకానికి తెలుస్తాయన్న ఉద్దేశంతో సిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొనడం విశేషం.










Comments