top of page

అప్పుడు లేచిన నోళ్లు ఇప్పుడు మూగబోయాయేం?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Dec 29, 2025
  • 2 min read

హింస ఎక్కడైనా హింసే.. మరణం అందరికీ ఒక్కటే.. దానికి కులమతవర్ణాలన్న తేడా ఉండదు. కారణం ఏదైనా మారణకాండ మాత్రం క్షంతవ్యం కాదు. అది ఎవరి మీద, ఏ కారణంతో జరిగినా దాన్ని ఖండిరచాల్సిందే, బాధితులకు అండగా నిలవాల్సిందే, సంఫీుభావం తెలపాల్సిందే. ఇటువంటి విషయాల్లో సెలబ్రిటీలు అనే ముసుగు తొడుక్కునేవారు చాలా వేగంగా స్పందిస్తుంటారు. పత్రికలు, టీవీ, సోషల్‌ మీడియా తదితర వేదికల ద్వారా నిరసన గళం వినిపిస్తుంటారు. రాజకీయ నాయకులు కూడా ఈ కోవలోకే వస్తారు. కానీ దురదృష్టకరం ఏమిటింటే.. బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై జరుగుతున్న దాడులు, మారణకాండను మాత్రం సో కాల్డ్‌ సెలబ్రిటీలు, నాయకులు సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారే తప్ప కనీసమాత్రంగా కూడా స్పందించడం లేదు. పాలస్తీనాలోని గాజాలో జరుగుతున్న మారణకాండ మృతులకు సంతాప సూచకంగా ర్యాలీలు, కొవ్వత్తుల ప్రదర్శనలు జరపడం, ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్‌లు నడపడటం వంటివి చేసేవారు.. బంగ్లాదేశ్‌లో హిందువులను చంపేస్తుంటే మాత్రం మౌనం వహిస్తున్నారు. దీన్నే ప్రస్తావిస్తూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాల్లో నిప్పులు చెరిగారు. ‘బంగ్లాదేశ్‌లో ఒక దళిత యువకుడిని కాల్చి చంపారు. మరో వ్యక్తిని హతమార్చారు. అయినా మీరు గాజా విషయంలో మాత్రమే కన్నీరు కారుస్తారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారు’ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఎన్నికల కారణాల వల్ల ఈ విషయంపై ప్రతిపక్షాలు మౌనం వహించాయని ఆరోపించారు. బంగ్లాదేశ్‌ ఏర్పడటానికి కారణం మీ బుజ్జగింపు విధానమేనని మండిపడ్డారు. బంగ్లాదేశ్‌ పాకిస్తాన్‌లో భాగం కాకుంటే హిందువులు ఈ విధంగా దహనం చేయబడేవారు కాదని అన్నారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో హిందువులను చంపినప్పుడు నోరువిప్పని ప్రతిపక్షాలు అదే గాజా మరణాలపై మాత్రం స్పందించి రాద్దాంతం చేస్తారని ఎండగట్టారు. బంగ్లాదేశ్‌లో మరణించిన వ్యక్తి హిందువు కాబట్టి మీరు మాట్లాడరని విమర్శించారు. యోగి విమర్శలు రాజకీయ కోణంలో ఉన్నట్లు కనిపించవచ్చుగానీ.. ఆయన ఆవేదనలో వాస్తవం ఉంది. గత ఏడాదికిపైగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు, ఆస్తుల విధ్వంసాలు జరుగుతున్నాయి. అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడంలేదు. ఫలితంగా హింస ప్రకోపించి పరాకాష్టకు చేరింది. మూకహత్యలకు, సజీవ దహనాలకు దారితీస్తోంది. ఆ దేశ పౌరుడైన దీపూ చంద్రదాస్‌ను వేరే వర్గానికి చెందిన అల్లరిమూక తలకిందులుగా వేలాడ దీసి, సజీవంగా నిప్పు పెట్టారు. అమాయకుడు మంటల్లో కాలిపోతుంటే రాక్షసుల్లా చుట్టూ చేరి నృత్యాలు చేశారు. దీనికంటే దారుణమేంటంటే.. మొదట దీపు దాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులే అతన్ని మతమౌఢ్య మూకకు అప్పగించారు. తద్వారా ఆ హత్యకు వారే కారణమాయ్యరు. కొద్దిరోజుల వ్యవధిలోనే అమృత్‌మండల్‌ అనే మరో హిందూ వ్యక్తిని అల్లరి మూకలు హతం చేశాయి. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు ఎవరికైనా ఇలాంటి ప్రపంచంలో బతుకుతున్నామా అనిపిస్తుంది. అది బంగ్లాదేశ్‌ గొడవే అయినప్పటికీ మన దేశానికీ బాధ కలిగించే అంశాలు అందులో ఉన్నాయి. దేశ విభజన సమయంలో వారు ఇండియాను ఎంచుకోకుండా అక్కడే ఉండిపోవడం వల్ల బంగ్లాదేశీయులు అయ్యారు.. అంతే తప్ప మన సోదర భారతీయులు అయ్యేవారు. హిందువులుగా ఉండటం, ఆ మతస్తులు బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉండటమే వారి పాలిట శిక్షగా మారింది. చేయని పాపానికి వారు శిక్ష అనుభవిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమానికి వెరచి పారిపోయి వచ్చిన మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఆశ్రయం ఇచ్చిన భారత ప్రభుత్వంపై కసి, కక్ష అమాయకులను బలి తీసుకునేలా చేస్తున్నాయి. బంగ్లాదేశ్‌ను సొంత దేశంగా భావించి ఆ సమాజంలోనే తమ భవిష్యత్తును చూసుకున్న అక్కడి హిందువులు ఇప్పుడు ఆస్తులు కోల్పోయి, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్న క్షణమొక యుగంగా గడపాల్సిన దీనస్థితిలో చిక్కుకున్నారు. పౌరులందరి రక్షణకు బాధ్యత వహించాల్సిన మహ్మద్‌ యూనస్‌ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆ పని చేయకపోగా.. తిరిగి అల్లరిమూకలకే దన్నుగా నిలుస్తోంది. ఇంక్విలాబ్‌ మంచో ప్రతినిధి ఉస్మాన్‌ హదీ మృతి తర్వాత జరిగిన అల్లర్లలో మైనారిటీల ఆస్తులు, మతపరమైన స్థలాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇన్ని దారుణాలు జరుగుతున్నా అంతర్జాతీయ మీడియా, ప్రముఖులు మౌనంగా ఉండటం విస్మయం కలిగిస్తోంది. రఫా ఉదంతంపై గొంతెత్తినవారు మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మారణహోమంపై మాత్రం మాట్లాడలేకపోతున్నారు. కొన్ని నెలల క్రితం గాజాలోని రఫాలో ఇజ్రాయెల్‌ దాడులు జరిగినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు ‘ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా’ అనే నినాదాన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. హాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ప్రతి ఒక్కరూ తమ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీల్లో దాన్ని పంచుకున్నారు. కానీ బంగ్లాదేశ్‌లో హిందువులను వీధుల్లో కొట్టి చంపుతున్నా, ఆస్తులు తగలబెడుతున్నా, దేవాలయాలను ధ్వంసం చేస్తున్నా.. ఈ సెలబ్రిటీలెవరూ పెదవి విప్పడం లేదు. హిందువులకు మద్దతుగా మాట్లాడితే దేశంలోని ముస్లింలకు కోపం వస్తుందని సెలబ్రిటీలు భయపడుతున్నారని, అందువల్ల హిందువుల ఆర్తనాదాలను విననట్లే వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ముస్లిం వర్గానికి ప్రతినిధి అయిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ నేరుగా బంగ్లాలో హిందువులపై జరుగుతున్న మారణకాండను తీవ్రంగా ఖండిరచారు. బంగ్లాలో ఉన్న రెండు కోట్ల ముస్లిమేతర మైనారిటీలను రక్షించాలని, భారత్‌`బంగ్లా సంబంధాలు క్షిణించకూడదని ఆకాంక్షించారు. ఆయన చూపిన పాటి విజ్ఞత, మానవీయతను మన బడా నాయకులు, సెలబ్రిటీలు చూపలేకపోతున్నారు. రఫా దాడులపై స్పందించడం తప్పు కాదు.. అందులో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ అదే రకమైన హింసకు బలవుతున్న మన దాయాది హిందువుల విషయంలోనూ గొంతెత్తి ప్రపంచం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page