‘అప్పన్న’ంగా ఇచ్చేయాలట!
- ADMIN

- Aug 29, 2025
- 2 min read
సీఐ, ప్రజాప్రతినిధులపై బూతుల వర్షం
నాగళ్ల దారిలోనే శిష్యబృందం
పోలీసుల బదిలీకి విశ్వప్రయత్నాలు

(సత్యంన్యూస్, కొత్తూరు)
తల్లీ, చెల్లీ, భార్యలను కలపకుండా ఒక్క బూతు తిట్టగలవేమో చూడు.. అంటాడు రవితేజ నేనింతే సినిమాలో విలన్‌నుద్దేశించి. అలాంటి పదాలు దొరక్క విలన్ వెనుదిరిగిపోతాడు. కానీ ఆడవాళ్లను కలిపి గాని, కలపకుండా గానీ ఎన్ని బూతులున్నాయో తెలుసుకోవాలంటే కొత్తూరు మండలం ఆకులతంపర సర్పంచ్ నాగళ్ల అప్పన్న దగ్గరకు వెళ్లాలి. అలాగే దౌర్జన్యం చేయడానికి కూడా అధికారం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలంటే ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన వద్ద పాఠాలు నేర్చుకోవాలి. ఇటీవల ఈ సర్పంచ్ కొత్తూరు పోలీసుల మీద, మైన్స్ శాఖ ఉద్యోగుల మీద, ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేల మీద మాట్లాడిన బూతుల ఆడియో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చకు తెర లేపింది. అసలు ఇంతమందిని అమ్మనా బూతులు తిట్టడానికి కారణమేంటయ్యా? అంటే.. ఆకులతంపర ఇసుక ర్యాంపు నుంచి తనకు సమయానికి సొమ్ములు రావడంలేదనేదే ఆయన దుగ్ధ. తాను తలచుకుంటే జనాల్ని రెచ్చగొట్టి ర్యాంపు నడవకుండా ఆపేయగలనని బహిరంగంగానే సెలవిచ్చారు. గతంలో అటువంటి పని చేశానని, 300 లారీలను రోడ్డు మీద ఆపేశానని, ఈ విషయం పత్రికల్లో కూడా వచ్చిందని, అవసరమైతే ఆ కటింగులు చూపిస్తానంటూ ఆయన ఆడియోలో స్పష్టంగా చెబుతున్నారు. మంత్రి అచ్చెన్నాయుడుకే పోయించానని, అటువంటిది మిగిలిన సీఐ, ఎమ్మెల్యేలు తనకు ఓ లెక్క కాదంటూ ఆయన రెచ్చిపోయారు. కేవలం ఇంతకు ముందు ర్యాంపు నిర్వాహకులు ఇచ్చిన సొమ్ము తిన్నామన్న కారణంతోనే ఆలోచిస్తున్నానని, లేదంటే ప్రజల్ని రెచ్చగొడతానంటూ ఆయన వంద బూతుల మధ్య ఒక మెరుపుతీగ లాంటి మాటొదిలారు. తాను గ్రామానికి ప్రథమ పౌరుడినని, తనకు సమర్పించుకున్న తర్వాతే ఎవరికైనా ముడుపులివ్వాలనేది ఆయన భావన. ఆవు చేనులో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? అన్నట్టు సర్పంచ్ నాగళ్ల అప్పన్న ఇక్కడ ఇసుక ర్యాంపుల నుంచి సొమ్ములు రావాలని జిల్లాలో సీనియర్లందర్నీ పోలీసులను బూతులు తిడుతుంటే, ఆయన శిష్యబృందం అక్కడున్న క్వారీలు నడవాలంటే తమకు మామూళ్లు ఇవ్వాలని ఆమధ్య గొడవ పడ్డారు. ఆకులతంపల ర్యాంపునకు వెళ్లే లారీలను అప్పన్న అడ్డుకుంటున్నారని ఫిర్యాదు రావడంతో కొత్తూరు సీఐ ఆయన్ను ప్రశ్నించినందుకే ఆయన నానా బూతులూ తిట్టారు. అలాగే కొత్తూరు పరిధిలో తమకు సొమ్ములివ్వకుండా క్వారీ నడుపుతున్నారంటూ అక్కడి సిబ్బందిని గాయపర్చిన అప్పన్న శిష్యులను కొత్తూరు ఎస్‌ఐ స్టేషన్‌కు పిలిచారని ఆయన తల్లి, భార్య, బిడ్డలను వదలకుండా బూతులు తిట్టారు. ఈ ఆడియో కూడా కొద్ది రోజుల క్రితం పోలీసు వర్గాల్లో హల్‌చల్ చేసింది. తన కుటుంబాన్ని పచ్చిబూతులు తిట్టడంతో అప్పన్న శిష్యుడికి ఎస్‌ఐ రెండు దెబ్బలు వేయడంతో దాన్ని పెద్ద ఇష్యూ చేశారు. ఇప్పుడు అప్పన్నకు, ఆయన శిష్యబృందానికి అక్కడ ఇసుక, మైన్స్ నుంచి సొమ్ములు కావాలి. ఇందుకు అడ్డంగా ఉన్నవారిని రెచ్చగొట్టి కేసులయ్యేటట్టు చూసుకొని ఎస్‌ఐ, సీఐలను అక్కడి నుంచి బదిలీ చేయించాలి.. ఇదీ వారి ప్లాన్. ఇందులో భాగంగానే ఇక్కడ పోలీసులు తమను హింసిస్తున్నారంటూ ఎస్పీకి ఓ ఫిర్యాదు చేశారు. కానీ అదే పోలీసులను అమ్మనా బూతులు తిట్టామని మాత్రం చెప్పరు. లోకల్ కాబట్టి వీరికి మామూళ్లు ఇవ్వాలట. ఉప్పుకారం తింటున్న పోలీసులు మాత్రం తమ కుటుంబంలో ఆడవారిని ఎలా తిట్టినా ఏమీ అనకూడదట. ఇప్పుడు ఎస్‌ఐ, సీఐలను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని అప్పన్న కొద్ది రోజుల క్రితం మంత్రి అచ్చెన్నాయుడును కలిశారు. అప్పటికే తనను తిట్టిన ఆడియో అచ్చెన్న విన్నారు. ఆ తర్వాత మంగళవారం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి ఎస్పీ మీద ఒత్తిడి తీసుకువచ్చే పని చేశారు. ఢల్లీిలో ఉన్న రాముకు ఈ ఆడియో కోసం అప్పటికి తెలియదు. మొత్తానికి ఈ బ్యాచ్ అంతా ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి సంపద తమదేనని, ఎటువంటి అనుమతులున్నా తమకు కప్పం కట్టాల్సిందేనని ఈ ఆడియో ద్వారా నాగన్న బయటపడ్డారు.










Comments