అప్పల..‘రాజ’రికం పనికిరాదు!
- NVS PRASAD

- Jun 30
- 4 min read
పోటీకి ఆయన పనికి రారంటున్న సొంత పార్టీ నేతలు
ఎన్నికలకు నాలుగేళ్ల ముందే అధిష్టానానికి ఫిర్యాదులు
మాజీ మంత్రిపై ఏమాత్రం తగ్గని అసమ్మతి

ఈ సిటీకి వచ్చిన కొత్తలో మీరెలా ఉండేవారు? ఇప్పుడెలా ఉన్నారు.. మీకైనా అర్థమవుతోందా? అంటూ ఇడియట్ సినిమా క్లైమాక్స్ సీనులో పోలీస్ కమిషనర్ పాత్రధారి ప్రకాశ్‌రాజ్‌ను ప్రశ్నిస్తూ అతని పై అధికారి పాత్రధారి సత్యనారాయణ వేసిన డైలాగ్ ఇది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఫ్రెష్‌గా ఒక విద్యావంతుడు రాజకీయాల్లో తీసుకొస్తే గెలుపు సులభమవుతుందని భావించిన వైకాపా డాక్టర్ సీదిరి అప్పలరాజును తీసుకొచ్చి 2019 ఎన్నికల్లో పలాస బరిలో నిలబెట్టింది. రాజకీయాల్లోకి కొత్త వచ్చి తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయనకు కొన్నాళ్లకే మంత్రి పదవి కూడా ఇచ్చింది. రెండున్నరేళ్ల తర్వాత చేపట్టిన సర్దుబాటులో కూడా ఆయన్ను కొనసాగించింది. అటువంటి అప్పలరాజు 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఎందుకిలా మారిపోయారు? రాజకీయాల్లో సుదీర్ఘ కాలం గెలిచిన గుర్రాలే తక్కువైపోతున్న ఈ రోజుల్లో తనతో నడిచి వచ్చినవారిని మధ్యలోనే వదిలేసే ప్రయత్నాలు ఎందుకు చేశారు? వచ్చే ఎన్నికల్లో ఆయన టికెట్ ఇవ్వొద్దని సొంత పార్టీవారే.. ఇదీ ఇప్పటినుంచే ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సాధారణ ఎన్నికలు జరిగి ఏడాదే అయ్యింది. మళ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉంది. అయినా ఇప్పటినుంచే పలాస వైకాపాలో టికెట్ రాజకీయాలు ఊపందుకున్నాయి. అప్పలరాజుకు మరోసారి టికెటిస్తే గెలిచే అవకాశాలు లేవని వైకాపాకు చెందిన కొందరు సీనియర్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్లమెంట్ ఇన్‌ఛార్జి తమ్మినేని సీతారామ్‌లను కలిసి తమ మనోగతాన్ని వెల్లడిరచిన సందర్భంగా రాస్తున్న కథనం కాదిది. నాయకుడున్న తర్వాత సహజంగానే అసంతృప్తి, అసమ్మతి ఉంటాయి. అయితే అది తన నాయకత్వానికి ముప్పు తేచ్చేంతగా పెరగకుండా జాగ్రత్త పడటం రాజకీయాల్లో పైకి రావాల్సినవారి బాధ్యత. సీదిరి అప్పలరాజుపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవడం ఇదే మొదటిసారి కాదు. 2019`24 మధ్యలో మంత్రిగా ఉన్నప్పుడే ఆయన పోకడలు నచ్చక వంద నుంచి వెయ్యి ఓట్ల వరకు ప్రభావితం చేయగల పలువురు స్థానిక నాయకులు ఆయనపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆయనకు వ్యతిరేకంగా వేదకలు మార్చి మార్చి సమావేశాలు కూడా పెట్టారు. 2024 ఎన్నికల్లో అప్పలరాజు గెలుపు కోసం పని చేయలేమని బహిరంగంగానే ప్రకటించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను గుదిగుచ్చి ఏకంగా వెయ్యి పేజీల పుస్తకాన్ని తయారు చేసి మరీ అప్పటి ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి వైవీ సుబ్బారెడ్డికి అందించారు. ఇంత జరిగినా అక్కడ పార్టీ అధినేత జగనూ పట్టించుకోలేదు.. ఇక్కడ అప్పలరాజూ అసమ్మతి నేతలతో మాట్లాడలేదు. దాంతో పార్టీ పెట్టిన నాటినుంచీ ఉన్న అనేకమంది నాయకులు వైకాపాను వీడారు. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో సిటింగ్ మంత్రిగా అప్పలరాజు ఘోర పరాజయం.
ఏకపక్ష పోకడలతోనే అసమ్మతి
ఇక్కడ ఘోర పరాజయం అనే పదం వాడటం కారణం చెప్పాలంటే గత ఎన్నికల్లో ఓటింగ్, మెజార్టీల గురించి ప్రస్తావించాలి. జిల్లాకే చెందిన మరో సిటింగ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు 52 వేల ఓట్ల తేడాతో ఓడిపోయినప్పుడు 42,600 ఓట్ల తేడాతో ఓడిన అప్పలరాజుది ఘోర ఓటమి ఎలా అవుతుందనే ప్రశ్న తలెత్తవచ్చు. వాస్తవానికి శ్రీకాకుళం నియోజకవర్గ ఓటర్ల సంఖ్య 2.75 లక్షలు (2019 ఎన్నికల సమయంలో 2,55,177 మంది ఓటర్లు). అదే పలాస నియోజకవర్గంలో ఓట్లు 2.28 లక్షలు (2019 ఎన్నికల సమయంలో 2,04,109 ఓటర్లు). 80 శాతం పోలింగ్ శాతం చూసుకుంటే 42,600 ఎక్కువ. ఇంత తేడా ఎందుకొచ్చిందనడానికి ప్రధాన కారణం 25వేల పైచిలుకు వైకాపా ఓట్లు టీడీపీకి మరలిపోయాయనేది కాదనలేని సత్యం. ఇంత పెద్దఎత్తున ఓట్లు మళ్లడానికి ప్రధాన కారణం మంత్రిగా అప్పలరాజు ఏకపక్ష పోకడే. 2019లో తొలిసారి ఎన్నికల బరిలో నిల్చున్న అప్పలరాజు 16,500 ఓట్ల మెజార్టీ తెచ్చుకోగలిగారు. వాస్తవానికి పలాస నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలిచినా మెజార్టీ స్టామినా అంతే. ఎందుకంటే.. 2014 ఎన్నికల్లో గౌతు శ్యామసుందర శివాజీ గెలిచినప్పుడు 17,500 ఓట్లు మెజార్టీ వచ్చింది. కానీ 2024 ఎన్నికల్లో మంత్రి హోదాలో పోటీ చేసినా అప్పలరాజు 42,600 ఓట్ల తేడాతో ఓడిపాయారంటే.. అసమ్మతి నేతల ప్రభావం ఎంత? ప్రజల అసంతృప్తి శాతం ఎంత? అనేది ఆయన కనీసం పట్టించుకోలేదని అర్థమవుతుంది.
అణచివేత విధానాలతో అనర్థం

కేవలం ఆ నలుగురి కోటరీలో బందీగా మిగిలిపోయి రెండో ఎన్నికకే సామ్రాట్‌నన్న భావనలోకి వెళ్లిపోయి అంతవరకు తనతో నడిచినవారిని వదిలేశారు. పలాస`కాశీబుగ్గ టౌన్‌లో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషకు 14,875 ఓట్ల మెజార్టీ వచ్చింది. వాస్తవానికి మంత్రిగా టౌన్‌లో ఉన్నది అప్పలరాజే. శిరీష స్థానికేతరురాలని ప్రచారం చేసినా ఫలితం ఇవ్వలేదు. పోనీ అప్పలరాజు సొంత మండలం వజ్రపుకొత్తూరులోనైనా ఆయనకు మెజార్టీ వచ్చిందా అంటే.. అక్కడ కూడా శిరీషకే 14,900 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక మిగిలిన రెండు మండలాల్లో కూడా ఆమె మెజార్టీని అప్పలరాజు తగ్గించలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి సునామీ వచ్చినందున ఓడిపోయినవారందరి పరిస్థితి ఇదేనని అప్పలరాజును ఆ నలుగురూ ఓదార్చి ఉంటారు. కానీ రాష్ట్రంలో వైకాపాకు 12వ సీటుగా గెలవాల్సిన నియోజకవర్గం పలాస. ఎందుకంటే.. పోల్ మేనేజ్‌మెంట్‌కు అవసరమైన మందీమార్బలం, పార్టీ సహకారం, ఆర్థిక పరిపుష్టి అన్నీ ఇక్కడ ఉన్నాయి. జిల్లాలో వైకాపా ఓడిపోయిన మిగిలిన నియోజకవర్గాల మాదిరిగా అంతఃకలహాలు ఇక్కడ లేవు. కేవలం మంత్రి అప్పలరాజుపై ఉన్న అసంతృప్తిని, అసమ్మతివాదులను ఆయన బుజ్జగించుకోగలిగితే కచ్చితంగా గెలిచేవారు. కానీ దానికి విరుద్ధంగా తనకు వ్యతిరేకంగా గళం విప్పిన ప్రతి ఒక్కరిపైనా అణచివేతకు పూనుకోవడం వల్ల డ్యామేజ్ కంట్రోల్ చేయలేకపోయారు. ఆర్థికంగా బలపడితే తన సీటుకు ఎసరొస్తుందన్న భావనతో మెజార్టీ సామాజికవర్గానికి చెందిన పార్టీ నేతలను అప్పలరాజు తొక్కేశారు. రాజకీయాల్లో ఇది సహజం. అయితే దానికీ ఒక హద్దు ఉంటుంది. మొదటిసారి ఎన్నికైనా మంత్రి పదవి వరించినప్పుడే తాను స్థానిక నేతల స్థాయిని దాటేశానన్న విషయాన్ని అప్పలరాజు మర్చిపోయారు. అభద్రతతో కక్ష సాధింపులకు దిగడం వల్ల ఐదేళ్లలో అది చిరిగి చాటంత అయ్యింది. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో భారీ ఓటమి.
తొక్కేసినవారే శిరమెత్తుతున్నారు
అప్పలరాజుపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేసినా, అసంతృప్తి రాగాలు వినిపించినా వైకాపా అధిష్టానం పట్టించుకోలేదంటే.. అధిష్టానం వద్ద తన స్థాయి ఏంటో అర్థమవ్వాలి. కానీ ఆయన జగన్మోహన్‌రెడ్డి అండ్ కో వద్ద తనకున్న పట్టు మర్చిపోయి , స్థాయి మర్చిపోయి స్థానికంగా పట్టింపులకు పోయి అందర్నీ దూరం చేసుకున్నారు. దువ్వాడ శ్రీధర్ (బాబా) లాంటివారు చాలా రోజుల నుంచి అప్పలరాజును వ్యతిరేకిస్తున్నారు. కానీ సిటింగ్ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు కూడా వచ్చే ఎన్నికలకు అప్పలరాజు పనికిరారని కృష్ణదాస్, సీతారామ్‌లకు చెప్పడం గమనార్హం. పలాసలో మేజర్ సామాజికవర్గానికి చెందిన గిరిబాబును తానే చైర్మన్‌ను చేశానని చెప్పుకునే డాక్టర్ అప్పలరాజు.. అక్కడ కూడా సమాంతర నాయకత్వం తయారవుతుందని భావించి గిరిబాబును తొక్కేయడం ప్రారంభించారు. దీంతో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా ఆయన అనేక అవమానాలు పడ్డారని పలాసలో ఓ టాక్ నడుస్తోంది. దాని ఫలితంగానే రాబోయే ఎన్నికల కోసం ఇప్పట్నుంచే అప్పలరాజును వ్యతిరేకించే కార్యక్రమం మొదలైంది. అప్పలరాజు కొలువులో ప్రస్తుతం ఉన్న గుప్పెడుమంది భట్రాజుల్లా పనికొస్తారేమో గానీ గెలిపించే స్థాయి ఉన్నవారు మాత్రం కాదు. గత ఎన్నికల సమయంలో అప్పలరాజు ఓడిపోతారని పార్టీకి తెలియజేసినా సమయాభావం వల్ల నాయకత్వం సరిదిద్దుకోలేకపోయిందన్న భావనతో నాలుగేళ్ల ముందే ఆయన అభ్యర్థిత్వాన్ని తాము బలపర్చలేమన్న సంకేతాలు పార్టీకి పంపుతున్నామని, దానివల్ల ముందుగానే పార్టీ దృష్టి సారిస్తుందన్న నమ్మకంతో ఇన్‌ఛార్జి, అధ్యక్షులను కలిశామని అసమ్మతి నేతలు చెబుతున్నారు. మీడియాలో గాని, సోషల్ మీడియాలో గానీ తనపై వ్యతిరేకంగా కథనాలు వస్తే కౌంటర్ రాయించుకోవడం, తాను పెంచి పోషిస్తున్నవారితో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించుకోవడం కాకుండా.. గాయం ఉన్నచోట మందు పూయాల్సిన అవసరాన్ని అప్పలరాజు గుర్తించాలి. జిల్లాలో పలువురు సీనియర్ నేతలకు వయసైపోయుండొచ్చు.. అదే సమయంలో యువనేతగా అప్పలరాజుకు చాలా భవిష్యత్తు కూడా ఉండొచ్చు. కానీ సీనియర్ల స్థానంలో ఆయన రాజకీయంగా ఏలాలంటే.. ముందు ఆయనకో రాజ్యం ఉండాలి. అందులో సైన్యం ఉండాలి. అన్నింటికీ మించి యుద్ధంలో గెలవాలి. దాన్ని వదిలేసి భవిష్యత్తులో జిల్లాలో తానే చక్రం తిప్పుతానన్న భావన ఉంటే.. ముందు నియోజకవర్గం చేజారిపోతుంది. ఇంత చిన్న లాజిక్కు ఎన్నో రోగాలను నయం చేసిన డాక్టర్‌కు తెలియంది కాదు. కాకపోతే ఆయన ఆ నలుగురి మెదడుతో ఆలోచిస్తున్నట్టున్నారు.










Comments