అమ్మో.. ఆ కేసు.. చివరాకరికి తుస్సు!
- Prasad Satyam
- 3 days ago
- 2 min read
పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారులపై డాక్టర్ సూర్యం ఫిర్యాదు
ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశాల
ఆధారాలు లేక అయోమయంలో టూటౌన్ అధికారులు
చివరికి న్యాయస్థానానికే మొర పెట్టుకోవడంతో కేసు క్లోజ్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పశు సంవర్ధక శాఖలో రాష్ట్రం నుంచి జిల్లాస్థాయి వరకు ఉన్న 19 మంది ఉన్నతాధికారులపై అదే శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో పని చేస్తున్న డాక్టర్ పొట్నూరు సూర్యం పెట్టిన కేసులో అనూహ్య ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఉండటంతో టూటౌన్ పోలీసులు ఏం చేయాలో పాలుపోని సంకట స్థితిలో పడ్డారు. అయితే ఊహించని విధంగా కేసు క్లోజ్ అయిపోవడం వారికి ఉపశమనం కలిగించింది. తనను సస్పెండ్ చేశారన్న కోపంతోనే సూర్యం 19 మంది అధికారులపై ఫిర్యాదు చేశారని, అయితే వీరంతా నేరం చేసినట్లు ఎక్కడా రుజువు కానందున ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ కట్టలేకపోతున్నామంటూ టూటౌన్ సీఐ ఫస్ట్‌క్లాస్ అడిషనల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు ఒక మెమో సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొందరు సీనియర్ అధికారులపై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పోలీసులు తీసుకోవడంలేదని, దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలంటూ సూర్యం కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ మేరకు ఈ కేసును విచారించాలని, అంతకంటే ముందు పిటిషనర్ నుంచి ఫిర్యాదు తీసుకోవాలంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఇందులో 420, 193, 195, 195ఎ, 197, 199, 217, 218, 219, 221 రెడ్ విత్ 34 ఐపీసీ వంటి శిక్షార్హమైన సెక్షన్లు ఉండటంతో 2024లో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. 2024 మే 18న టూటౌన్‌లో కేసు నమోదు చేసే విధంగా సూర్యం కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు.
పోలీసుల నిస్సహాయత
తన ఫిర్యాదులో అధికారుల యూనియన్‌పై సూర్యం అనేక ఆరోపణలు చేశారు. దీనిపై విచారించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉండటంతో పోలీసులకు సంకట స్థితి ఏర్పడిరది. ఎందుకంటే.. సూర్యం తన ఫిర్యాదులో చేసిన ఆరోపణల్లో ఐఏఎస్‌లు, సీనియర్ అధికారుల పాత్ర ఎక్కడా కనిపించడంలేదు. దాంతో ఎఫ్‌ఐఆర్ ఎలా నమోదు చేయాలో తెలియక ఏ కోర్టు నుంచైతే ఇన్వెస్టిగేషన్ చేయాలని ఎండార్స్‌మెంట్ వచ్చిందో, అదే కోర్టుకు టూటౌన్ సీఐ ఒక మెమో సమర్పించారు. ఈ కేసు కేవలం వ్యక్తిగత కక్షలతో నమోదు చేసిందే తప్ప అందులో పేర్కొన్నవారెవరికీ నేరచరిత్ర లేదని, ఉద్దేశపూర్వకంగా చేయలేదని, అందుకే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయొద్దంటూ శాఖాపరమైన చర్యల్లో పోలీసులు తలదూర్చలేరంటూ మెమో సమర్పించడంతో కోర్టు పోలీసుల అభ్యర్థనను మన్నించి కేసును క్లోజ్ చేసింది. 19 మంది మీద ఒకేసారి క్రిమినల్ సెక్షన్లతో ఫిర్యాదు నమోదు కావడం ఒక సంచలనమైతే కోర్టుకు మెమో సమర్పించడం ద్వారా ఈ కేసు తేల్చేయడం మరో సంచలనం. ఇందుకు కారణం.. డాక్టర్ సూర్యం గతమే.
ఏడాది తర్వాత విజయనగరంలో పోస్టింగ్
పశు సంవర్ధక శాఖలో ఏడీగా పని చేస్తున్న డాక్టర్ సూర్యాన్ని 2023 నవంబరు 8న అధికారులు సస్పెండ్ చేశారు. తన ఛాంబర్‌లో తన వస్తువులన్నీ ఉండిపోయినందున దానికి తాళం వేసుకెళ్లిపోయానని, అయితే ఉన్నతాధికారులు తనకు చెప్పకుండానే తాళాలు పగులగొట్టా చాంబర్ తెరిపించి రూ.6.50 లక్షల విలువైన తన వస్తుసామగ్రిని దొంగిలించారంటూ డాక్టర్ సూర్యం టూటౌన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి పశు సంవర్ధక శాఖ అధికారి ఎం.కిశోర్, డిప్యూటీ డైరెక్టర్ ఎం.జగన్నాథం, గెజిటెడ్ మేనేజర్ ప్రసాదరావు, ఐఎస్‌డీపీ ఏడీ బమ్మిడి యోగేశ్వరరావు, పశు సంవర్ధక శాఖ ఏడీ కె.రాజగోపాల్, షీప్ బ్రీడర్స్ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ రాపాక చిన్నారావులు ఇందుకు బాధ్యులని ఆరోపించారు. 2024లో 97/2024 నెంబరుతో నమోదైన ఈ కేసులో ఆధారాలు లేవని, ఫిర్యాదు సరికాదంటూ ఎఫ్‌ఐఆర్‌ను క్లోజ్ చేశారు. అయితే ఇటీవల పొట్నూరు సూర్యంపై సస్పెన్షన్‌ను ఎత్తివేసి జిల్లా షీప్ బ్రీడర్స్ కోఆపరేటివ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విజయనగరం జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. ఆయన అక్కడ చేరకుండా శ్రీకాకుళం జేడీ కార్యాలయంలో మేనేజర్ వద్దకు వెళ్లి, ఇక్కడే జాయినవుతున్నట్టు సంతకం చేశారు. దీనిపై మళ్లీ తాజాగా డాక్టర్ సూర్యంపై పశు సంవర్ధక శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఈ ఏడాది జూలై 11న కోర్టులో ఛార్జిషీటు కూడా దాఖలైంది. ఇలా ఆయన సర్వీసులో ఎక్కువ భాగం పోలీస్‌స్టేషన్లు, వివాదాలు ఉండటంతో సూర్యం ఫిర్యాదును వ్యక్తిగత కక్షల కోణంలోనే చూడాల్సిన పరిస్థితి దాపురించింది.
క్రిమినల్ కంటెంప్ట్‌కు వెళ్లా - డాక్టర్ సూర్యం
2023లో నన్ను సస్పెండ్ చేసిన తర్వాత హైకోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాను. దాన్ని అధికారులు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు దాన్ని రీవోక్ చేసి విజయనగరంలో రిపోర్ట్ చేయమనడం కరెక్ట్ కాదు. అసలు నా సస్పెన్షనే ఇంటెరిమ్ ఆర్డర్‌లో ఉన్నప్పుడు మళ్లీ పోస్టింగ్, అది కూడా విజయనగరం అనడం పూర్తిగా కోర్టు ధిక్కరణే. నిజంగా నేను శ్రీకాకుళంలో రిపోర్టు చేయడం తప్పయితే, ఇప్పటికే నాపై మళ్లీ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి కదా. ఆ పని ఎందుకు చేయడంలేదు? ఇప్పుడు శ్రీకాకుళంలో నేను డ్యూటీ చేయడానికి పోలీస్ ప్రొటెక్షన్ కోరుతున్నాను. త్వరలోనే అది కూడా వస్తుంది. అప్పుడు ఇక్కడే విధులు నిర్వహిస్తాను.










Comments