అమ్మో..రికా!
- DV RAMANA

- Sep 30, 2025
- 3 min read
30 ఏళ్లుగా ఉంటున్న మహిళను బేడీలు వేసి వెళ్లగొట్టారు
అనుమతి కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు
కుటుంబమంతా అమెరికాలో.. ఆమె మాత్రం భారత్‌లో..
అక్కడి జీవితమంతి ఒంటరితనంతో కూడిన దుర్బరమే
ట్రంప్ రాకతో మరిన్ని కష్టాలు.. ఇద్దరు ఎన్‌ఆర్‌ఐ మహిళల భిన్న అనుభవాలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
‘దూరపు కొండలు నునుపు’ అంటారు.. దగ్గరికెళ్తేగానీ వాటిని ఎక్కడం ఎంత కష్టసాధ్యమో తెలియదు. అలాగే ‘దిగితే గానీ లోతు తెలియదు’ అంటారు. ఇవి అచ్చంగా అమెరికా బతుకులకు అతికినట్లు సరిపోతాయి. దశాబ్దాలుగా అమెరికా భారతీయులను ఆకర్షిస్తూనే ఉంది. డాలర్ డ్రీమ్స్ పేరుతో రంగుల ప్రపంచాన్ని చూపిస్తోంది. అవే ఆశలతో అక్కడికి వెళ్లేవారు మాత్రం దారుణమైన అనుభవాలు చవిచూస్తున్నారు. కానీ పైకి చెప్పుకోలేక గంభీరంగా ‘ఆహా అమెరికా.. ఓహో అమెరికా’.. అంటూ లేని గొప్పలు చెబుతుంటారు. డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ఆక్కడి ప్రవాసుల జీవితాలు మరింత దుర్భరమయ్యాయి. వీసా ఫీజులు, నిబంధనలు కఠినతరం చేసిన ట్రంప్ సర్కారు.. మరోవైపు సరైన అనుమతుల్లేకుండా అమెరికాలో ఉంటున్న వలసదారులను తీవ్రంగా అవమానిస్తూ, సంకెళ్లు వేసి మరీ నిర్బంధించి, తమ దేశం నుంచి తరిమేస్తోంది. ఇక భారతీయ వస్తువులపై సుంకాల మోత మోగించడం ద్వారా భారతీయ అమెరికన్ల జీవితాలను భారంగా మార్చేశారు. భారతీయులను ఉద్యోగాల నుంచి తీసేయాలని కూడా అక్కడి కంపెనీల మెడపై ఆంక్షల కత్తి పెట్టారు. ఈ ఆంక్షల, హింసల బారిన పడిన ఇద్దరు ఎన్‌ఆర్‌ఐ మహిళల స్వీయ అనుభవాలే అమెరికా బతుకులు ఎంత దుర్భరమో వారి మాటల్లోనే విందాం. వారిలో హర్జిత్ కౌర్ విలేకరులతోనే తన గోడు వెళ్లబోసుకుంటే.. మరో మహిళ సోషల్ మీడియా ద్వారా తన బాధలు చెప్పుకున్నారు.
బేడీలు వేసి పంపారు:హర్జిత్ కౌర్
నా పేరు హర్జిత్ కౌర్. వయసు 73 ఏళ్లు. పంజాబ్‌లోని తరన్‌తారన్ జిల్లా పంగోటా మా స్వగ్రామం. భర్త చనిపోవటంతో 1992లో ఇద్దరు కుమారులను తీసుకొని అమెరికా వెళ్లాను. కాలిఫోర్నియాలోని ఈస్ట్‌బేలో స్థిరపడ్డాను. మూడు దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నాను. శాశ్వత నివాసం కోసం నేను పెట్టుకున్న దరఖాస్తును 2012లో అమెరికా అధికారులు తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకోసారి స్థానిక ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) కార్యాలయానికి వెళ్లి హాజరు వేసుకుంటూనే ఉన్నాను. అదేవిధంగా ఈ నెల ఎనిమిదో తేదీన కూడా హాజరు వేసుకునేందుకు ఆ కార్యాలయానికి వెళ్లాను. కానీ ఏ కారణం చెప్పకుండానే అక్కడ నన్ను అరెస్టు చేశారు. ఎప్పుడూ ఏ తప్పూ చేయని నన్ను ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులు అత్యంత దారుణంగా అవమానించి బలవంతంగా భారత్‌కు పంపేశారు. కనీసం నా కుటుంబ సభ్యులకు వీడ్కోలు కూడా చెప్పనివ్వలేదు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నానన్న ఆరోపణలతో అరెస్టు చేశారు. అమెరికా అధికారులు నాపట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారు. హాజరు వేసుకునేందుకు ఐసీఈ కార్యాలయానికి వెళ్లిన నన్ను రెండుగంటలపాటు కూర్చోబెట్టిన తర్వాత అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. అధికారుల తీరుపై మా కుటుంబసభ్యులు, స్థానిక సిక్కు ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలిపినా ప్రయోజనం లేకపోయింది. నా కుటుంబ సభ్యులకు కనీసం వీడ్కోలు కూడా చెప్పే సమయం ఇవ్వకుండా బలవంతంగా తీసుకెళ్లిపోయారు. నన్ను భారత్‌కు తామే తీసుకెళ్తామని నా కుటుంబ సభ్యులు విన్నవించి, విమాన టికెట్లు చూపించినా అధికారులు పట్టించుకోలేదు. కూర్చునే అవకాశం కూడా ఇవ్వలేదు సరికదా.. మోకాళ్ల సర్జరీ చేయించుకున్న తనను కనీస సౌకర్యాలు కూడా లేని ఓ గదిలో ఒక రాత్రంతా బంధించి మానసిక, శారీరక హింసకు గురిచేశారు. నాకు అమెరికాలో వర్క్ పర్మిట్ ఉంది. ఐడీ, లైసెన్స్ అన్నీ ఉన్నాయి. కానీ నివాస అనుమతి లేదన్న ఒకే ఒక్క కారణంతో అరెస్టు చేసి, చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు. నన్ను అరెస్టు చేసిన తర్వాత అధికారులు నా ఫొటోలు తీసుకుని ఒక రాత్రంతా చల్లని గదిలో నిర్భందించారు. మందులు కూడా వేసుకోనివ్వలేదు. చేతులకు బేడీలతోనే శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బేకర్స్ ఫీల్డ్‌కు తీసుకెళ్లారు. నేను పూర్తిగా శాకాహారిని. ఆ విషయం చెప్పినా పట్టించుకోకుండా గొడ్డుమాంసంతో కూడిన భోజనం ఇచ్చారు. దాంతో చిప్స్, బిస్కెట్లతోనే ఆ రాత్రి గడిపాను. ఖైదీలకు వేసినట్లు నాకు ఓ యూనిఫాం వేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయి. ‘భారత్‌లో ఉండటానికి నాకు ఏమీ లేదు. నా కుటుంబమంతా అమెరికాలోనే ఉంది. నా స్వగ్రామంలో నా ఇల్లు ఉందో కూలిపోయిందో కూడా తెలియదు. నేను మళ్లీ అమెరికా వెళ్లి నా కుటుంబాన్ని కలుస్తాననే నమ్మకం ఉంది.
ఒంటరితనంతో దుర్భర జీవనం:ఎన్‌ఆర్‌ఐ
అవెరికా వెళ్లిన వారందరూ అక్కడ తాము చాలా బాగున్నామని చెబుతారు కానీ, ఏమీ బాగుండరు అని వెల్లడిరచింది. అమెరికా జీవితం మొదట్లో ప్రశాంతంగా అనిపించినా, క్రమంగా అది ఒంటరితనంగా మారుతుంది. మాట్లాడేవారు, పట్టించుకునేవారు లేకపోవడం వంటి పరిస్థితులు కలవరపరుస్తాయి. భారతదేశంలో ఎక్కడ చూసినా సందడి, స్నేహితులు, కుటుంబ సమావేశాలు ఉంటాయి. అదే అమెరికాలో ఇంటి గోడల మధ్య నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. సామాజిక సంబంధాలు లేకపోవడం వల్ల ప్రవాస భారతీయులు తమ దేశీయులను కలిసే అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఇది వారి జీవితంలో ఏర్పడిన శూన్యతను సూచిస్తుంది. ప్రవాస భారతీయులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో గంటల తరబడి మాట్లాడటం సాధారణం. ఇది సమాచార మార్పిడికే కాకుండా మానసిక ఉపశమనం కోసం చేసే ప్రయత్నం. గంటల తరబడి ఫోనులో మాట్లాడటం భారత్‌లో ఉన్నవారికి చికాకు కలిగించినా అక్కడి వారికి మాత్రం అదొక అవసరం. సరదాలు, గొడవలు, ముచ్చట్లు లేని జీవితం వారిని మానసికంగా కుంగదీస్తోంది. ఇలాంటి అనుభవాలు డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి. వీటికి తోడు అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రవాస భారతీయులను ఇబ్బందిపెడుతున్నాయి. సుంకాల మోత, వీసా ఆంక్షలు, ఉద్యోగాల్లో కోత, వంటి అనేక నిర్ణయాలు ఆమెరికాలో భారతీయుల బతుకులను మరింత దుర్భరం చేస్తున్నాయి. ఇవన్నీ స్వానుభవమైన తర్వాత భారతదేశంపై గౌరవం మరింత ఇనుమడిస్తుంది.










Comments