కళ మీద కాండ్రిస్తున్నావ్.. ఏంది రెహమాన్?
- NVS PRASAD

- 2 days ago
- 3 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఏ.ఆర్. రెహమాన్ 1989లో ఇస్లాం స్వీకరించే ముందు ఆయన పేరు దిలీప్. 1992లో మణిరత్నం రోజా సినిమా సంగీతంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన కెరీర్‌ను ఆపే శక్తి ఎవరికీ లేదు. 6 జాతీయ అవార్డులు, 2 ఆస్కార్ అవార్డులు, 2 గ్రామీ అవార్డులు, బీఏఎఫ్‌టీఏ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులు, 15 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 18 ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు, భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్. ఈ దేశం నుంచి ఇన్ని తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ రెండు రోజుల క్రితం బీబీసీ ఏసియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడానికి కారణం బహుశా మతం కావచ్చని వ్యాఖ్యానించడం చూసి యావత్ దేశం కాండ్రించి ఊస్తుంది. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాకు హిట్ పాటలు ఇవ్వడం ద్వారా మరోసారి దక్షిణ భారతదేశంలో తన సత్తా చాటుకునే అవకాశాన్ని రెహమాన్ చేజేతులా చెడగొట్టుకున్నారు. ఇప్ప్పుడు మతం కోణంలో తాను బాధితుడిననే ఒక కార్డును బయటకు తీసి వివాదాల్లో చిక్కుకున్నారు. అంతకు మించి ఆ మధ్య విడుదలైన చావా సినిమా మీద ఆయన మతం కోణంలోనే వ్యాఖ్యలు చేశారు. దీనికి ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ కావడం గమనార్హం. బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిన వెంటనే మతం కార్డును బయటకు తీయడం మీద ఆయన అభిమానులు, సగటు భారతీయుడు గుర్రుగా ఉన్నారు. ఇక్కడ టాలెంట్ ఎవరి సొత్తూ కాదు. పోయేవరకు టాప్ వన్‌లో ఉంటారన్న గ్యారెంటీ లేదు. పస్తులున్న రోజుల దగ్గర్నుంచి పైసలు అవసరానికి మించి సంపాదించిన రెహమాన్‌కు ఇది తెలియక కాదు. కేవలం దేశంలో పాలకులు, తద్వారా చిత్రపరిశ్రమ ఒకవైపే మొగ్గు చూపుతుందన్న సందేశాలు పంపడమే ఆయన ఉద్దేశం కావచ్చు. ఇందుకు సంబంధించిన, సినీ పరిశ్రమలో ఉన్న పోకడలను వివరించే కథనమిది.
తెలుగు సినిమా పరిశ్రమలో మణిశర్మ ఒకప్ప్పుడు తోపు. మరి 8 ఏళ్లుగా ఆఫర్స్ లేవు.. ఆమధ్య చిరంజీవి ఒక సినిమాకు అవకాశమిచ్చినా ఆ తర్వాత ఒక్క సినిమాకూ పని చేసిన పాపాన పోలేదు. ఈయన హిందువే కదా! స్వయంగా రసాలూరు సాలూరు రాజేశ్వరరావు కొడుకు కోటి. 1980`90 దశకంలో తోపు. గత 20 ఏళ్లుగా అన్ని సినిమాలు లేవు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినన్ని హిట్ ఆల్బమ్స్ తెలుగులో మరొకరు ఇవ్వలేదు. కానీ గత 5 ఏళ్లుగా అన్ని సినిమాలు లేవు.. ఆయన నిర్మాతలు కొందరు ఎసఎస్ తమన్ వైపు మళ్లారు. ఈమధ్య చిరంజీవి లాంటి మెగాస్టార్ కూడా బీమ్స్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌ను తెర మీదకు తెచ్చారు. తమన్‌కు కూడా సినిమాలు తగ్గాయి వీరంతా ఎవరి మీద ఏడ్వాలి? రాజశేఖర్ నటించిన అల్లరిప్రియుడు సినిమా తర్వాత అన్ని సినిమాలు కీరవాణివే. ఇపుడు కేవలం రాజమౌళివి మాత్రమే.
30-40 ఏళ్లు ఒకరి మ్యూజిక్ మాత్రమే వినాలి అనుకోరు. జనాల మనసు మారుతుంది. రెహమాన్ అలా అన్నారు అంటే.. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్‌ని అవమానం చేసినట్లు. వాళ్లు ఆఫర్స్ ఇచ్చేది.. ప్రభుత్వాలు, మతాలు చూసి ఇవ్వరు.
సినిమా ఇండస్ట్రీలో ఎవడిని అడిగినా చెప్తారు.
ఆడలేక మద్దెల బరువు అంటే ఇదే. ఇప్పటి ప్రజలకి కొత్తదనం కావాలి. అలాగే కొత్తవాళ్లకి అవకాశం కావాలి. అందరూ ఎదగాలి.. 20 ఏళ్లు కష్టపడ్డారు. బాగా సంపాదించారు. అయినా కట్టె కాలే వరకు నేనే ఉండాలి అనుకోకూడదు. అలా అవకపోతే మతం పేరు చెప్పాలని ఇప్ప్పుడు రెహమాన్ నిరూపించారు. వాస్తవానికి భారత్‌లో మాత్రమే ఈ స్వేచ్ఛ. తెలుగు, కన్నడ, మలయాళం వాళ్ల అభిరుచి వేరు. ఏఆర్ రెహమాన్ డబ్బింగ్ మూవీస్ సంగీతం తప్ప.. మాములుగా తెలుగులో పెద్ద ఛాన్సులు ఎప్పుడు లేవు. ఎవరి అభిరుచి వాళ్లది.
ఒక పాకిస్తానీ సంతతికి చెందిన బీబీసీ ఏసియా నెట్‌వర్క్‌లో పని చేస్తున్న హరూన్ రషిద్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ ఇలా చెప్పాడు.. ‘1960లు, 1970లలో ఉర్దూ హిందీ చలనచిత్రాన్ని ఏలింది.. ఉర్దూ హిందీ సంగీతానికి తల్లి’ అని. వాస్తవానికి ఉర్దూ పుట్టడానికి చాలా ముందే హిందీ ఉంది. ఉర్దూ హిందీకి తల్లి కాదు. ఔరంగజేబుకు వ్యతిరేకంగా చత్రపతి శంభాజీ మహారాజ్‌పై చేసిన సినిమా ‘చావా’ను ఏఆర్ రెహమాన్ మతాల మధ్య విభజన సృష్టించే సినిమా అని అన్నారు. కానీ మత మార్పిడికి వ్యతిరేకంగా ధిక్కారాన్ని చూపించడం ‘విభజన’గా మతం మార్చుకున్న రెహమాన్ చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ప్రస్తుతం సంగీత ప్రపంచంలో పెరుగుతున్న పోటీ తట్టుకోలేక అందుకు అనుగుణంగా పరిణామం చెందడానికి నిరాకరిస్తూ, కొత్త అభిరుచులకు అనుగుణంగా మారడానికి నిరాకరించి నిజమైన కళాకారుడిలా తిరిగి తనను తాను ఆవిష్కరించుకోవడానికి బదులుగా ఇలా మాట్లాడటం సరికాదు. తన సొంత ఆల్బమ్‌లను విడుదల చేసి ఎంతో డబ్బును సంపాదించుకుంటూ, తన సొంత చిత్రాలకు నిధులు సమకూర్చగలిగే స్థాయిలో ఉండి బాధితుడి కార్డును ప్లే చేయడం ఎంతవరకు సమంజసం? బాధాకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి భావజాలం ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు రామాయణం సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు.
ఏ మతం అని చూడకుండా.. రెహమాన్ మ్యూజిక్‌ని ఇష్టపడి తప్పు చేసినట్టున్నామనేది ఇప్ప్పుడు సగటు సినిమా అభిమాని ఆవేదన. అన్నమయ్య, త్యాగయ్య అభిమానులు కోకొల్లలు. వారి వారసత్వం పుణికి పుచ్చుకున్న సంగీతకారులకు కరువు లేని దేశం ఇది. నిజంగా హిందువులకు అంత మత వివక్షే ఉంటే ‘రామాయణ’ సినిమాకు రెహమాన్‌ను ఎందుకు పెట్టుకుంటారు?
రామ్‌చరణ్ గేమ్‌ఛేంజర్ మూవీ ఏఆర్ రెహమాన్ కడప దర్గాకి తీసుకువెళ్లాడు. చరణ్ అయ్యప్ప మాలలో ఉండి కూడా రెహ్మాన్ కోసం వెళ్లాడు. ఆయన కోసం పెద్దికి అవకాశం ఇచ్చాడు.
సినిమా ఇండస్ట్రీలో మరి 24 విభాగాల్లో అందరు బాగానే ఉన్నారుగా. ముస్లిమ్స్, ముస్లిం అమ్మాయిలు కూడా హాయిగా ఉన్నారు. రెహమాన్ ప్రస్తుతం 5-6 ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. కోట్లు తీసుకుంటాడు. ఆయన్ని పెట్టుకునే స్తోమత చాలామంది నిర్మాతలకి లేదు కూడా. డబ్బు తక్కువ అని ఎన్నో మూవీస్ వదిలేసాడు. మరి అటు ఇటు తిప్పి బీజేపీ వచ్చాక ఆఫర్స్ పోయాయి అంటున్నాడు. పవర్ షిఫ్టింగ్ అంటే అదే. విజయం వస్తే ఆయన సొంత టాలెంట్.. ఫెయిల్యూర్ అయితే మతాల గొడవ. అవకాశాలు తగ్గిన షారుక్ ఖాన్ బుద్ధిగా హార్పిక్ యాడ్ చేసుకోలేదూ.. రెహమాన్ కూడా... చక్కగా హిందూ పండగలకి పబ్బాలకి.. బోలెడు స్టేజ్ మ్యూజికల్ నైట్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయ్.. చేసుకోవచ్చంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
వాస్తవం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో సామాజిక వాతావరణం ప్రభావం చూపవచ్చు. అలాగే కళాకారుడి పనితనంపై ప్రేక్షకుల అంచనాలు మారడం కూడా సహజమే. ప్రతి దశలో కళాకారుడిని కాలం, ట్రెండ్స్, ప్రేక్షకుల అభిరుచులు పరీక్షిస్తూనే ఉంటాయి.
చివరిగా ఒక మాట. చావా సినిమా విభజనవాదమైతే, జోదా అక్బర్ సినిమా జాతీయ సామరస్యత కలిగిందనా రెహమాన్ ఉద్దేశ్యం. ఈరోజు ఈ దేశంలో రెహమాన్ కంటే ఎక్కువ సంపాదించిన సంగీత దర్శకుడు లేడు. రెహమాన్ కంటే ఎక్కువ పాపులర్ అయిన మరో మతం టెక్నీషియన్ లేడు. రెహమాన్ కంటే ఎక్కువ అవార్డులు పొందిన సంగీత కళాకారుడూ లేడు. అయినా కళ మీద కాండ్రించి ఊయడం రెహమాన్ విజ్ఞతకే వదిలేద్దాం.










Comments