అమ్మవారి ఉత్సవాలకు వెళ్లి వస్తూ.. రోడ్డు ప్రమాదం
- SATYAM DAILY
- 4 hours ago
- 1 min read
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్
ఇద్దరు యువకులు మృతి
పలాస ప్రభుత్వాసుపత్రికి మృతదేహాల తరలింపు
కేసు నమోదు చేసిన వజ్రపుకొత్తూరు పోలీసులు

(సత్యంన్యూస్, వజ్రపుకొత్తూరు)
వజ్రపుకొత్తూరు మండలంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపీనాథపురం గ్రామానికి చెందిన కర్ని కోదండరావు (28), గర్తంవానిపేటకు చెందిన గర్తం మణికంఠ (33) సమీపంలోని సైనిరు గ్రామంలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలను చూడటానికి వెళ్లారు. పండగ ముగించుకుని రాత్రి బైక్‌పై తిరిగి వస్తుండగా, చిన్న తామాడపేట సమీపంలోకి రాగానే వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో తలకు తీవ్ర గాయాలై ఇద్దరు యువకులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు.
పలాస ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాల తరలింపు
ప్రమాదంపై సమాచారం అందుకున్న వజ్రపుకొత్తూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. క్షణాల్లో ఇద్దరు యువకులు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
----------------------------------------------------------------------------
పోలిపల్లిలో ప్రమాదం.. కంచిలివాసులు మృతి
ప్రాణాలు కోల్పోయిన తాతా, మనుమడు

(సత్యంన్యూస్, విజయనగరం)
భోగాపురం మండలం పోలిపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఘటనలో ఏడాదిన్నార వయస్సు ఉండే రాపాక సాత్విక్, అతని తాత మన్యాల సూరిబాబు (60) ప్రాణాలు కోల్పోయారు. మన్యాల లక్ష్మి, రాపాక కిశోర్, రాపాక ఉమామహేశ్వరి, కొయ్య నేహ గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. దీంతో డ్రైవర్ కారులో చిక్కుకున్నాడు. యంత్రాల సాయంతో డ్రైవర్‌ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కంచిలి నుంచి రాజమండ్రి వెళ్తూ అతివేగం కారణంగా అదుపుతప్పి డివైడర్ దాటి రాంగ్ రూటులోకి కారు ప్రవేశించింది. దీంతో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ప్రమాద సమయంలో కారు ముందు సీటులో కూర్చున్న మన్యాల సూరిబాబు, అతని ఒడిలో ఉన్న ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. మిగతావారికి చిన్నపాటి గాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులు, మృతదేహాలను వేరువేరు ఆసుపత్రులకు తరలించారు.






Comments