ఫారాలు ఎక్కడ ‘సర్ ’?
- Prasad Satyam
- 3 hours ago
- 3 min read
పంపిణీ జరగకుండానే 75 శాతం పూర్తయిందంటున్న బీఎల్‌వోలు
బూత్‌లలో ఓటర్లను గుర్తించడానికి అష్టకష్టాలు
2002 తర్వాత ప్రాంతం మారితే ఓట్లను సరిచూసుకోవాల్సిందే
అడుగేయని బీఎల్‌వోలు, ఆసక్తి చూపని బీఎల్ ఏలు
కార్పొరేషన్‌లో ‘సర్ ’ దెబ్బకు ఓట్ల గల్లంతు ఖాయం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 75 శాతం ఓటర్లను నిబంధనలకు అనుగుణంగా అనుసంధానించామని ప్రకటించిన బీఎల్‌వోలు వాస్తవానికి 30 శాతం కూడా ఓటర్లను అనుసంధానించకపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గడువుకు, ప్రత్యేకాధికారి రివ్యూలో 75 శాతం పూర్తి చేశామని ప్రకటించిన బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇప్ప్పుడు ఆ 75 శాతం మంది ఎక్కడున్నారో తెలియక నానా ఇబ్బందీ పడుతున్నారు. సర్‌ను ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రాల్లో ఎదురైన సమస్యలే ఇక్కడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో ఓటర్లను గుర్తించలేక బీఎల్‌వోలు ఆపసోపాలు పడుతున్నారు. రాష్ట్రంలో మిగిలిన పట్టణ ప్రాంతాలతో పోలిస్తే శ్రీకాకుళం నగరంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. సర్ ద్వారా మళ్లీ కొత్తగా ఓట్లను నమోదు చేసుకోవడమే. దీనికి రాజకీయ పార్టీల సహకారం అవసరం. వీరినే ఎలక్షన్ కమిషన్ అధికారికంగా బూత్ లెవెల్ ఏజెంట్లుగా గుర్తింపునిచ్చింది. వీరి సహకారంతోనే బీఎల్‌వోలు ఓటర్లను అనుసంధానించాలి. కానీ ఒక బూత్ స్థాయిలో ఓటర్లను కనిపెట్టి వారి ఓటును బతికించడం అంత సులువు కాదు. శ్రీకాకుళం నగరంలో తెలుగుదేశం పార్టీకి డివిజన్ ఇన్‌ఛార్జిలెవరో ఇప్పటికీ తేలలేదు. వైకాపాకు అదే స్థానంలో బలమైన నాయకత్వం ఉన్నా ఎప్ప్పుడూ నగరంలో మెజార్టీ ఓట్లు తెలుగుదేశం పార్టీకే పోలవుతున్నాయి కాబట్టి ఎవరి ఓటు పోయినా తమకు మంచిదేనన్న భావనతో ఆ పార్టీ ఉంది. దీంతో బీఎల్‌వోలే కొన్నిచోట్ల ఎన్‌రోల్‌మెంట్ ఫారం పట్టుకొని తిరుగుతుంటే, మరికొన్ని చోట్ల ఇంకా మొదలుపెట్టలేదు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 90 శాతం ఓట్ల అనుసంధానం అయిపోయిందని, కార్పొరేషన్‌లో 75 శాతం వరకు చేరుకున్నామని ప్రకటించారు. వాస్తవానికి ఇది అబద్ధం.
ఓట్లు అనుసంధానం అంటే ఏమిటి?
సర్ ప్రకారం 2002 ఓటర్ల జాబితాను బీఎల్‌వోలకు ఇచ్చారు. అలాగే తాజా ఓటర్ల జాబితా కింద 2025లో తయారుచేసిన ఓటరు లిస్టును కూడా ఇచ్చారు. ఈ రెండింటిలోనూ ఓటరు పేరు ఉంటే, దాన్ని మ్యాపింగ్ చేసేసి ఓటు ఉన్నట్టు చూపిస్తారు. 2002 తర్వాత ఎన్ని ఎన్నికల్లో ఓటు వేసినా, 2002 జాబితాలో లేకపోతే మాత్రం ఈసారి ఓటరుగా గుర్తించరు. ఉదాహరణకు చెప్ప్పుకోవాలంటే ఒక ఇంటిలో ఎప్పటి నుంచో ఉంటున్న తల్లి, తండ్రి, కొడుకులకు 2002, 2025 ఓటర్ల జాబితాల్లో పేరుంది. కానీ 2002 తర్వాత ఆ ఇంటికి కోడలొస్తే ఇప్ప్పుడు కొత్తగా ఎన్‌రోల్ చేసుకోవాలి. 2002కు ముందు కోడలి ఓటుహక్కు వేరే జిల్లాలోనో, వేరే రాష్ట్రంలోనో, వేరే బూత్‌లోనో ఉంటే దాన్ని ఇక్కడకు తీసుకురావాలి. ఇవన్నీ బీఎల్‌వోలతో కుదిరే పని కాదు. ఎందుకంటే.. ఒక బూత్‌లో కనీసం 10 వార్డులకు సంబంధించిన ఓటర్లు ఉంటారు. శ్రీకాకుళం నగరంలో 132 పోలింగ్ బూత్‌లు ఉంటే ఇందులో 50 డివిజన్ల ఓటర్లను సర్దారు. ఒకే ఇంటిలో ఇద్దరికి ఒక బూత్‌లోను, మరో ఇద్దరికి మరో రెండు బూత్‌లలోను ఓట్లు చూపించిన ఘటనలు అనేకం చూశాం. ఇప్ప్పుడివన్నీ మ్యాపింగ్‌కు దొరకడంలేదు. 2002, 2025 ఓటర్ల జాబితాలో ఉన్న కామన్ పేర్లను కార్యాలయంలో కూర్చునే బీఎల్‌వోలు తేల్చేశారు. అక్కడితో మ్యాపింగ్ అయిపోయినట్టు లెక్క. ఇప్ప్పుడు 2002 తర్వాత వచ్చి చేరినవారిని ట్రేసవుట్ చేయాలి. ఆ పనే ఇక్కడ సక్రమంగా జరగడంలేదు. ప్రతీ ఎన్నికలకు శ్రీకాకుళంలో బూత్ నెంబర్లు మారుతున్నాయి. 2002 ఓటర్ల జాబితాలో పరిశీలిస్తే ఒక ప్రాంతంలో ఉన్న బూత్ నెంబర్లు 2025 జాబితాకు వచ్చేసరికి మారిపోయాయి. ఇప్ప్పుడు ఎవరు ఎక్కడ మ్యాపింగ్ చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. కేవలం కాగితాల మీదే 75 శాతం మ్యాపింగ్ అయిపోయిందని చెబుతున్నారు తప్ప నగరంలో సగం ప్రాంతాలకు పైగా ఇంకా ఎండార్స్‌మెంట్ ఫారం ఇవ్వలేదు. దీని మీద ఓటరు ఫొటో, క్యూఆర్ కోడ్ ఉంటుంది. కాబట్టి ఒకరి ఫారం మరొకరు జిరాక్స్ తీసి నింపి ఇవ్వడానికి లేదు. అలాగని బీఎల్‌వోలు బూత్ స్థాయిలో ఓటర్లను గుర్తించలేకపోతున్నారు. 2002, 2025 ఓటర్ల జాబితాలో ఉన్నవారికి తప్ప, మిగతావారి ఓటు ఈసారి గల్లంతవడం ఖాయం. రాజకీయ పార్టీలు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవడంలేదు. 2002 తర్వాత 2004లో ఒకసారి, 2009లో మరోసారి, 2014లో ఇంకోసారి, 2024లో తాజాగా ఓటేసినా కూడా ఈసారి సర్ పుణ్యమాని ఓట్లు ఉంటాయన్న గ్యారెంటీ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే 2002 ఓటర్ల జాబితాయే ప్రమాణికం. ఇంకా సూటిగా చెప్పాల0టే.. ఆ తర్వాత ప్రాంతం మారినవారు, ఓటుహక్కు వచ్చినవారు కొత్తగా ఎన్‌రోల్ చేసుకోవాల్సివుంటుంది.
జూన్ 15 నుంచి జులై 14 వరకు నెల రోజుల పాటు 2,358 మంది బీఎల్‌వోలు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి ఓటర్ల నుంచి వివరాలు నమోదు చేయించి, తిరిగి సేకరిస్తారు. దీన్నే మ్యాపింగ్ అని పిలుస్తున్నారు. ఇది జిల్లాలో అనేక చోట్ల ఇంకా పంపిణీ కాలేదు. కానీ జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇందులో పేరు ఉందో, లేదో చూసుకొని ఒకవేళ లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. ముసాయిదా ఓటర్ల జాబితా వచ్చిన దగ్గర్నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వీటిని సరిచేసి సెప్టెంబరు 14లోగా పరిష్కరించాలి. సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా రిలీజ్ చేస్తారు. అసలు ఫారాల పంపిణీయే లేకుండా, సర్ మీద పూర్తి ప్రచారం జరపకుండా ఈ కార్యక్రమాన్ని ముగించేయడానికి సిద్ధపడుతున్నారు. దీనివల్ల చాలా ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. జిల్లాలో 18,97,405 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు ఎన్యుమరేషన్ ఫారాల ముద్రణ పూర్తయింది. కానీ పంపిణీయే జరగడంలేదు. బీఎల్‌వోల లెక్కల ప్రకారం 9,70,014 ఫారాలను పంపిణీ చేయగా, 51.12 శాతం పంపిణీ పూర్తయినట్లు లెక్క. ఇది కాకుండా వీటిని మళ్లీ ఆన్‌లైన్‌లో డిజిటలైజ్ చేయాలి. అది 5.87 శాతం మాత్రమే అయింది. అసలు ఫారాల పంపిణీయే సవ్యంగా లేనప్ప్పుడు డిజిటలైజేషన్ 5.87 శాతం ఉండటం పెద్ద విషయం కాదు. వాస్తవానికి ఆ మేరకే ఎన్యూమరేషన్ ఫారాలు వెనక్కు వచ్చినట్లు భావించినవారు ఉన్నారు. సర్ ప్రక్రియ మీద రాజకీయ పార్టీలు పూర్తిగా చేతులెత్తేశాయి. మరోవైపు అబ్జక్షన్స్ వచ్చిన తర్వాత ఓట్లు చేరుద్దామన్న భావనతో బీఎల్‌వోలు ఉన్నారు. అసలు ఓటర్ల జాబితా ఎక్కడ పెడతారు? ఎలా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి? అన్నదానిపై ఎవరికీ అవగాహన లేదు. గ్రామాల్లో అంతా ఒకేచోట ఉండటం వల్ల ఈ ప్రక్రియ సవ్యంగా జరుగుతున్నా అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఫారాల పంపిణీకే దిక్కులేకుండాపోయింది. వలస ఓటర్లను గుర్తించడం తలకు మించిన భారంగా మారుతోంది. మరోవైపు ఎన్యూమరేషన్ ఫారాలు అందనివారు సచివాలయానికి వెళ్లి తమ పేరు, ఫోన్ నెంబరు అందజేస్తే, అవి ఎక్కడ ఉన్నదీ గుర్తించి వారికి అందజేయగలమని బీఎల్‌వోలు చెబుతున్నారు.






Comments