ఎల్‌నినోలన్నీ కరువు కారకాలు కావు!
- DV RAMANA

- 3 hours ago
- 3 min read
ఇతర వాతావరణ మార్పులు తోడైతేనే అనావృష్టి
శీతాకాలంలో మొదలైతే రుతుపవనాల నాటికి బలహీనం
అయితే దాని ప్రభావంతో ఐదేళ్లూ ఎండలే ఎండలు
సాధారణ పెరుగుదలను మించిపోతాయని ఆందోళన

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
ప్రపంచాన్ని ఇప్పటికే ఎల్‌నినో భయాలు వెంటాడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉపరితల ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగితే ఎల్‌నినో సంభవిస్తుందని, ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైందని అంతర్జాతీయ వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో వచ్చినప్పుడు తీవ్రమైన కరువు పరిస్థితులు తాండవిస్తాయని అంటున్నారు. అయితే ఎల్‌నినో వచ్చినప్పుడల్లా కరువులు సంభవిస్తాయని చెప్పడం సరికాదని మరికొందరు నిపుణులు ఉదాహరణలతో సహా భరోసా ఇస్తున్నారు. కాగా ఎల్‌నినో సంభవిస్తే కరువుకాటకాలు పీడిస్తాయన్న వాదనలు ఎలా ఉన్నా దానికి తోడుగా వచ్చే ఐదేళ్లూ ఉష్ణోగ్రతల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని, ఎండలు మండిపోతాయని ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్(డబ్ల్యూఎంవో) తాజాగా హెచ్చరించింది. దీంతో ఇప్పటికే ప్రారంభమైన ఎల్‌నినో చూపే దుష్పరిణామాలు ఎలా ఉంటాయో.. ఐదేళ్లపాటు ఉష్ణతాపాన్ని భరించడమెలా.. అన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా ఎల్‌నినో వల్ల భారత్‌లో కరువు పరిస్థితులు ఏర్పడతాయని, వర్షాలు పడవనే ఆందోళనలు ఎక్కువే. అయితే ఎల్‌నినో వల్ల రుతుపవనాలకు భారీ నష్టం వాటిల్లుతుందన్న అంచనాకు రావడం తొందరపాటే అవుతుందని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. గతంలోని వాతావరణ నమూనాలను పరిశీలిస్తే ఎంతటి బలమైన ఎల్‌నినో అయినా సరే మనదేశంలో వర్షాకాలం ప్రారంభానికి ముందే క్రమంగా బలహీనపడిపోతుందని వారు విశ్లేషిస్తున్నారు. శాస్త్రవేత్తలు 1951 నుంచి ఇప్పటివరకు సంభవించిన ఎల్‌నినో రికార్డులను లోతుగా పరిశీలించారు. ముఖ్యంగా 1982-83, 1997-98, 2015-16 నాటి తీవ్రమైన వాతావరణ మార్పులను విశ్లేషించినప్పుడు ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఈ బలమైన ఎల్‌నినోలన్నీ కూడా ఆయా సంవత్సరాల చివరి నాటికి.. అంటే శీతాకాలంలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఆ తర్వాత సరిగ్గా భారతదేశంలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే సమయానికి.. అంటే వేసవి ముగిసే నాటికి తమ శక్తిని కోల్పోయి పూర్తిగా బలహీనపడతాయని పలువురు నిపుణుల విశ్లేషణ. కానీ ఈసారి రుతుపవనాల సమయంలోనే ఎల్‌నినో ప్రక్రియ మొదలుకావడం విశేషం.
గత చరిత్ర ఏం చెబుతోంది?
ఉదాహరణకు 1997-98 నాటి ఎల్‌నినో ప్రభావాన్ని చూస్తే.. 1997 చివరి నాటికి పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ పైగా అధికంగా నమోదయ్యాయి. కానీ 1998 మధ్యకాలానికి (భారత రుతుపవనాల సమయానికి) వచ్చేసరికి ఎల్‌నినో తన శక్తిని కోల్పోవడమే కాకుండా, వర్షాలకు అనుకూలించే లానినాగా మారిపోయింది. 2015-16లో కూడా సరిగ్గా ఇదే వాతావరణ నమూనా పునరావృతమైంది. దీన్ని బట్టి చూస్తే, తీవ్రమైన ఎల్‌నినోలు ఎక్కువ కాలం నిలబడలేవని స్పష్టమవుతోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వివరాల ప్రకారం .. సాధారణంగా బలమైన ఎల్‌నినోలు రుతుపవనాలకు ముందే బలహీనపడి తటస్థ లేదా వర్షాలను ఇచ్చే లానినా పరిస్థితులకు దారితీస్తాయి. ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలో శీతలీకరణ సంకేతాలు (సముద్రం చల్లబడటం) కనిపిస్తున్నాయని, ఇవి వాతావరణంలో రాబోయే సానుకూల మార్పును సూచిస్తున్నాయని ఒక ఐఎండీ అధికారి పేర్కొన్నారు. దీర్ఘకాలిక అంచనాల్లో ఎప్పుడూ కొన్ని మార్పులు జరుగుతుంటాయని ఆయన అన్నారు. బలమైన ఎల్‌నినో ఏర్పడినంత మాత్రాన భారత రుతుపవనాలు ఆటోమేటిక్‌గా బలహీనపడిపోతాయనే వాదనలో నిజం లేదని నిపుణులు తేల్చిచెప్పారు. ప్రముఖ ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వైస్ ప్రెసిడెంట్ జి.పి.శర్మ దీనిపై స్పందిస్తూ ‘గతంలో అత్యంత బలమైన ఎల్‌నినో నమోదైన సంవత్సరాల్లో దేశంలో కరువులు సంభవించిన దాఖలాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో సాధారణ వర్షపాతం నమోదైన సందర్భాలూ ఉన్నాయి. అందువల్ల ఇది ఎప్పుడూ మిశ్రమ ఫలితాలనే ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. అలాగే దేశంలో వర్షపాతాన్ని ఎల్‌నినో ఒక్కటే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక ఇతర సంక్లిష్ట వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేస్తాయని ఆయన వివరించారు.
పెరగనున్న ఉష్ణతాపం
ఎల్‌నినో ప్రభావంపై తర్జనభర్జనలు జరుగుతుండగానే.. వచ్చే ఐదేళ్లూ మలమల మాడిపోవాల్సిందేనని ఐక్యరాజ్యసమితికి చెందిన వాతావరణ సంస్థ డబ్ల్యూఎంవో తాజా నివేదికలో హెచ్చరించింది. గత రికార్డులన్నీ బద్దలయ్యే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్పష్టం చేసింది. 2026`30 మధ్యకాలంలో భూమి సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక విప్లవానికి ముందున్న స్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదు కావడానికి 75 శాతం అవకాశం ఉందని యూకే మెటీరియలాజికల్ సంస్థ అంచనా వేసింది. ప్యారిస్ వాతావరణ ఒప్పందంలో నిర్దేశించుకున్న ఈ 1.5 డిగ్రీల మార్కును దాటితే వినాశనం తప్పదని.. 2024లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డు కూడా రాబోయే రోజుల్లో బ్రేక్ అయ్యే అవకాశాలు 86 శాతం ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులు దీనికి దోహదం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న బలమైన ఎల్‌నినో ప్రభావం 2028 వరకు ఉంటుందంటున్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోనున్నాయి. ముఖ్యంగా మిగతా ప్రాంతాల కంటే ఆర్కిటిక్ ప్రాంతం మూడున్నర రెట్లు వేగంగా వేడెక్కుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల మంచు కరిగిపోయి సూర్యరశ్మిని తిరిగి అంతరిక్షంలోకి పంపే ప్రక్రియ మందగించి సముద్రపు మంచు మరింత వేగంగా కరుగుతుందని బ్రిటన్ వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఎండలు మండిపోవడమే కాకుండా తీవ్రమైన కరువు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు కూడా ముంచుకొస్తాయని డబ్ల్యూఎంవో హెచ్చరిస్తోంది. ఉష్ణోగ్రతలు పెరిగి కరువు పరిస్థితులు నెలకొనడం వల్ల అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు రగిలే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకునే అమెజాన్ అడవులు.. మంటల వల్ల కార్బన్‌ను విడుదల చేసే ప్రాంతాలుగా మారి పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉంది.






Comments