టిడ్కో లబ్ధిదారులకు నగదు రీఫండ్
- BAGADI NARAYANARAO

- 3 hours ago
- 2 min read
9 ఏళ్ల నిరీక్షణకు ముగింపు
1,912 మందికి డిపాజిట్ మొత్తం వెనక్కి
శ్రీకాకుళం నగరంలో ఖాతాల్లో జమ చేసేందుకు నిధుల విడుదల

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని డిపాజిట్ చెల్లించినప్పటికీ ఇళ్లు లేదా ఫ్లాట్లు కేటాయించబడని లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది. సుమారు తొమ్మిదేళ్లుగా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు వారు చెల్లించిన పూర్తి డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి 19న ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం మేరకు శ్రీకాకుళం నగరంలోని 1,912 మంది లబ్ధిదారులకు నగదు రీఫండ్ అందించేందుకు నిధులు విడుదలయ్యాయి. లబ్ధిదారులు సింగిల్, డబుల్, ట్రిపుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు సమయంలో డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) రూపంలో చెల్లించిన రూ.500, రూ.12,500, రూ.25 వేలు, రూ.50 వేలు, రూ.లక్ష మొత్తాలను యథాతథంగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
టీడీపీ హయాంలో ప్రారంభమైన టిడ్కో ప్రాజెక్టు
టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017-18లో టిడ్కో గృహ నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం నగరంలోని పాత్రునివలస ప్రాంతంలో ఫేజ్-1, ఫేజ్-2 కింద మొత్తం 1,904 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 3,536 గృహాలను మంజూరు చేశారు. ఇళ్ల విస్తీర్ణాన్ని బట్టి లబ్ధిదారుల నుంచి డీడీల రూపంలో డిపాజిట్లు వసూలు చేశారు. 430 చదరపు అడుగుల గృహానికి రూ.లక్ష, 365 చదరపు అడుగుల గృహానికి రూ.50 వేలు, 300 చదరపు అడుగుల గృహాలకు రూ.25 వేలు, రూ.12,500, రూ.500 చొప్పున నగదు చెల్లింపులు స్వీకరించారు.
నిర్మాణాలు పూర్తైనా పంపిణీకి నోచని ఇళ్లు
శ్రీకాకుళం నగరంలో నిర్మించిన 1,904 గృహాల్లో 1,280 ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు అప్పగించినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అయితే విద్యుత్, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, మరుగుదొడ్లు, సెప్టిక్ ట్యాంకులు వంటి మౌలిక వసతుల కొరత కారణంగా ప్రస్తుతం వాటిలో సుమారు 460 కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 3,536 గృహాలకు గాను 2,912 ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ వాటిలో అనేక గృహాలు ఇంకా లబ్ధిదారులకు పంపిణీ కాలేదు.
రూ.14 కోట్ల డిపాజిట్లు
టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం నగరంలో 4,384 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో 3,738 మంది వివిధ కేటగిరీల ఇళ్ల కోసం డీడీల రూపంలో మొత్తం రూ.14 కోట్ల మేర నగరపాలక సంస్థకు చెల్లించారు. రికార్డుల ప్రకారం 1,826 మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు కేటాయించినట్లు నమోదై ఉండటంతో వారికి రీఫండ్ వర్తించదు. అయితే 1,912 మందికి ఇళ్లు కేటాయించలేకపోవడంతో వారు చెల్లించిన డిపాజిట్ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది.
వైకాపా హయాంలో మారిన విధానం
2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ‘నవరత్నాలు’ కార్యక్రమంలో భాగంగా పట్టణ పేదలకు ఇళ్లు, స్థలాలు అందిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో టిడ్కో లబ్ధిదారుల జాబితాల్లో మార్పులు చేసి, కొందరికి టిడ్కో ఇళ్లు, మరికొందరికి జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు కేటాయించింది. టిడ్కో కోసం డిపాజిట్ చెల్లించిన లబ్ధిదారుల్లో అర్హులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో ఇళ్లు, స్థలాలు కేటాయించినప్పటికీ అందరికీ గృహాలు అందలేదు. కొందరు లబ్ధిదారులు బ్యాంకు రుణాలు తీసుకుని డిపాజిట్లు చెల్లించగా, ఇళ్లు మంజూరు కాకపోవడంతో రుణ చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొని డిఫాల్టర్ల జాబితాలో చేరిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
లబ్ధిదారుల్లో మిశ్రమ స్పందన
వైకాపా ప్రభుత్వం 2022లో టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించి పట్టాలు అందజేసినప్పటికీ గృహాల పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదు. మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత ఇళ్లు అందజేస్తామని ప్రకటించినప్పటికీ చివరకు పరిమిత సంఖ్యలో మాత్రమే కేటాయింపులు జరిగాయి. ఇప్పటికీ టిడ్కో ఇళ్లు కేటాయిస్తారనే ఆశతో ఎదురు చూసిన పలువురు లబ్ధిదారులు, ఇప్పుడు డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొందరు డబ్బులు తిరిగి రావడాన్ని స్వాగతిస్తుండగా, మరికొందరు ఇళ్ల కోసం చేసిన నిరీక్షణ వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






Comments