top of page

అమెరికా కోరల్లో కమ్యూనిస్టు క్యూబా!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 1 day ago
  • 2 min read

వెనిజువెలా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చి తమ దేశంలోని జైల్లో కూర్చోబెట్టారు. ఇరాన్‌పై సరైన కారణాలు లేకుండానే సైనిక చర్యకు తెగించి.. ఒక్క ఇరాన్‌నే కాకుండా మొత్తం ప్రపంచాన్నే సంక్షోభంలోకి నెట్టేశారు. ఇప్పుడు ఇరాన్‌తో యుద్ధం ముగిసినట్లేనని తనకు తానుగా ప్రకటించేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే నోటితో మరో బాంబు పేల్చారు. చిన్న దేశమైన క్యూబాపై అక్కసు వెళ్లగక్కారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకుంటామన్నారు. అగ్రరాజ్యం అధినేతనన్న విషయం మర్చిపోయి చిన్నదైనా ఒక స్వతంత్ర దేశాన్ని గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా క్యూబాను చిన్నబుచ్చేలా వాచాలత ప్రదర్శించారు. ఫ్లోరిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుతం క్యూబా సమస్యల్లో ఉందంటూ.. ముందుగా ఇరాన్ పని ముగించి అక్కడి నుంచి తిరిగి వచ్చే దారిలో తమ అతిపెద్ద విమానవాహక యుద్ధనౌక అయిన ‘MSS అబ్రహం లింకన’ను క్యూబా తీరానికి వంద గజాల దూరంలో పెడతామన్నారు. దాంతో వాళ్లు లొంగిపోకతప్పదన్నారు. క్యూబా వల్ల అమెరికా జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉన్నట్లు అమెరికా ప్రకటించింది. అక్కడి కమ్యూనిస్టు పాలన ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నదని అమెరికా ఆరోపిస్తోంది. ఇది ప్రాంతీయ అస్థిరతకు కారణమవుతున్నదని వాదిస్తున్నది. కాగా క్యూబాపై ఒత్తిడి పెంచడం ద్వారా లాటిన్ అమెరికాలో కమ్యూనిస్ట్ ప్రభావాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలన్నది ట్రంప్ ఆలోచనగా కనిపిస్తున్నది. అయితే క్యూబాపై ఇంతగా విరుచుకుపడుతున్న ట్రంప్ కోపానికి కారణమమేటిన్న చర్చ జరుగుతున్నది. ఈ విషయంలో ట్రంప్ కోపం అనేకంటే క్యూబాతో అమెరికాకు ఉన్న దీర్ఘకాల విరోధమే కారణమని చెప్పవచ్చు. చరిత్ర లోతుల్లోకి వెళితే దీనికి కారణాలు స్పష్టమవుతాయి. గత అరవై ఏళ్లుగా అమెరికా, క్యూబాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. అనేక విషయాల్లో రెండు దేశాలు తీవ్రంగా విభేదించుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత అమెరికా పాలకులు సైతం క్యూబాపై కారాలు మిరియాలు నూరేవారు. ఆ క్రమంలో ఇప్పుడు ట్రంప్ వంతు వచ్చింది. కాకపోతే అతివాద ధోరణి ఎక్కువగా కనబర్చే ట్రంప్ ఏకంగా క్యూబా పనిపడతామని, లొంగదీసుకుంటామని హెచ్చరించడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి క్యూబా ఏ విషయంలోనూ అమెరికాతో సరితూగలేదు. అది అమెరికాకు 90 మైళ్ల దూరంలో ఉన్న ఓ చిన్న ద్వీప దేశం. అంతకుముందు రెండు దేశాల మధ్య సాధారణంగానే ఉన్న సంబంధాలు కమÖ్యనిస్టు విప్లవంతో కయ్యంగా మారాయి. 1959లో కమ్యూనిస్టు విప్లవం విజయం సాధించగా.. ఫిడెల్ కాస్ట్రో నేతృత్వంలో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. ఈ పరిణామంతో అమెరికాతో క్యూబా సంబంధాలను తెగిపోవడం ప్రారంభమైంది. ఆ దేశంలో ఉన్న అమెరికా కంపెనీల ఆస్తులను క్యూబా ప్రభుత్వం జాతీయం చేసింది. దీనిపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా క్యూబాపై వాణిజ్య ఆంక్షలు విదించింది. దాంతో క్యూబా అప్పటి సోవియట్ యూనియన్(రష్యా)కు దగ్గరయ్యింది. రష్యన్ క్షిపణులను మోహరించేందుకు యత్నించడంతో అది తమ దేశ భద్రతకు ముప్పుగా అమెరికా భావించింది. ఈ కారణాలతో క్యూబాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా 1960 నుంచి వాణిజ్య ఆంక్షలు కొనసాగిస్తూ వస్తోంది. అమెరికాకు చెందిన ఏ కంపెనీ కూడా క్యూబాతో వ్యాపారం చేయకుండా నిషేధించారు. అలాగే క్యూబా నుంచి చక్కెర, సిగార్లు లాంటి వస్తువులను దిగుమతి చేసుకోవడం ఆపేశారు. అంతర్జాతీయ లావాదేవీల కోసం అమెరికన్ డాలర్లను వినియోగించకుండా క్యూబాపై నిషేధం విధించారు. దీంతో ఇతర దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవడం క్యూబాకు కష్టతరంగా మారింది. చివరికి విదేశీ మారకద్రవ్యం తగ్గిపోవడంతో పేదరికంలోకి జారుకుంది. అమెరికా టూరిస్టులు క్యూబాకు వెళ్లడంపై ఆంక్షలు విధించడంతో అక్కడి హోటల్, రవాణా, పర్యాటక రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు చమురు దిగుమతులు లేక ప్రధాన పవర్ ప్లాంట్లు కూడా ఆగిపోయి కరెంట్ లేక లక్షలాది మంది చీకట్లో మగ్గిపోతున్నారు. ఆధునిక వైద్య పరికరాలు, మందుల తయారీకి కావాల్సిన ముడి పదార్థాలకు కూడా అక్కడ ఏర్పడింది. క్యూబా తన ఆహార అవసరాల్లో 70 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నది. కానీ అమెరికా ఆంక్షల వల్ల వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యులకు ఆహారం దొరకడమే కష్టతరంగా మారింది. క్యూబాలో ఇప్పటికీ 1950ల నాటి పాత కార్లే కనిపిస్తుంటాయి. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు క్యూబాతో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు యత్నించారు. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఒబామా తీసుకున్న నిర్ణయాలు రద్దు చేసి క్యూబాను ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల లిస్టులో చేర్చారు. అమెరికాలోని ఫ్లొరిడాలో ఎక్కువగా క్యూబా నుంచి వలస వచ్చినవారు ఉంటారు. వీళ్లు కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు. అందుకే వీళ్ల ఓట్ల కోసం ట్రంప్ క్యూబాపై కఠినంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. క్యూబాను సైనికపరంగా స్వాధీనం చేసుకోవడానికి ముందు ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని ట్రంప్ అనుకున్నారు. దానివల్ల అక్కడి ప్రజలు తిరుగుబాటు చేసి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితులు రావాలన్న ట్రంప్ వ్యూహం. అక్కడ అమెరికాకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే లక్ష్యం. క్యూబాలో రష్యా తమ నిఘా స్థావరాలను ఏర్పాటు చేస్తున్నదని, అలాగే చైనా గూఢచారి కేంద్రాలను నడుపుతోందని అమెరికా అనుమానిస్తోంది. ఈ అనుమానాల నేపథ్యంలోనే క్యూబాను కూడా తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ట్రంప్ ప్రణాళికలు వేస్తున్నట్లు భావిస్తున్నారు. అందుకోసం ముందు ముందు క్యూబాను లొంగదీసుకోవడానికి ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో..సైనికచర్య వైపే మొగ్గుతారో చూడాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page