అమెరికాలో మనుగడ లేని మూడో పార్టీ!
- DV RAMANA

- Jul 8, 2025
- 2 min read

చాలా కాలం తర్వాత అమెరికాలో కొత్త రాజకీయ పార్టీకి అంకురార్పణ జరుగుతోంది. ప్రపంచ కుబేరుడు, నిన్నటిమొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితంగా ఉంటూ, ఎన్నికల్లో ఆయన్ను గెలిపించిన టెస్లా సంస్థ అధినేత ఎలన్ మస్క్ ది అమెరికా పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించడంతో అమెరికా ఎన్నికల వ్యవస్థపైకి ప్రపంచం దృష్టి మళ్లింది. ముఖ్యంగా మూడో రాజకీయ పార్టీ ఆ దేశంలో మనుగడ సాధించగలదా? అన్న చర్చ ప్రారంభమైంది. అయితే పార్టీ అధికారికంగా నమోదైనట్లు ఆ దేశ ఫెడరల్ ఎలక్టోరల్ కమిషన్ ఇంకా ధ్రువీకరించలేదు. అలాగే దానికి సంబంధించి ఎలాంటి పత్రాలనూ కమిషన్ నోటిఫై చేయలేదు. పార్టీని స్థాపిస్తున్నట్లు మస్క్ ప్రకటించినా పార్టీని ఎవరు నడిపిస్తారు.. దాని స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయనే విషయాలను ఆయన వెల్లడిరచలేదు. అన్ని లాంఛనాలు పూర్తి అయ్యి ది అమెరికా పార్టీని గుర్తిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించిన తర్వాతే అమెరికా రాజకీయ రంగంలో మూడో పార్టీ మనుగడలోకి వస్తుంది. పార్టీ వ్యవస్థాపకుడిగా ఎలన్ మస్క్ కు ఎంత పేరుప్రఖ్యాతులు ఉన్నా.. ప్రపంచ కుబేరుడైనా అవేవీ ఆయన పార్టీ మనుగడను నిర్దేశించ లేవని అక్కడి రాజకీయవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే అమెరికా రాజకీయ, ఎన్నికల వ్యవస్థలను పరిశీలిస్తే శతాబ్దాలుగా ఆ దేశ ప్రజలు రెండు పార్టీల వ్యవస్థనే గౌరవిస్తున్నారు. అమెరికా ఎన్నికల చట్టాలు బహుళ పార్టీ వ్యవస్థకు అనుమతిస్తున్నా.. ప్రజలు మాత్రం ఇప్పటి వరకు రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలను ఆదరిస్తున్నారు. ఫలితంగా ఆ రెండు పార్టీలే పరస్పరం పోటీ పడుతూ ఎన్నికల్లో గెలుపు ఓటములను శాసిస్తున్నాయి. ఒక్కోసారి ఒక్కో పార్టీ అధికారం చెలాయిస్తోంది. ఆ క్రమంలోనే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఆయనకు ముందు గత అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. అమెరికా చరిత్రలో ఇంతవరకు ఒకే ఒక్కసారి ఆ రెండు పార్టీలను కాదని ఇండిపెండెంట్ అభ్యర్థి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనే జార్జ్ వాషింగ్లన్. 1789లో ఎన్నికైన ఆయన 1797 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగి మంచి పేరు సంపా దించారు. ఆయన తప్ప మరెవరూ వ్యక్తిగతంగానూ, పార్టీలపరంగానూ ఎన్నికల్లో ప్రభావం చూపలేక పోయారు. అనేకమంది నాయకులు పార్టీలు ఏర్పాటుచేసి ఎన్నికల్లో పోటీ చేసినా ఆ రెండు పార్టీలను మాత్రం ఎదుర్కోలేకపోయారు. ఇంకా చెప్పాలంటే పెద్దగా ప్రభావమే చూపలేకపోయారు. ఒక్కసారి గతంలోకి వెళ్తే.. 1828లో ఏర్పాటైన యాంటీ మసానిక్ పార్టీని అమెరికా చరిత్రలో మొదటిసారి ఏర్పా టైన మూడో పార్టీగా చెప్పవచ్చు. మాసన్రీ సంస్కృతికి వ్యతిరేకంగా ఏర్పడిరది. 1840లో దాస్య వ్యవస్థను వ్యతిరేకిస్తూ లిబర్టీ పార్టీ, 1848లో బానిస విధానానికి వ్యతిరేకంగా ఫ్రీ సోయిల్ పార్టీ, 1850లో మైగ్రేషన్, క్యాథలిక్ వ్యతిరేక భావాలతో నో`నథింగ్ పార్టీ, రైతుల హక్కులు, ఫెడరల్ బ్యాంక్ సంస్క రణలు, ప్రత్యక్ష పద్ధతిలో సెనేటర్ల ఎన్నికలకు మద్దతుగా 1890లో పాపులిస్ట్ లేదా పీపుల్స్ పార్టీ, 1912లో సామాజిక న్యాయం, కార్మిక హక్కులు అజెండగా థియోడర్ రూజ్‌వెల్ట్ సారధ్యంలో ప్రొగ్రెసివ్ పార్టీ, 1901లో సోషలిస్ట్ పార్టీ, 1971లో లిబరేషన్ పార్టీ, 1990లో గ్రీన్ పార్టీ, 1995లో రిఫార్మ్స్ పార్టీ వంటి కొన్ని ప్రత్యేక అజెండాలతో ఏర్పాటై ఎన్నికల్లో పాల్గొన్న పెద్ద ప్రభావం చూపలేకపోయాయి. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. వీటిలో మూడంటే మూడు పార్టీలే కొంత ప్రభావం చూపించి రెండు ప్రధాన పార్టీల ఓట్లన చీల్చగలిగాయి. అయితే అవి ఎన్నికల ఫలితాన్ని శాసించదగ్గ స్థాయిలో లేకపోవడంతో ఆ పార్టీలు మనుగడ సాగించలేక కాలగమనంలో కలిసిపోయాయి. 1912 అధ్యక్ష ఎన్నికల్లో ప్రొగ్రెసివ్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేసిన థియోడర్ రూజ్‌వెల్ట్ మాత్రమే ఈ థర్డ్ పార్టీలన్నింటిలోకి అత్యధికంగా 27 శాతం ఓట్లు సాధించగలిగారు. ఆయన తర్వాత 1992 ఎన్నికల్లో రిఫార్మ్ పార్టీ నుంచి పోటీ చేసిన రాస్ పెరోట్ 19 శాతం ఓటు బ్యాంక్ సంపాదించారు. కాగా 1968లో ఇండిపెండెంట్ పార్టీ అభ్యర్థి జార్జ్ వాలెస్ ఐదు రాష్ట్రాల్లో విజయం సాధించారు. 2000 ఎన్నికల్లో గ్రీన్ పార్టీ అభ్యర్థి రాల్ఫ్ నాడర్‌కు డెమోక్రాట్ల ఓటు చీల్చారనే వాదన ఉంది. 2024లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్‌ఎఫ్‌కే జూనియర్ కర్నల్ వెస్ట్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎలాన్ మాస్క్ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరం. మస్క్ దక్షిణాఫ్రికాలో జన్మించినందున అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హుడు కావడం అతిపెద్ద అవరోధంగా మారనుంది.










Comments