అమెరికా సాంకేతిక ఆధిపత్యానికి సవాళ్లు!
- DV RAMANA

- 3 days ago
- 2 min read

అభివృద్ధి, ఆధిపత్యం ఏ ఒక్కరి సొంతం కాదు. దాన్ని కాపాడుకోగలిగేవారి చెంతనే అవి ఉంటాయి. లేకపోతే కొత్తనీరొచ్చి పాత నీటిని తరిమేసినట్లు, ఆదరించేవారిని వెతుక్కుంటూ వలసపోయినట్లు ఇప్పుడు అగ్రదేశంగా భాసిల్లుతున్న అమెరికా నుంచే మేథో వలసలు మొదలయ్యాయి. ఈ పరిణామాలకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలే కారణమని చెప్పకతప్పదు. నిన్నటి వరకు అమెరికా వైపు చూసినవారే ఇప్పుడు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. ఒకప్పడు ఐరోపా దేశాలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటే.. ఆ దేశాల ప్రగతిని, విజ్ఞానాన్ని లాగేసుకుని అగ్రదేశం స్థాయికి చేరింది. ఇప్పుడు ఆ సీన్ రిపీట్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒకనాడు పారిశ్రామిక విప్లవంతో తన దిశను మార్చుకున్న యూరప్ మత గోడలను బద్దలుకొట్టుకుని సంపన్న దేశాలుగా అభివృద్ధి చెందాయి. ఆధునిక శాస్త్ర సాంకేతిక యుగం, యూరప్ వైజ్ఞానిక విప్లవం. ఆపారంగా పోగుపడిన సంపద, వలసల కోసం సముద్రాధిపత్యం, సాంస్కృతిక పునరుజ్జీవనాలు కలిసి యూరప్‌లో ప్రపంచం ఎన్నడూ ఎరగని కొత్త శాస్త్ర సాంకేతిక శకాన్ని ఆవిష్కరించాయి. ఆవిరి యంత్రాలు, విద్యుత్తు మోటార్లు, రైళ్లు, విమానాలు, నౌకలు ప్రజాజీవనాన్ని సమూలంగా మార్చేశాయి. ఫలితంగా యూరప్ ప్రపంచాధిపత్య స్థానానికి చేరుకుంది. కానీ అంతలోనే ప్రపంచ యుద్ధాలను నెత్తికెత్తుకొని చతికిలపడటంతో ఆ హోదాను కాస్త అమెరికా తన్నుకుపోయింది. ప్రస్తుతం శాస్త్ర విజ్ఞానమంతా అమెరికా గుప్పిట్లో ఉంది. అణుశక్తి నుంచి అంతరిక్ష విజ్ఞానం వరకు, సమాచార సాంకేతికత నుంచి కృత్రిమమేథ వరకు, ఆధునిక వైద్యం నుంచి రోబోటిక్స్ వరకు అమెరికాకు ఎదురులేదు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో సింహభాగం ఆ దేశంలోనే ఉన్నాయి. అనేక దేశాలకు చెందిన సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు వాటిలోనే ఉన్నారు. నోబుల్ అవార్డులు అందుకుంటున్నవారిలో సగానికి సగం అమెరికన్లే. 2023 లెక్కల ప్రకారం పరిశోధనలకు అమెరికా చేస్తున్న ఖర్చు 834 బిలియన్ల డాలర్లు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేశం అనుభవిస్తున్న ఆధిపత్య హోదా దాని వైజ్ఞానిక శక్తిపైనే ఆధారపడి ఉంది. అమెరికాతో ఎవరూ పోటీ పడలేరని, కనీసం దాని దరిదాపులకు కూడా వెళ్లలేరని అందరూ అనుకున్నారు. కానీ తాజా పరిణామాలు చూస్తే పరిస్థితి ఉల్టా అయ్యేలా ఉంది. దాని సంకుచితత్వం, పెత్తందారీ విధానం, ఆర్థిక మాంధ్యం, విదేశీ సంబంధాలు, రాజకీయ దృక్పథం.. ఇలా అన్ని అంశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమెరికా అగ్రస్థానానికి ఎసరు పెట్టే పరిస్థితి నెలకొంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ మార్పు కనిపిస్తోంది. ఆయన జమానాలో వెయ్యి శాస్త్ర సాంకేతిక సంస్థలకు నిధులు నిలిచిపోయాయి. జాతీయ క్యాన్సర్ సంస్థ బడ్జెట్ కేటాయింపుల్లో 30 శాతం కోత పడిరది. నాలుగువేల పరిశోధనలకు గ్రాంట్లు నిలిచిపోయాయి. చివరికి 2023లో నోబుల్ అవార్డు సంపాదించి పెట్టిన ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ ప్రాజెక్టు కూడా ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. ఇక హెచ్‌ఐవీ, టీబీ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులపై పరిశోధనలు క్రమంగా అటకెక్కుతున్నాయి. దాంతో జాన్ హాప్కిన్స్‌లాంటి గొప్ప విశ్వవిద్యాలయం నుంచి సైతం విద్యార్థులు ఆక్స్‌ఫర్డ్ వంటి ఇతర దేశాల వర్సిటీలకు క్యూ కడుతున్నారు. దాదాపు 1.50 లక్షల విద్యార్థులు అమెరికాకు మొహం చాటేస్తున్నారని గార్డియన్ పత్రిక పేర్కొంటే.. దీనివల్ల ఏడు బిలియన్ల డాలర్లు నష్టమని ఫోర్బ్స్ పత్రిక అంచనా వేసింది. మరోవైపు చైనా తన విద్యార్థులందరినీ విదేశాల నుంచి వెనక్కి రప్పించుకుంటోంది. బయోసైన్సు, రసాయన శాస్త్రం, భౌతిక, భూపర్యావరణ, ఆరోగ్య శాస్త్రాల పరిశోధనల్లో చైనాతో సరితూగే దేశం ఏదీ లేదు. పరిశోధన రంగంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని చైనా సైన్సు అకాడమీ ఇప్పటికే వెనక్కి నెట్టేసింది. 2015నాటికే చైనాలో ఓ డజను వరకు ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలున్నాయి. వైజ్ఞానిక పరిశోధన రంగానికి చైనా అమెరికాను అధిగమించే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది. ప్రపంచ స్థాయిలో ఉత్తమంగా ప్రమాణీకరించదగ్గ పరిశోధన పత్రాల్లో 27.2 శాతం చైనావే. ఆ దేశ పరిశోధన రంగం బడ్జెట్ కూడా 780.7 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. ఇది ప్రతి ఏటా 8.7 శాతం మేరకు పెరుగుతోంది. అదే అమెరికా పెరుగుదల మాత్రం 1.7 శాతానికి మించి లేదు. అత్యాధునికి శాస్త్ర పరిశోధన రంగాల్లోనూ చైనా దూకుడు కనిపిస్తోంది. శాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఏఐ ఇండెక్స్ రిపోర్టు(2023) ప్రకారం కృత్రిమ మేథ పరిశోధన పత్రాల్లో 40 శాతం చైనావి కాగా అమెరికా వాటా పది శాతం మాత్రమే. క్వాంటం రీసెర్చ్, సెమీ కండక్టర్స్, బ్రాడ్‌బ్యాండ్ ఇన్ఫర్మేషన్, నానో మెటీరియల్స్, స్మార్ట్ రోబోస్ ఫ్యూయల్ సెల్స్, కాస్మిక్ డిటెక్టర్స్‌లాంటి రంగాల్లో పరిశోధనలను కేంద్రీకరించేందుకు 15వ పంచవర్ష ప్రణాళికలో పుష్కలంగా నిధులు అందించాలని నిర్ణయించింది. దాంతో ప్రపంచంలోనే పరిశోధనా రంగానికి అత్యధిక పెట్టుబడులు పెట్టే దేశంగా చైనా అవతరించనుంది. మరి ఒకప్పుడు చైనాతో సమఉజ్జీగా ఉన్న భారతదేశం ఈ నూతన శాస్త్ర సాంకేతికత పోటీలో ఎక్కడుంది? మనకు మనం ఎన్ని బడాయిలు చెప్పుకున్నా ప్రపంచం మాత్రం మన వైపు చూడ్డం లేదన్నది సత్యం! సైన్స్‌ను పూర్వపక్షం చేస్తున్నాం. డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యపుస్తకాల నుంచి ఎత్తి వేయడమే అందుకు నిదర్శనం. పరిశోధన రంగానికి బడ్జెట్‌లో ఆర్ధిక కేటాయింపులు కూడా నామమాత్రమే. విగ్రహాలకు, కుంభమేళాలకు, అశాస్త్రీయ ధోరణులకు, పరమత ద్వేషాగ్ని రగిల్చేందుకు, దేశాభివృద్ధికి ఉపకరించని నిధులు వెచ్చిస్తూ మన ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు వ్యక్తులను ప్రపంచస్థాయి కుబేరుల వరుసలో చేరుస్తోంది. ఆర్ధిక అంతరాలతో పేదరికాన్ని మరింత పెంచేస్తుంది. ఈ నేపథ్యంలో మనం వెనుకబడుతున్నాం.










Comments