top of page

అమరావతి రైతుల అభ్యంతరాలు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jul 9, 2025
  • 2 min read

వైకాపా పాలనలో మూలనపడిన రాజధాని అమరావతి నిర్మాణం.. ఎన్డీయే కూటమి సర్కారు అధి కారం చేపట్టిన తర్వాత మళ్లీ పట్టాలపైకి ఎక్కింది. దీనిపై ఉన్న రాజకీయ వివాదాలు, కొందరు నిపు ణుల అభ్యంతరాలు పక్కనపెడితే ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో మళ్లీ మొదలుపెట్టిన భూ సమీకరణ వివాదాస్పదమవుతోంది. గతంలో చంద్రబాబు సర్కారు అధికారంలో ఉన్నప్పుడు నిపుణుల సూచనలు, హెచ్చరికలను పట్టించుకోకుండా ఏకపక్షంగా ఏటా మూడు పంటలు పండే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారు. అందుకోసం రైతుల నుంచి సారవంతమైన 34 వేల ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిలో సేకరించారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయంగా నివాస స్థలాలు, భూమిని బట్టి కొంత జీవన భృతి చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను తెరపైకి తెచ్చి అమరావతి కేవలం శాసన రాజధానిగా ఉంటుందని చెప్పి గత టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన పనులను మూలన పడేసింది. అయితే గత ఏడాది మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజ ధానిగా ఉంటుందంటూ.. పాత నిర్మాణ పనుల బూజు దులపడం మొదలుపెట్టింది. మరోవైపు అనేక సంస్థలకు ప్రభుత్వం వరుసపెట్టి భూములు కేటాయిస్తూ, ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. అదే సమ యంలో అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని హంగులు అద్దాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసం అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ, ఏఐ సిటీ, స్పోర్ట్స్‌ విలేజ్‌, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. అలాగే నిర్మాణల కోసం ప్రపంచ బ్యాంకు, జర్మన్‌ బ్యాంకు, హడ్కో నుంచి వేల కోట్లు నిధులు రుణంగా తీసుకున్నారు. మారిన ప్రాధాన్యతల వల్ల ఇప్పటికే సేకరించిన 34 వేల ఎకరాలు సరిపోవంటూ మరో 44 వేల ఎకరాలు సేకరిస్తామంటూ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే సేకరించిన 34 వేల ఎకరాలే ఎక్కువని, ఇప్పుడు మళ్లీ దానికి మించి భూసేకరణ ఎందుకన్న విమర్శలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. అయినా ప్రభు త్వం వాటిని ఖాతరు చేయకుండా రెండో దశ భూ సమీకరణకు కేబినెట్‌ ఆమోదముద్ర వేయించుకుని రంగంలోకి దిగింది. భూసమీకరణ చేయాల్సిన ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహిస్తోంది. ఇక్కడే కొత్త సమస్య ఎదురవుతోంది. ఊహించని విధంగా రైతుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. గతంలో ఇదే చంద్రబాబు పిలుపుతో రైతులు స్వచ్ఛందంగా 34వేల ఎకరాలను ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అమరావతి గ్రామాల్లో అదనపు భూ సమీకరణపై అభ్యంతరాలు, నిరసనలు వెల్లువెత్తు తున్నాయి. దాంతో గ్రామసభల్లో పాల్గొంటున్న మంత్రులు, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు రైతులకు నచ్చజెప్ప లేక సతమతం అవుతున్నారు. పదేళ్ల క్రితమే రాజధాని కోసం సేకరించిన భూములను అభివృద్ధి చేయ కపోవడం, తమకు ప్లాట్లు, భృతి అందకపోవడం వంటి సమస్యలను ప్రస్తావిస్తున్న రైతులు మళ్లీ భూము లు ఇచ్చి నష్టపోలేమని రైతులు తెగేసి చెబుతున్నారు. ఇప్పుడు మీరు భూములు తీసుకుంటే.. రేపు వచ్చే ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్న గ్యారెంటీ ఏమిటని నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు గత గురువారం నుంచి మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో గ్రామ సభలు నిర్వహిస్తు న్నారు. ప్రభుత్వానికి భూములు ఇస్తామంటూ ఈ సభల్లోనే తీర్మానం చేయాల్సి ఉంటుంది. అప్పుడే ప్రభుత్వం భూములు సేకరించగలుగుతంది. కొందరు రైతులు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నప్ప టికీ.. మెజారిటీ రైతులు మాత్రం భూములు ఇచ్చేదిలేదని మొండికేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రామసభ లకు వచ్చిన మంత్రుల ముఖం మీదే చెప్పేస్తున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జనసేన, బీజేపీలు అదనపు భూసమీకరణ విషయంలో మౌనం పాటిస్తుండటం గమనార్హం. గతంలో అమరావతి నిర్మాణానికి మద్దతుగా, రైతుల ఉద్యమాలకు అండగా నిలిచిన ఆ పార్టీలు ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నా కూడా రెండోదశ భూ సమీకరణపై స్పందించడంలేదు. కేబినెట్‌ ఆమోద ముద్రతో ఆ పార్టీలు కూడా అంగీకరించినట్లు కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో రైతులను ఒప్పించడం, గ్రామసభల నిర్వహణలో ఒక్క తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలే పాల్గొంటున్నారు. జనసేన, బీజేపీ క్యాడర్‌ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఈసారి భూసమీకరణ అంత సులువేమీ కాదని, ఆ రెండు పార్టీలు కూడా కలిసివస్తే రైతులకు నమ్మకం పెరుగుతుందని అంటున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page