అయిపోయిందా పాలు తీత.. రోడ్డుపై మేత!
- SATYAM DAILY
- Aug 5
- 3 min read
ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న పశువులు
విద్యార్థులపై తిరగబడుతున్న ఆవులు
కనీసం పట్టించుకోని కాపరులు
చర్యలకు ఉపక్రమించిన నగరపాలక సంస్థ అధికారులు
ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరిస్తున్న యజమానులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఇక్కడ కనిపిస్తున్నది మండలవీధి జంక్షన్ దాటిన తర్వాత ట్రైనింగ్ స్కూల్, బాలికోన్నత పాఠశాలకు వెళ్లే రోడ్డు. దానిపై ఉన్నది ఆవులు అంతేకదా.. అనిపిస్తుందా మీకు. చూడ్డానికి చిన్న సమస్యలాగే ఉంది. కానీ నగరంలో ఇదొక పెద్ద తీర్చలేని బాధ. మున్సిపల్ యంత్రాంగం కాస్త చొరవచూపి చర్యలు తీసుకుందామంటే రాజకీయ గణం అడ్డొస్తోంది. పశువులకు ఓట్లు లేకపోవచ్చు. కానీ దాని కాపర్ల పేరిట ఓ కుటుంబం ఉంటుంది. వారికి ఓటు ఉంటుంది. రోడ్డుపై అడ్డంగా పడివున్న పశువులను బందలదొడ్డికి తరలిస్తే అంతుచూస్తామని స్వయంగా మున్సిపల్ యంత్రాంగాన్నే బెదిరించేంతటి రాజకీయం దీని వెనుకుంది. నడిరోడ్డు మీద వాహన చోదకుడు ఏమైపోయినా ఫర్వాలేదు. పశువులను మాత్రం కదల్చడానికి వీళ్లేదు. ఇలా ఉంది నగరంలో వీరి పరిస్థితి.
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా పశువులు రోడ్డుపై తిష్టవేస్తున్నాయి. పాలుపితకడం అయిపోయిన వెంటనే కనీసం కొన్నింటికి మెడకు ఉన్న కన్ని కూడా విప్పకుండా వాటి యజమానులు అలాగే వదిలేసినట్టున్నారు. అసలే స్కూల్‌కు వెళ్లే సమయం, అందులోనూ ఆఫీసులకు వెళ్లేవారు టౌన్‌లోకి వచ్చేవేళ. ఇరుకు రోడ్డు, ఆపై రోడ్డు ఆక్రమించుకొని తిష్టవేసిన పశువులు. వీటిని దాటి వెళ్లే సమయంలో అవి పొడిచేస్తామన్నట్టు తలూపడం. వీటి గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.
కనీసం ఆహారం వేసే దిక్కులేదు
శ్రీకాకుళం నగరంలో పశువుల పెంపకందార్ల గురించి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఉదయం, సాయంత్రం వేళల్లో పాలు పితకడం, తిరిగి ఊరిమీదకు వదిలేయడం తప్ప, వాటి సంరక్షణ, ఆహారం వేసే దిక్కు లేదు. ఇంకా చెప్పాలంటే కనీసం పెంచుతున్నామని చెబుతున్న పశువుల యజమానులు వాటికి కనీసం నీరు కూడా పొయ్యని పరిస్థితి. దీంతో అవి రోడ్లపై పడి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించడంతో పాటు పలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నగరంలో ఎక్కడైతే రోడ్ల పక్కన ఫుడ్‌స్టాల్స్ ఉన్నాయో వాటికి దగ్గరలో ఉన్న డస్ట్‌బిన్లు ఒకరోజులో మూడు పూటలు నిండిపోతుంది. మున్సిపల్ యంత్రాంగం కేవలం ఏదో ఒకపూట మాత్రమే దాన్ని క్లియర్ చేస్తారు. మిగిలిన రెండుపూటలు ఇందులో మిగిలిన ఆహారాన్ని, ఎంగిలి ఆకులను (పాలిథిన్ కవర్లతో సహా) పశువులు తింటున్నాయి. బహుశా సంప్రదాయ చిట్టు, తవుడు, కుడితి వంటివి తినిపించడం కంటే రోడ్డు మీద పడి తినడం వల్ల ఎక్కువ పాలు ఇస్తున్నాయేమో తెలియదు గానీ, పాలు పితికిన వెంటనే వీటిని రోడ్లపైకి వదిలేస్తున్నారు. నగరంలో మెయిన్‌రోడ్లలో అయితే ఆవులు, మిగిలిన రోడ్లలో గేదెలు, ఖాళీ స్థలాల్లో పందులు కార్పొరేషన్‌లో ఆల్‌ఫ్రీ బతుకును వెలగబెడుతున్నాయి.

రోడ్లపైనే మేపుతున్న భక్తులు
ఈమధ్యకాలంలో చాగంటి కోటేశ్వరరావు, గరికిపాటి నరసింహారావు లాంటివారి ప్రవచనాలు ఎక్కువగా ప్రాచుర్యంలోకి రావడం వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో భక్తి రోడ్లపైన పొంగి ప్రవహిస్తోంది. ఇందులో ఏ పాపం పోవాలంటే ఏ జీవికి ఏ తరహా ఆహారం పెట్టాలో ఒక జాబితా ఉంది. ఆ మేరకు గ్రహదోషాలు పోగొట్టుకోడానికి, చేసిన పాపాలు పోవడానికి అన్నట్టు ఆవులకు రకరకాల మేతలు పెట్టే భక్తులు ఎక్కువైపోయారు. దీంతో ఇదే బాగుందని యజమానులు వదిలేస్తున్నారు. ముందురోజు ఆహారం దొరికిన స్థలం వద్దే మరుసటి రోజు పశువులు పాగా వేస్తున్నాయి.
నగరపాలక అధికారులపై తిరుగుబాటు
ఈ నేపథ్యంలో రోడ్లపై విచ్చలవిడిగా సంచరించే, లేదా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న పశువులను నగరపాలక సంస్థ ఆదేశాల మేరకు పట్టుకుంటున్నారు. పశువుల యజమానుల నుంచి ఫైన్ కట్టించుకొని లేదా వారిని మందలించి విడిచిపెడుతున్నారు. కొందరు ఎవరికోసం విడిచిపెట్టరు అని కనీసం వాటిని విడిపించుకునే ప్రయత్నాలు కూడా చేయడంలేదు. దీంతో పట్టుకున్న పశువులను మేపలేని పరిస్థితి నగరపాలక అధికారులకు ఎదురవుతోంది. ఇదిలా ఉంటే రోడ్డుపై విచ్చలవిడిగా తిరుగుతూ ఇబ్బంది కలిగిస్తున్న పశువులను నగరపాలక సంస్థ నియమించిన సిబ్బంది పట్టుకుంటున్న సమయంలో ఆయా పశువుల యజమానులు వారిపై తిరగబడటం, లేదా అధికారులనే బెదిరించే స్థాయికి ఎదిగిపోయారు. ఏమంటే ప్రతీ చిన్న విషయానికీ ఎమ్మెల్యే పేరు వాడుకోవడం వీరికి కూడా పరిపాటైపోయింది.
కనీసం కానిస్టేబుల్ కూడా ఉండరు
ఇక నగరంలో ఉదయం, సాయంత్రం అత్యంత రద్దీగా ఉండే రోడ్డు.. ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతం ఉమెన్స్ కాలేజీ రోడ్డు. సూర్యమహల్ నుంచి ఉమెన్స్ కాలేజీ రోడ్డు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 వరకు, అలాగే సాయంత్రం 3.30 నుంచి 4.30 వరకు సైకిల్‌పై రాకపోకలు సాగించాలన్నా ఇబ్బందిగా ఉండే సమయం. అందులోనూ ఇక్కడ కార్పొరేట్ స్కూల్స్ బస్సులు కూడా రోడ్డుపైనే నిలుపుతారు. ఇదే రోడ్డులో ప్రభుత్వ పాఠశాలలు, ఉమెన్స్ కాలేజీ కూడా ఉన్నాయి. కనీసం పాఠశాలలకు విద్యార్థులు వెళ్లినప్పుడు ఒక గంట, వచ్చే సమయంలో కనీసం అరగంట ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి ఆ శాఖ నుంచి ఒక్క కానిస్టేబుల్ కూడా ఇక్కడ కనిపించరు.
ఇప్పటికైనా రోడ్లపై విచ్చలవిడిగా సంచరించే పశువుల విషయంలో నగరపాలక అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు. ప్రతీ చిన్న విషయానికీ ఎమ్మెల్యే పేరు వాడుతున్న నేపథ్యంలో ఇటువంటి వాటిపై ఎమ్మెల్యే కూడా స్పందించి, పశువుల యజమానులను హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేయాలని, లేదంటే తామేమీ చేయలేమని అధికారులు వాపోతున్నారు. ఇక స్కూల్స్‌కు వెళ్లే సమయం, అలాగే విడిచిపెట్టేటప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఈ రోడ్డుపై గస్తీ నిర్వహించాలని, ట్రిపుల్ రైడిరగ్‌లు, స్కూల్స్ వద్ద ఆకతాయిలతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు.










Comments