అరికట్టాల్సినవారే అవినీతిపరులుగా!
- NVS PRASAD

- Jun 16
- 2 min read
ఈ శాఖకూ పాకిన మంత్లీల దుస్సంప్రదాయం
అటువంటి ఉదంతమే విశాఖలో వెలుగులోకి
రాజకీయ ప్రాపకంతో ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట
కింది స్థాయిలో మూకుమ్మడి బదిలీలు
వారి స్థానంలో కొత్తవారు రాక ఏసీబీ ఖాళీ

అవినీతి అధికారుల భరతం పట్టడమే లక్ష్యంగా ఏర్పాటైన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లో కూడా అవినీతికి పాల్పడే అధికారులున్నారన్న విషయం ఆలస్యంగానైనా ప్రభుత్వానికి అర్థమైంది. పోలీస్ శాఖ వారికి పునరావాస కేంద్రంగా భావించే ఏసీబీకి కూడా అవినీతి చెదలు పట్టాయని సాక్ష్యాత్తు ఆ శాఖ ఉన్నతాధికారులే అంచనాకు వచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే కొద్ది రోజలు క్రితం ఏపీ రీజియన్ పరిధిలో శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు ఏసీబీలో ఐదేళ్లకు మించి పని చేస్తున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ క్యాడర్ ఉద్యోగులను ఒకేసారి బదిలీ చేశారు. ఏసీబీలో సుదీర్ఘ కాలంగా పాతుకుపోయిన ఉద్యోగులను ఇంత పెద్ద ఎత్తున.. అది కూడా విద్యాసంవత్సరం ప్రారంభమైన తర్వాత బదిలీలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రాష్ట్రంలో ఏసీబీ వ్యవస్థాగతంగా ఏపీ, సెంట్రల్, రాయలసీమ రీజియన్ అనే విభాగాలుగా పని చేస్తుంది. ఇందులో శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు ఆంధ్రప్రదేశ్ రీజియన్ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ రీజియన్‌లోనే పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. ఎవర్నీ దేబరించకుండా రైట్‌రాయల్‌గా సొమ్ము వసూలుచేయడం ఇటీవల ఏసీబీకి పరిపాటిగా మారింది. లంచం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే విషయంలో ఇంతకుముందున్న మార్గదర్శకాలను కఠినతరం చేయడంతో అవినీతి నిరోధక శాఖలో ఇటీవల రైడ్‌లు తగ్గిపోయాయి. దీనికి తోడు కొన్ని శాఖలపై ఏసీబీ పూర్తిగా దృష్టి సారించడం మానేసింది. దానికి కారణం.. మంత్లీల కింద ఈ శాఖల నుంచి ఏసీబీ అధికారులకు అడగకుండానే పంపించేస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా విశాఖపట్నంలో ఇటువంటి వ్యవహారం వెలుగుచూడటంతో రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీలో రాజకీయ ప్రాపకంతో తిష్ట వేసుక్కూర్చున్న ఉద్యోగులపై దృష్టి సారించాల్సి వచ్చింది. కొన్నాళ్ల క్రితం విశాఖపట్నంలో నకిలీ నోట్లు మార్పిడి చేస్తూ దొరికిపోయిన ఒక మహిళా రిజర్వ్ ఎస్సై ఆ తర్వాత రీపోస్టింగ్ తెచ్చుకున్నారు. ఇటీవల విశాఖపట్నంలో ఓ ప్రాంతంలో ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆమె ఫోన్ చేసి తాను ఏసీబీ నుంచి మాట్లాడుతున్నానని, ఈ నెల మంత్లీ ఇంకా పంపలేదేమంటూ సబ్‌రిజిస్ట్రార్‌ను ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. ఏసీబీలో కూడా మంత్లీలు ఉంటాయని బయటి ప్రపంచానికి తెలిసింది. దీనివల్ల ఏసీబీ ప్రతిష్ట మసకబారుతోందని భావించిన ఉన్నతాధికారులు ఏలూరు నుంచి శ్రీకాకుళం వరకు పాతుకుపోయిన ఉద్యోగులను ఎత్తి అవతల వేశారు.
అమలు కాని నిబంధనలు
వాస్తవానికి ఏసీబీలోకి బదిలీ కావాలని ఎప్పట్నుంచో అనేకమంది పోలీసులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ రాజకీయ పలుకుబడితో పాతవారే కొనసాగుతుండటం వల్ల వీరికి అవకాశాలు రావడంలేదు. నిబంధనల ప్రకారం అధికారులు మూడేళ్లకు మించి, కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగులు ఐదేళ్లకు మించి ఏసీబీలో పని చేయకూడదు. పరిచయాలు పెరగడం వల్ల అవినీతికి ఆస్కారం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. కానీ చాలాకాలంగా ఇది అమలుకాలేదు. అందుకే విశాఖపట్నంలో కొన్ని ప్రభుత్వ శాఖల నుంచి మంత్లీ సంస్కృతి మొదలైంది. అయితే వాటిని పంచుకోవడంలో తేడాలు రావడం వల్ల విషయం బయటకు పొక్కి పత్రికలకెక్కింది. పోలీస్ శాఖలో నిజాయితీపరులుగా, పనిమంతులుగా పేరొందినవారిని ప్రత్యేకించి ఈ విభాగంలోకి తీసుకుంటారు. అలాగే పోలీస్ శాఖ నుంచి డిప్యూటేషన్ మీద కూడా వస్తుంటారు. క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీస్ సిబ్బంది నిత్యం ఏదో ఒక విచారణ లేదా దర్యాప్తు కోసం ప్రభుత్వ శాఖలకు వెళ్లడం పరిపాటి. దీన్ని ఆసరాగా తీసుకొని కొందరు అధికారులు సంబంధిత ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి లంచాలు వసూలు చేస్తుంటారనే ఆరోపణలున్నాయి. విశాఖపట్నంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది.
ఇక్కడ అవినీతిపై అడిగేవారే లేరు!
ప్రభుత్వ విభాగాల అధికారులపై ఆరోపణలు వస్తే వెంటనే విచారణ జరిపి చర్యల కోసం సిఫార్సులు చేసే ఏసీబీ అధికారులపై ఆరోపణలొస్తే మాత్రం ఎటువంటి చర్యలూ లేకపోవడంతో ఈ విభాగం పునరావాస కేంద్రంగా తయారైంది. ప్రస్తుతం ఎన్నికలు వంటి హడావుడి లేనందున ఈ శాఖలో పని చేయడం కంటే యూనిఫామ్ ఉండే విభాగాల్లో పని చేస్తే నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చనే భావనతో ఏసీబీ డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ లాంటి పోస్టులకు ఎవరూ దరఖాస్తు చేసుకోవడంలేదు కానీ, వాస్తవానికి ఇది డిమాండ్ ఉన్న పోస్టే. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం, ఉపరవాణా శాఖాధికారి కార్యాలయాల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు గానీ, లంచం తీసుకుంటుండగా దొరికే ట్రాప్ కేసులు గానీ పెద్దగా ఉండవు. కారణం అందరికీ తెలుసు. అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలున్న ఏసీబీ ఉద్యోగులపై విచారణ చేపట్టాల్సిన ఉన్నతాధికారులు ప్రస్తుతానికి బదిలీతో సరిపెట్టారు. అంటే మళ్లీ మాతృశాఖకు వీరు వెళ్లిపోతున్నారు. బీసీ ఉపకార వేతనాల కుంభకోణంలో అప్పటి ఏసీబీ అధికారులు కొందరి పాత్రపై ఏసీబీ హెడ్ ఆఫీస్‌కు ఫిర్యాదులు వెళ్లినా వారిని ఇంకా ఏసీబీలోనే కొనసాగించడం కొసమెరుపు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు జరిగిన బదిలీల్లో ప్రస్తుతం శ్రీకాకుళం ఏసీబీలో ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లకు బదిలీ అయింది. విజయనగరంలో ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్‌కు బదిలీ కాగా విశాఖపట్నంలో ఒక అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, ముగ్గురు సీఐలు మాత్రమే ఏసీబీలో మిగిలారు. ప్రస్తుతం కొత్తవారితో ఏసీబీని ఎలా పరుగులు పెట్టిస్తారో చూడాలి.










Comments