అర్ధరాత్రి నగరంలో చోరీ
- BAGADI NARAYANARAO

- May 10
- 1 min read
బంగారం, నగదు అపహరణ
(సత్యంన్యూస్, శ్రీకాకుళం రూరల్)

రూరల్ మండలం పరిధిలోని ఖాజీపేట పంచాయతీ లక్ష్మీనగర్ కాలనీ అజంతా గార్డెన్ గ్రూప్ హౌస్‌లోని ఓ ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ చోరీలో అర్జల గురుమూర్తి ఇంట్లో ఉన్న 15 తులాల బంగారం, రూ.20 వేలు నగదు అపహరణకు గురైనట్టు బాధితుడు రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళ్తే..
ఈ నెల 6న గురుమూర్తి కుటుంబ సమేతంగా పలాస నియోజక వర్గంలోని ఉంకులూరులోని మేనకోడలు వివాహ వేడుకకు వెళ్లారు. వివాహ వేడుక ముగించుకుని తిరిగి కుటుంబ సమేతంగా శనివారం ఉదయం 7 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చి చూడగా ప్రధాన ద్వారం ధ్వంసం చేసి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బెడ్రూమ్ తలుపులు తెరిచి ఉంది. ఆ గదిలో ఉన్న బీరువా తెరిచి బట్టలు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో భద్రపరిచిన సుమారు 15 తులాల బంగారంతో పాటు, రూ.20వేలు నగదు చోరీకి గురైందని గుర్తించి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ పైడపునాయుడు, రూరల్ ఎస్‌ఐ రాము సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆధారాల కోసం క్లూస్ టీమ్‌ను పిలిపించి వేలిముద్రలను సేకరించారు. సీసీ కెమెరాను పరిశీలించగా, ఓ దుండగుడు గోడ దూకి ఇంటి తాళాలు బద్దలుకొట్టి చోరీకి పాల్పడినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్‌ను సేకరించి నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు.










Comments