అలా చేస్తే..రైతు నిజంగా రాజే!
- DV RAMANA

- Dec 12, 2025
- 3 min read

ఒక రైతు స్వయంగా ఉల్లి పంట పండిరచడమే కాకుండా.. దాన్ని అమ్ముకోవడానికి వ్యాపారి అవతారం కూడా ఎత్తాడు. పసుపు పండిరచిన మరో రైతు కూడా నేరుగా తన పంటను ప్రజల మధ్యకు తీసుకెళ్లి అమ్ముకున్నాడు. సాధారణంగా రైతులు పంటలు పండిరచి వ్యవసాయ మార్కెట్ యార్డులు, హోల్‌సేల్ మార్కెట్లకు తరలించి విక్రయిస్తుంటారు. కానీ ఇక్కడ రైతులు తమ పంటలను నేరుగా రోడ్లపైకి తీసుకొచ్చి అమ్మాల్సిన పరిస్థితి రావడం పట్ల ఒకింత విస్మయం వ్యక్తం కావడం సహజం. తలుపులు మూసి నిర్బంధిస్తే పిల్లి కూడా పులిలా తిరగబడుతుంది. దేశంలో పలు ప్రాంతాల రైతులు దాదాపు అదే చేస్తున్నారు. ఇన్నాళ్లూ దళారుల మాయలోపడి గిట్టుబాటు ధరకు నోచుకోకుండా చేస్తున్న దోపిడీ వ్యవస్థకు చెంపపెట్టులా రైతులే స్వయంగా విక్రేతల అవతారం ఎత్తడం ఆహ్వానించదగ్గ పరిణామమే. రైతేరాజు అంటూ మునగచెట్టు ఎక్కించి అక్కడి నుంచి కిందికి తోసేయడం వల్ల రైతులు బతుకులు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండిరచిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్న ప్రభుత్వ వ్యవస్థల్లోని లోపాలు, దళారుల మోసాలు వెరసి.. దేశంలో రైతుగా పుట్టడం కంటే మరో పెద్ద నేరం లేదనే నిరాశావాదంలోకి రైతులను నెట్టేస్తోంది. కళ్లెదుట బహిరంగ మార్కెట్‌లో ఒక పంటకు పలుకుతున్న ధరలో సగం ధర అయినా ఆ పంటను పండిస్తున్న రైతుకు ఇవ్వకుండా నిలువు దోపిడీ చేస్తున్నారు. ఫలితంగా ఏడాదంతా కాయకష్టం చేసి విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులకు వేలకువేలు వెచ్చించి పంట సాగుచేస్తే.. ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతలను ముంచేస్తుంటే.. చేతికొచ్చిన అరకొర పంటనైనా అమ్ముకుని కాస్తయినా సొమ్ము చేసుకుందామనుకుంటే దళారులు నిలువునా దోచేస్తున్నారు. దీంతో చేతికొచ్చిన పంటకు సరైన గిట్టుబాటు లేక, అప్పులు తీర్చలేక.. రైతులు నిండా మునిగిపోతున్నారు. రైతుల వద్ద చౌకకు కొనుగోలు చేసే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి ఆకాశానికి అంటుతున్నాయి. ఈ మధ్యలో దళారుల దోపిడీ, రకరకాల ట్యాక్సులతో వ్యాపారులే లభాపడుతున్నారు తప్ప రైతులకు గిట్టుబాటు కావడం లేదు. విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న దళారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కర్నూలుకు చెందిన ఒక రైతు చేసిన ప్రయత్నం సంపూర్ణ విజయం సాధించింది. ఉల్లి పంట సాగు చేసిన యూసఫ్ అనే ఆ రైతులు దాన్ని కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డుకు తీసుకెళ్తే దళారులు చాలా తక్కువ రేటు ఆఫర్ చేశారు. ఆ రేటుకు తన పంటను ఇచ్చేస్తే నష్టపోతానని భావించిన ఆ రైతు ఆలోచించి.. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. తానే వ్యాపారి అవతారం ఎత్తాడు. ఒక మినీవ్యాన్ నిండా తాను పండిరచిన ఉల్లిని లోడు చేసి నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణానికి తీసుకెళ్లాడు. నాలుగురోడ్ల కూడలిలో నేరుగా ప్రజలకే అమ్మకానికి పెట్టాడు. కిలో రూ.15 ధర ఆఫర్ చేయడంతో ప్రజలు ఎగబడి మరీ భారీగా కొనుగోలు చేసుకుపోయారు. కేవలం ఒక్క గంట వ్యవధిలోనే మొత్తం లోడ్ అమ్ముడుపోయింది. దీనికి కారణం.. అక్కడ బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.40 పలుకుతోంది. కిలో రూ.15కు అమ్మినా తనకు మంచి లాభమే వచ్చిందని రైతు యూసఫ్ ఆనందంగా చెప్పాడు. ఇక మహారాష్ట్రలోని ఇలాంటి ఘటనే జరిగింది. దళారుల బాధ పడలేక ఓ రైతు తన పొలంలో పండిరచిన పసుపు పంటను తానే నేరుగా ప్రజల వద్దకు వెళ్లి విక్రయించుకోవడం ద్వారా లాభాలు ఆర్జించాడు. విదర్భ ప్రాంతానికి చెందిన వాశిమ్ జిల్లాకు చెందిన శివాజీ కుర్తే అనే రైతు పసుపు సాగు చేస్తుంటారు. ఆ పంటను వ్యవసాయ మార్కెట్‌లో అమ్మకానికి పెడితే కిలో రూ.130 ఇస్తారు. కానీ ఆ రేటు అంతగా గిట్టుబాటు కావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఓ ఆలోచన చేశాడు. తన పొలంలో పండిరచిన పసుపును ఈయన నేరుగా ప్రజల ఇంటి వద్దకు తీసుకు వెళ్తున్నాడు. వినియోగదారుల అవసరం మేరకు వారి ముందే పసుపు మర పట్టించి విక్రయిస్తున్నాడు. ఇందుకోసం ఆయన ఓ ప్రత్యేక వాహనంపై మరపట్టే యంత్రాన్ని అమర్చుకున్నాడు. ఈ విధంగా తాను రోజుకు 50 కిలోల వరకు పసుపు పొడిని అమ్ముతున్నట్లు శివాజీ తెలిపాడు. పసుపును వ్యాపారులకు అమ్మితే వచ్చే దానికంటే ఇలా చేయడం వల్ల రెట్టింపు ధర లభిస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకుముందు తాను పసుపు కొమ్ములను, గ్రైండర్ సెటప్‌ను ఓ ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లేవాడినని దాంతో రోజుకు కేవలం 20 కిలోల పసుపు పొడిని మాత్రమే అమ్మగలిగేవాడినని, కానీ ఇప్పుడు పంజాబ్ నుంచి రూ.2.5 లక్షల ఖర్చుతో ఒక ప్రత్యేక వాహనాన్ని తెప్పించానని, దాని సాయంతో ఇప్పుడు ప్రతిరోజూ కనీసం 50 కిలోల పసుపు పొడిని అమ్మగలుగుతున్నానని చెప్పారు. స్వచ్ఛమైన పసుపు ఇస్తుండటంతో తనకు ప్రజలు కూడా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, తూకాల్లో మోసాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం వాటిల్లకుండా ఆదుకునేందుకు ప్రభుత్వపరంగా వ్యవసాయ మార్కెట్ యార్డులు, మార్క్‌ఫెడ్ వంటి సంస్థల ద్వారా పంటలను కొనుగోలు చేయడం, అలాగే రైతులకు తగిన గిట్టుబాటు ధర లభించే వరకు పంటను నిల్వ ఉంచుకునేలా మార్కెట్ యార్డుల్లోనే శీతల, సాధారణ గిడ్డంగులు ఏర్పాటు చేయడం, గిట్టుబాటు ధర వచ్చే వరకు పంట ఉత్పత్తులపై కొంత రుణం ఇచ్చేలా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. కానీ ఇవేవీ రైతులకు అక్కరకు రావడంలేదు. అదే అదనుగా దళారులు తక్కువ రేటుకు పంటలు కొనుగోలు చేసి నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. చాలామంది పంట వేసే సమయంలోనే రైతులకు ఎంతోకొంత అడ్వాన్సుగా ముట్టజెప్పి తమకే అమ్మేలా ఒప్పందాలు చేసుకుని దోపిడీ చేస్తున్నారు. వీటికి చెక్ పెట్టాలంటే మిగిలిన రైతాంగం కూడా తమ పంటలను తామే అమ్ముకోగలిగితేనే పరిస్థితి మారుతుంది.






Comments