top of page

అలనాటి అమెరికా కుట్ర.. గుర్తుకొస్తోంది!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 days ago
  • 3 min read
  • 1953లో బ్రిటన్‌తో కలిసి ఆపరేషన్ ఎజాక్స్

  • చమురు నిక్షేపాల కోసం ప్రజాప్రభుత్వాన్ని కూల్చిన చరిత్ర

  • నియంతత్వ పాలనకు పట్టాభిషేకం

  • ఇప్పుడు మళ్లీ ఇరాన్‌పై కత్తులు దూస్తున్న అగ్రరాజ్యం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. ఇరాన్‌పై కత్తులు నూరుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశంపై సైనిక చర్యకు సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విధ్వంసక శక్తిగా పేరుగాంచిన అమెరికాకు చెందిన యూఎసఎస్ అబ్రహంలింకన్ విమానవాహక యుద్ధనౌక పర్షియన్ గల్ఫ్‌ను దాటి ఇరాన్ దిశగా ప్రయాణిస్తుండటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. తమ దేశంతో అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందుకు రాకపోవడం, ప్రజా నిరసనలను సైనిక బలంతో ఇరాన్ నాయకత్వం అణచివేస్తున్నదన్న కారణాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశాంపై కొంతకాలంగా కారాలు మిరియాలు నూరుతున్నారు. దీంతో మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా దాడికి తెగబడితే కచ్చితంగా గుణపాఠం చెబుతామని, అమెరికా యుద్ధనౌక యూఎసఎస్ అబ్రహం లింకన్‌ను కేవలం 20 నిమిషాల్లోనే సముద్రంలో ముంచేస్తామని ఇరాన్ సుప్రీం కమాండర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. తమ దేశంలో అల్లర్లు, నిరసనల వెనుక అమెరికా సీఐఏ కుట్ర ఉందన్నది ఆయన ఆరోపణ. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు రివల్యూషనరీ గార్డ్స్‌తోపాటు ఇరాన్ తురుపు ముక్కగా భావించే భాసిజ్ దళాలను కూడా రంగంలోకి దింపుతున్నారు. ఈ పరిణమాలు సుమారు 73 ఏళ్ల క్రితం నాటి అమెరికా కుట్రను గుర్తు చేస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. అప్పట్లో ఏం జరిగింది? ప్రస్తుతం ఇరాన్ అధినేత నమ్ముకుంటున్న భాసిజ్ దళం ప్రత్యేకతలేమిటి? ఒక పరిశీలన.

చమురు నిక్షేపాల కోసం

ఇరాన్‌లో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా జోక్యం ఏడు దశాబ్దాల క్రితంనాటి ‘ఆపరేషన్ ఎజాక్స’ కుట్రను గుర్తుచేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు అమెరికా సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది 1953లో అమెరికా, బ్రిటన్ కలిసి ఇరాన్‌లో అమలు చేసిన ‘ఆపరేషన్ ఎజాక్స’ కుట్రను తలపిస్తున్నదన్న చర్చ జరుగుతోంది. అప్పట్లోనూ ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టి తమకు అనుకూలంగా ఉండే సైనిక పాలకులను ఆ దేశాలు గద్దెనెక్కించాయి. 1950వ దశకంలో ఇరాన్ ప్రధాన మంత్రిగా మొహమ్మద్ మొసాదెగ్ ఉండేవారు. ఆయన ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, జాతీయవాది. బ్రిటిష్ కంపెనీల గుప్పిట్లో ఉన్న తమ దేశంలోని చమురు నిక్షేపాలను వారి నుంచి విడిపించి జాతీయం చేయాలని ఆయన ప్రభుత్వం నిర్ణయించింది. ఇది బ్రిటన్, అమెరికాలకు కంటగింపుగా మారింది. అదే జరిగితే తమ దేశాల ప్రయోజనాలు దెబ్బతింటాయని భావించిన ఆ రెండు దేశాలు ఇరాన్‌ను పాలిస్తున్న మొసాదెగ్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కుట్ర పన్ని ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఇదే ఆపరేషన్ ఎజాక్స్ పేరుతో చరిత్రలో నిలిచిపోయింది. ఇరాన్ చమురు బావులపై బ్రిటీష్ కంపెనీల పట్టును కాపాడుకోవడం ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం. కాగా ఇరాన్ ప్రధాని మొసాదెగ్ సోవియట్ యూనియన్ (రష్యా) వైపు మొగ్గు చూపితే ఇరాన్ చమురు నిక్షేపాలు రష్యా వశమవుతాయన్న అమెరికా భయం ఈ కుట్ర ఆపరేషన్‌కు వెనుక ప్రధాన కారణాలు. మొసాదెగ్ ప్రభుత్వాన్ని పడగొట్టి తమకు అనుకూలంగా ఉండే మొహమ్మద్ రెజా పహ్లావీ (షా)ని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ ఈ కుట్ర అమలు చేశాయి.

సైనిక తిరుగుబాటు

తమ ప్రభుత్వాల ఆదేశాల మేరకు 1953 ఆగస్టులో అమెరికా గూఢచారి సంస్థ (సీఐఏ), బ్రిటన్ నిఘా సంస్థ (ఎం16) సంయుక్తంగా ఆపరేషన్ ఎజాక్స్ ప్రారంభించాయి. ఇరాన్ సైన్యాన్ని, షా మద్దతుదారులను రెచ్చగొట్టాయి. దేశంలో అల్లర్లు సృష్టించి ప్రజలను మొసాదెగ్ ప్రభుత్వంపైకి ఉసిగొల్పాయి. ఫలితంగా ఆ ఏడాది ఆగస్టు 19న సైనిక తిరుగుబాటు జరిగి మొసాదెగ్ ప్రభుత్వాన్ని కూలిపోయింది. ప్రధాని మొసాదెగ్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. గహ నిర్బంధంలో ఉండగానే ఆయన 1967లో మరణించారు. తర్వాత అధికారం చేపట్టిన పెహ్లావి షా కృతజ్ఞతగా ఇరాన్ చమురులో 40 శాతం వాటాను అమెరికా కంపెనీలకు ధారాదత్తం చేశారు. ఆయన ద్వారా సుమారు 25 ఏళ్ల పాటు ఇరాన్‌లో అమెరికా అనుకూల నియంతృత్వ పాలన కొనసాగింది. ప్రస్తుతం ఇరాన్‌లో అలీ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి రావడం, అమెరికా వారికి మద్దతుగా నిలవడం చూస్తుంటే.. 1953 నాటి పరిస్థితులే కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అలీ ఖమేనీ నాయకత్వంలో ప్రజా నిరసనకారులను అణిచివేసేందుకు వారిని హతమారుస్తుండటం మాత్రం నిస్సందేహంగా దుర్మార్గ చర్యగానే చెప్పాలి.

రెండుకోట్ల పారామిలటరీ బలగాలు

తమ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజా నిరసనలను అణచివేసేందుకు, విదేశీ శక్తుల దాడులను అడ్డుకునేందుకు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ శక్తివంతమైన పారామిలటరీ దళాన్ని తయారు చేసుకున్నారు. ప్రభుత్వానికి చెందిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్(సైన్యం)కు తోడు ఈ దళం దన్ను చూసుకునే ఖమేనీ అగ్రరాజ్యమైన అమెరికాను సవాల్ చేస్తున్నారు. తమపై దాడికి పాల్పడితే ధీటుగా బదులిస్తామని హెచ్చరిస్తున్నారు. ఖమేనీ నమ్మకం పెట్టుకున్న పారామిలటరీ దళమే బాసిజ్ దళం. ఇరాన్‌లో ధరల పెరుగుదల, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ దళాన్ని రంగంలోకి దింపింది. మానవ హక్కుల సంఘాల సమాచారం ప్రకారం.. ఈ దళం జరిపిన దాడుల్లో దాదాపు 500 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ‘బాసిజ’ అనేది పర్షియన్ పదం. దీని అర్థం సమీకరణ.1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఈ దళాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా వంటి దేశాల నుంచి ఇరాన్‌ను రక్షించడానికి, దేశీయ తిరుగుబాట్లను అణచివేయడానికి దీన్ని ఒక స్వచ్ఛంద సంస్థగా ప్రారంభించారు. ఇందులో సుమారు రెండు కోట్ల మంది ఉన్నారని అంచనా. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న గ్రామీణ ఇస్లామిక్ సంప్రదాయవాదులను ఈ దళంలో చేర్చుకుంటారు. ఆ దేశ సైన్యం (రివల్యూషనరీ గార్డ్స్) ఈ దళాన్ని పర్యవేక్షిస్తుంది. స్థానిక మసీదుల ద్వారా ఈ దళ సభ్యులు ప్రజలపై నిఘా ఉంచుతారు. ఇప్పటికే బాసిజ్ దళాల ఆధ్వర్యంలో దేశంలో నిరసనలను అణచివేస్తున్న ఇరాన్ ప్రభుత్వం అమెరికాతో యుద్ధం తప్పనిసరి అయితే రివల్యూషనరీ గార్డ్స్‌తోపాటు బాసిజ్ దళాలను యుద్ధరంగంలోకి పంపేందుకు సిద్ధం చేస్తోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page