సర్కారు కరుణ.. అదనపు ధాన్యం సేకరణ?
- SATYAM DAILY
- 3 days ago
- 2 min read
కేంద్రం అనుమతి లేకుండా చేస్తే రాష్ట్రానిదే బాధ్యత
కొనుగోలు నిధులు భరించగలదా అన్న సందేహాలు
మరోవైపు చెల్లింపులపై రైతుల అనుమానాలు
గత ఏడాది మూడు నెలలు జాప్యం కావడమే కారణం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రైతుల నుంచి మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. దానివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అధికారిక లెక్కలు ప్రకారం జిల్లాలో రైతుల నుంచి ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అయినా రైతుల కళ్లాల్లో ధాన్యం, పొలాల్లో వరి కుప్పలు చాలానే ఉన్నాయి. వరి కుప్పలను నూర్చడానికి రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదా అన్న సందేహంతో రైతులు సతమతమవుతున్నారు. మరోవైపు జిల్లాలో అందుబాటులో ఉన్న మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని మిల్లర్లు ప్రభుత్వాన్ని కోరుతునే ఉన్నారు. కొనుగోలుకు అవకాశం ఇస్తే రైతుల ఖాతాలో నగదు జమ చేయడానికి తగినన్ని నిధులు కార్పొరేషన్ వద్ద ఉండాలి. పంట కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులకు నగదు జమ చేస్తున్నట్లు చెబుతున్నా ఆటూ ఇటుగా వారం రోజులు పడుతోంది. ఆదనంగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే రైతులకు నగదు చెల్లింపులో కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వ ýక్ష్యం దెబ్బతింటుందని అధికారులు భావిస్తున్నారు. కొనుగోలు చేసిన 24 గంటల్లో కాకపోయినా వారం రోజుల్లో జమ చేసినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. అంతకుమించి జాప్యం జరిగితే రైతులు రొడ్డేక్కే పరిస్థితి వస్తుంది. అదనపు ధాన్యం సేకరణపై నిర్ణయం తీసుకోవడానికి అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలంటే రూ.239 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా పౌర సరఫరాల కార్పొరేషన్ రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. కానీ ఒకసారి ప్రొక్యూర్‌మెంట్ పూర్తి అయిన తర్వాత కేంద్రం సడలింపులు ఇస్తే తప్ప మళ్లీ ధాన్యం సేకరణకు వీలుండదు. ఒకవేళ అలా చేస్తే.. ఆ భారం రాష్ట్రాలపై పడుతుంది. అందువల్లే కేంద్రం నిర్దేశించిన లక్ష్యం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఆ ప్రక్రియను నిలిపేస్తుంది.
రైతుల వద్ద ఇంకా 2.50 లక్షల టన్నులు
2025`26 ఖరీఫ్‌లో జిల్లాలో సాగు విస్తీర్ణం 4.24 లక్షల ఎకరాలు కాగా ధాన్యం దిగుబడి 11.71 లక్షల మెట్రిక్ టన్నులుగా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో స్థానిక అవసరాలకు 2.34 లక్షల మెట్రిక్ టన్నులు ఉండిపోగా మార్కెట్‌లో 9.37 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంటాయని అంచనా వేశారు. కాగా ఇందులో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి సీఎంఆర్ ద్వారా మిల్లింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు 614 రైతుసేవా కేంద్రాల ద్వారా 1,25,628 మంది రైతుల నుంచి ఆరు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రూ.1274.99 కోట్లు చెల్లించారు. అధికారుల అంచనా ప్రకారం రైతుల వద్ద మరో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయి. వీటిలో 50 వేల టన్నులను గోదావరి జిల్లాలకు చెందిన మిల్లర్లు అనధికారికంగా కొనుగోలు చేసి తరలించుకుపోయారు. ప్రభుత్వం వీటిని అడ్డుకోకపోవడం, ఆ పనే తాము చేస్తే కేసులు పెడుతున్న ప్రభుత్వ తీరుపై ఆసంతప్తి వ్యక్తం చేస్తున్న జిల్లా మిల్లర్లు రైతుల వద్ద ఉన్న మిగులు ధాన్యాన్ని అధికారికంగా కొనుగోలు చేసే అవకాశమైనా కల్పించాలని నెల రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం రైతుల వద్ద ఇంకా మిగిలి ఉన్న ధాన్యాన్ని కోనుగోలు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు కొనుగోలు చేసే ధాన్యానికి సకాలంలో నగదు చెల్లింపులు చేస్తుందా లేదా అన్న సందేహం రైతులను పీడిస్తోంది. ఎందుకంటే.. గత ఏడాది ఖరీప్ సీజన్ సేకరణ పూర్తి అయిన తర్వాత రైతుల వద్ద మిగిలిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించినా.. నగదు చెల్లింపుల కోసం మూడు నెలలు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ అనుభవమే ఇప్పుడు అనుమానాలు రేపుతోంది.










Comments