top of page

అవినీతిని ప్రశ్నిస్తే ‘భరోసా’ కట్!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 8 hours ago
  • 2 min read
  • మత్స్యకారుడిపై అధికారుల జులుం

  • బోట్లను హోల్డ్‌లో పెట్టి కక్షసాధింపు చర్యలు

  • ‘డమ్మీ’ కలాసీలను పెట్టాలంటూ ఒత్తిడి..

  • రూ. 1.30 కోట్ల స్కామ్‌పై విచారణకు డిమాండ్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు ఓ నిజమైన మత్స్యకారుడికి అధికారులు తీవ్ర అన్యాయం చేసిన ఘటన పోలాకి మండలం అంపలం పంచాయతీ రాజారాంపురం గ్రామంలో వెలుగుచూసింది. అర్హత ఉన్నా కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగా సదరు మత్స్యకారుడికి చెందిన రెండు బోట్లను ‘మత్స్యకార భరోసా’ పథకానికి అర్హత లేకుండా అధికారులు హోల్డ్‌లో పెట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. రాజారాంపురం గ్రామానికి చెందిన మైలపిల్లి సూరిబాబు అనే మత్స్యకారునికి రెండు వేటబోట్లు ఉన్నాయి. ఒకటి ఆయన పేరు మీద, మరొకటి ఆయన భార్య పేరు మీద నమోదై ఉన్నాయి. ఈ బోట్లపై వేరే కులానికి చెందిన పేద మత్స్యకారులు కలాసీలుగా చేరుకుని నిత్యం సముద్రంపై వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్నారు.

డమ్మీలను పెట్టాలని ఒత్తిడి

ఈ ఏడాది వీరికి రావాల్సిన ‘మత్స్యకార భరోసా’ నిలిచిపోవడంతో బాధితుడు స్థానిక వీఎఫఏ, ఎఫ్‌డీవోలను సంప్రదించారు. అయితే అధికారులు స్పందిస్తూ.. ‘మీ బోట్లలో వేరే కులం వారు వేటకు వెళ్తున్నారు, వారిని తీసేసి మీ కులం వారినే పెట్టుకోవాలి’ అని నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడారు. దానికి బాధితుడు నిరాకరించగా.. ‘అయితే మీ కులం వారి పేర్లతో డమ్మీ కలాసీలను ఆన్‌లైన్‌లో చూపించండి.. లేదంటే భరోసా రాకుండా చేస్తాం’ అని బెదిరింపులకు దిగారు. గ్రామంలోని మిగిలిన అందరి బోట్లలో వేరే కులం వారు ఉన్నా అర్హులుగా గుర్తించిన అధికారులు, కేవలం తన బోట్లకు మాత్రమే ఈ నిబంధన పెట్టి వివక్ష చూపారని సూరిబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.1.30 కోట్ల స్కామ్..

గ్రామంలో అసలు సముద్రంలో వేట చేయకుండా, కేవలం తుప్పల్లో బోట్లు పెట్టుకుని దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును దొంగ బిల్లులతో కొల్లగొడుతున్న భారీ స్కామ్‌పై గతంలో సూరిబాబు జిల్లా కలెక్టర్‌కు ‘గ్రీవెన్స’ ద్వారా ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణకు వచ్చిన ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు.. కనీసం ఆ దొంగ బోట్లను వెరిఫై చేయకుండా, రిపోర్టును పక్కదారి పట్టించారు. పైగా ఫిర్యాదు చేసిన సూరిబాబును గ్రామ రచ్చబండలో కూర్చోబెట్టి, ‘కంప్లైంట్ విత్ డ్రా చేసుకోకపోతే ఊరిలో మీకే గొడవలు వస్తాయి’ అని బహిరంగంగా బెదిరించారు. అధికారుల ప్రేరేపణతో కొందరు స్థానికులు ఆయనపై తిరుగుబాటు చేయడంతో, ప్రాణభయంతో ఆయన సంతకం పెట్టి ఫిర్యాదును వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అయితే సూరిబాబుకు సంబంధించిన బోట్లలోనే మత్స్యకారులు కానివారు ఉన్నారా? అంటే.. అదీ కాదు. ఎందుకంటే.. ఈ పరిసర ప్రాంతాల్లో అనేక పంచాయతీల్లో మత్స్యకారులతో మమేకమైపోయి బీసీ, ఓసీ సామాజికవర్గాలకు చెందినవారు కూడా కలాసీలుగా వేటకు వెళ్తున్నారు. పోనీ మిగిలిన బోట్లలో మత్స్యకారులు కానివారు కలాసీలుగా వెళ్తే.. మత్స్యకార భృతి ఇవ్వకుండా ఉన్నారా? అంటే.. అదీ కాదు. అనేక చోట్ల ఓసీ, బీసీలకు కూడా కలాసీలుగా వెళ్తే మత్స్యకార భృతి అందించారు. మరి సూరిబాబు బోట్లకే ఎందుకు కలాసీలుగా మత్స్యకారులను తెచ్చుకోమని అధికారులు చెప్పారు? అంటే.. పోలాకి మండలంలో ఉన్న అనేక పంచాయతీల్లో అనర్హులకు దాదాపు రూ.1.30 కోట్లు మత్స్యకార భృతి ఇచ్చేశారని సూరిబాబు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. చివరకు పోలాకి మండలంతో సంబంధం లేని అనేకమందిని ఇక్కడ అర్హుల జాబితాలో చూపించి మత్స్యశాఖ అధికారులు సొమ్ములు కొట్టేశారు. దీనిపై విచారణ జరపాలని కోరినందుకే తనపై కక్షసాధింపునకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మండలంలో మరీ ముఖ్యంగా అంపలాం పంచాయతీలో విశాఖపట్నం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, గార, పోలాకి, జలుమÖరు, ఎచ్చెర్ల, నరసన్నపేట మండలాలకు చెందిన ఇతర కులాల వ్యక్తుల పేర్లను లబ్ధిదారులుగా చేర్చారు. అటువంటప్ప్పుడు సూరిబాబు బోటుల్లో వెళ్తున్న కలాసీలకు వచ్చిన అభ్యంతరమేమిటో మత్స్యశాఖ అధికారులు చెప్పడంలేదు సరికదా.. అనర్హులతో సూరిబాబుపై ఒత్తిడి తెప్పించి ఫిర్యాదును వెనక్కు తీసుకునేలా చేశారని ఆయనే ‘సత్యం’కు తెలిపారు.

చేపల వేటకు మత్స్యకారులతో పాటు రజక, నాsTÖబ్రాహ్మణ, పల్లి, రెడ్డి, నెయ్యల కులానికి చెందిన సుమారు 20 మంది చేపల వేటకు వెళతారు. వీరిని ప్రభుత్వం లబ్ధిదారులుగా గుర్తించి మత్స్యకార భరోసా నిధులు జమ చేస్తారు. కానీ సూరిబాబు బోటులో మాత్రం మత్స్యకారులు లేరని చెబుతున్నారట. రాజారాంపురం గ్రామంలో 728 మందిని మత్స్యకార భరోసాకు అర్హులుగా గుర్తించారు. వాస్తవానికి ఈ గ్రామంలో 600 జనాభాయే ఉంటారని భోగట్టా.

దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలి

కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడనే ఒకే ఒక్క కారణంతో అధికారులు ప్రతీకార చర్యలకు దిగి, ప్రస్తుతం సూరిబాబుకు చెందిన రెండు నిజమైన బోట్లను ఆన్‌లైన్‌లో హోల్డ్‌లో పెట్టారు. నిజాయితీగా వేటకెళ్లే తమకు అన్యాయం చేస్తూ, దొంగబోట్లకు కోట్లు అప్పగిస్తున్నారని, ఉన్నతాధికారులు లేదా సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో ఇక్కడ విచారణ జరిపిస్తే రూ.1.30 కోట్ల ప్రభుత్వ ధనం కుంభకోణం బయటపడుతుందని, కలెక్టర్ వెంటనే స్పందించి తమ బోట్లకు మత్స్యకార భరోసా వచ్చేలా న్యాయం చేయాలని బాధితుడు మైలపిల్లి సూరిబాబు డిమాండ్ చేస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page