విచారణలన్నీ వృథాయేనా?
- Prasad Satyam
- 10 hours ago
- 2 min read
మరోసారి ముసిముసి ముగింపు!
పీజీ రిలీవ్ వసూళ్లపై చర్యలు శూన్యం
జాతీయ ఎస్టీ కమిషన్ గడువు ముగిసినా స్పందించని యంత్రాంగం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో కొద్ది రోజుల వ్యవధిలోనే ముచ్చటగా మూడోసారి జరిగిన విచారణ కూడా నవ్వులపాలైపోబోతుందా? అంటే అవుననే సమాధానం ఇచ్చినవారే ఎక్కువగా ఉన్నారు. MNO,FNO లుగా పని చేస్తున్న 120 మందిలో నలుగురికి జీతాలు ఇచ్చి, 116 మందిని పస్తులుంచిన కేసులో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం పాఠకులకు విదితమే. దీనిపై త్రీమెన్ కమిటీని విచారణకు నియమిస్తే గురువారం ముసిముసి నవ్వుల మధ్య సమర్ధింపుల కాగితాలతో విచారణ ముగిసినట్లు తెలుస్తుంది. గతంలో వైద్యఆరోగ్యశాఖ పరిధిలోనే పీహెచ్‌సీల్లో వైద్యులుగా పని చేసి, పీజీలో సీటు వచ్చిన తర్వాత సర్వీస్ చూపిస్తూ రిలీవ్ చేయడానికి సంబంధిత సిబ్బంది వేలల్లో లంచాలు అడిగారంటూ నేరుగా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై కూడా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. సంబంధిత అధికారులు అడిగినంత మేరకు సొమ్ములిచ్చుకొని, ఆలస్యంగా రిలీవై పీజీకి డాక్టర్లు వెళ్లిపోయారు గానీ ఫిర్యాదు మీద చర్యలు తీసుకున్నట్టు ఎక్కడా దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో సచివాలయాలకు హెల్త్ సెక్రటరీలుగా వచ్చిన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే విషయంలో రోస్టర్ పాటించలేదని, దాని వల్ల ఎస్టీ అభ్యర్థులు తొమ్మిది మంది నష్టపోయారని వెలుగులోకి రావడంతో ఈ అంశం దేశ జాతీయ ఎస్టీ కమిషన్ వరకు వెళ్లింది. రెండుమÖడు సిట్టింగుల తర్వాత 15 రోజుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి తొమ్మిది మంది ఆదివాసీలకు పదోన్నతులు ఇవ్వాలని ఎస్టీ కమిషన్ స్పష్టం చేసింది. వారు ఇచ్చిన గడువు ముగిసిపోయి చాలా రోజులైనా ఇంతవరకు ఆమేరకు ఆదివాసీలకు న్యాయం జరగలేదు. కట్ చేస్తే ఆర్‌వోఆర్ రిజిస్టర్ పోయిందంటూ తాజాగా స్థానిక టూటౌన్‌లో ఓ ఫిర్యాదు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. తాము సూపరింటెండెంట్లుగా, ఏవోలుగా, గుమస్తాలుగా ఇక్కడికి రాకముందు నుంచే ఆర్‌వోఆర్ బుక్కు లేదని దబాయించేశారు. కానీ ఆదివాసీలకు అన్యాయం జరిగిందని, వారి తరఫున సమాచార హక్కు చట్టం మేరకు వివరాలు అడిగిన వాబ యోగికి ఆర్‌వోఆర్ బుక్ జిరాక్స్ కాపీని అధికారికంగా సంతకం పెట్టి, స్టాంప్ వేసిమరీ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం వరకు ఉన్న పుస్తకం రికార్డు ఇప్ప్పుడు జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలు పాటించాల్సివచ్చేసరికి మాయమవడం ఓ కట్టుకథ. ఇప్ప్పుడు తాజాగా MNO,FNOల జీతాల చెల్లింపుల విషయంలో నలుగురికి జీతాలు వేయడం, 116 మందికి ఇవ్వకపోవడానికి కారణం ఆశావర్కర్లకు జీతాలు చెల్లించాల్సి ఉండటమేనని, వారితో పాటు నలుగురికి ఇచ్చేశామంటూ విచారణ అధికారుల ముందు సంబంధిత ఏవో, సూపరింటెండెంట్ సమర్ధించుకున్నారని భోగట్టా. వాస్తవానికి ఆశ వర్కర్ల జీతాలకు, MNO,FNO జీతాల ఆప్కాస్ పద్దుకి సంబంధం లేదు. ఈ విషయం బయటి నుంచి వచ్చినవారిలో ఒకరికి తెలుసు. అయితే మిగిలిన వారిని మధ్యపెట్టడం కోసం దీనిని ఎవరూ క్వశ్చన్ చేయలేదని తెలుస్తుంది. నలుగురికి మాత్రమే జీతాలు ఇవ్వడం వెనుక తానెటువంటి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదని డీఎంహెచ్‌వో విచారణ అధికారులకే కాదు, అంతకు ముందు గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు కూడా స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ ఒక్క ఆధారంతో చర్యలు తీసుకోవచ్చు. కానీ అది జరిగేటట్టు కనిపించడంలేదు.





Comments