top of page

ఆయన తనిఖీల యాత్ర.. వసూళ్లదే కీలకపాత్ర

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 3 hours ago
  • 2 min read
  • అయ్యగారొచ్చారు.. ముడుపు కట్టండ హో

  • నియంత్రణ తప్పుతున్న అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్

  • తనిఖీలు, రెన్యూవల్స్, అనుమతుల పేరుతో వసూళ్లు

  • నలుగురు ఏజెంట్ల ద్వారా యథేచ్ఛగా అక్రమాల పర్వం

  • పెద్ద మెడికల్ షాపులు, ల్‌సేల్ ఏజెన్సీలే టార్గెట్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

అయ్యగారు తనిఖీ చేశారంటే ఆ షాపు సీజ్ కావాల్సిందే. మెమో ఇచ్చారంటే.. తదుపరి చర్యల్లేకుండా ముడుపులతో మూతి కట్టాల్సిందే. ఆయన ఎవరిని కలవడానికి రమ్మన్నా.. ఆయన్ను ఎవరు కలిసినా ఏదో మూడినట్లే. వెరసి ఆయన విచ్చలవిడితనానికి నియంత్రణ లేక సంబంధిత వ్యాపార వర్గాల వారందరూ బాధితులుగా మారిపోతున్నారు. జిల్లా సహాయ ఔషధ నియంత్రణాధికారి (ఏడీసీ) చంద్రరావు తీరుపై ఎవరిని కదిలించినా కథలు కథలుగా బయటకొస్తున్నాయి. జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ యూనియన్ నాయకులను ఏమాత్రం పట్టించుకోని ఆయన ఏకంగా నలుగురు ఏజెంట్లును పెట్టుకుని మరీ అక్రమ వ్యవహారాలు సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక షాపు తనిఖీ చేసి క్లీన్‌చిట్ ఇవ్వడానికి గతంలో తీసుకున్న మామూళ్ళు  రేటును కూడా అమాంతం పెంచేసి రూ.30 వేల వరకు పెంచేశారని, ఆ మొత్తం ఇవ్వకపోతే నానా కొర్రీలు పెట్టి.. లోపాల పేరుతో కేసులు పెడతామని బెదిరిస్తుంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏవైనా మెడికల్ షాపులు, హోల్‌సేల్ ఏజెన్సీల్లో తనిఖీ చేసి మెమో ఇచ్చిన సందర్భాల్లో జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ యూనియన్ ద్వారా సామరస్యంగా పరిష్కరించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. యూనియన్ పెద్దలను పక్కన పెట్టేసి శ్రీనివాస్, శ్రీనివాసరావు, కిరణ్‌తో పాటు మరో వ్యక్తిని ఏజెంట్లుగా పెట్టుకున్న ఏడీసీ వారి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజు రూ.30 వేలుకు మించి వ్యాపారం సాగించే షాపులు, ఏజెన్సీలను లక్ష్యంగా చేసుకుని తన తాబేదారుల ద్వారా తనిఖీల పేరుతో భయపెట్టి అక్రమ వసూళ్లు సాగిస్తున్నారని తెలిసింది. రాష్ట్రంలో ఎక్కడా లేని నిబంధనలను ఇక్కడ బూచిగా చూపుతున్నారు. చివరికి ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లోని ఫార్మసీ సెంటర్లు కూడా ఏడీసీ బాధితులుగా మారిపోయాయి. కొత్తగా మెడికల్ షాపు లేదా హో ల్‌సేల్ ఏజెన్సీ పెట్టాలంటే అనుమతి కోసం అయ్యగారికి రూ.లక్షల్లో ముట్టజెప్పాల్సి వస్తుందని ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ షాపుల్లో 26 డిగ్రీల ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి ఏసీ, గ్లాస్ కప్‌బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హెచ్చరిస్తున్నారని షాపుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక టర్నోవర్ ఉన్న మెడికల్ షాపులు, ఏజెన్సీలనే ఏడీసీ టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గుర్తింపు పేరుతో వేధింపులు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు చెందిన రెండు డిజిటల్ గుర్తింపులు కచ్చితంగా కలిగి ఉండాలని షాపులపై ఏడీసీ ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. డిిజిటల్ గుర్తింపు పొందడానికి తగిన గడువు ఇవ్వకుండా, సాంకేతక సమస్యలు తలెత్తినా వాటికి పరిష్కారం చూపించకుండా గుర్తింపు లేనివారిపై కేసులు నమోదు చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రతి మెడికల్ షాపు హెల్త్ ఫెసిలిటీ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. తద్వారా ఆ షాపునకు డిజిటల్ గుర్తింపు లభిస్తుంది. ఇది ప్రభుత్వ గుర్తింపు పొందిన డిజిటల్ ప్రిస్క్రిప్షన్లు, ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌కు సహాయ పడుతుంది. లైసెన్స్‌డ్ ఫార్మసిస్ట్‌లను హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌గా గుర్తిస్తారు. దీని కోసం ఫార్మసిస్ట్‌లు విద్యార్హతలు, రిజిస్ట్రేషన్ వివరాలతో ఫార్మసిస్ట్ ప్రొఫైల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడు వారికి ఐడీ వస్తుంది. అది చట్టబద్ధంగా మందులు ఇవ్వడానికి అర్హులని నిర్థారించే డిజిటల్ ఐడెంటిటీ కార్డు లాంటిది. ఫార్మసిస్టులు ఇందులో కచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం దీనికి కొంత గడువు ఇచ్చింది. కానీ ఆ గడువుతో సంబంధం లేకుండా, నమోదులో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నా పట్టించుకోకుండా డిజిటల్ గుర్తింపులు పొందలేదంటూ ఈమధ్య కాలంలో నగరంలో పదుల సంఖ్యలో మెడికల్ షాపులు, ఏజెన్సీలను సీజ్ చేశారు. మళ్లీ వీటిని తెరుచుకోవడానికి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. తమ లైసెన్స్ రెన్యూవల్ కోసం ఫార్మసిస్టు రోజంతా ఏడీసీ కార్యాలయంలో వేచి ఉండాల్సి వస్తున్నదని, మహిళా ఫార్మాసిస్టులకు అక్కడ వేధింపులు ఎదురవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page